అక్రమ మద్యం,బెల్ట్‌ షాపులపై నిఘా | Surveillance on illicit liquor and belt shops | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం,బెల్ట్‌ షాపులపై నిఘా

Feb 10 2020 3:02 AM | Updated on Feb 10 2020 3:02 AM

Surveillance on illicit liquor and belt shops - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు రోజువారీగా ఉదయం, మధ్యాహ్నం ఎటువంటి విధులు నిర్వహించాలి.. ఏ వారంలో, ఏ నెలలో ఎలాంటి పనులు చేయాలనే వివరాలతో జాబ్‌ చార్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ప్రత్యేకంగా మహిళలు, పిల్లల సంరక్షణలో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించింది. వీరు చేపట్టాల్సిన విధుల జాబ్‌ చార్ట్‌ను సైతం రూపొందించి గ్రామ సచివాలయాలకు చేర వేసింది. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ, సేవించడం వంటి వాటిని నిరోధించేందుకు తనిఖీలు నిర్వహించాలని, ఎక్కడైనా అక్రమంగా మద్యం తయారు చేస్తున్నా, బెల్ట్‌ షాపులు నిర్వహిస్తున్నా లేదా లైసెన్స్‌ లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులకు తెలియజేయడంతో పాటు సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని నిర్దేశించింది. వీరు చేపట్టాల్సిన విధులు ఇలా ఉన్నాయి. 
- ఉదయం అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించాలి. సమయానికి తెరుస్తున్నారా.. పరిశుభ్రంగా ఉంచుతున్నారా.. లేదా పరిశీలించాలి. పిల్లల హాజరును, వారికి నాణ్యమైన ఆహారం అందిస్తున్నది లేనిదీ తనిఖీ చేయాలి. 
- తమ పరిధిలోని గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఆరేళ్లలోపు పిల్లలను గుర్తించి అంగన్‌ వాడీ కేంద్రాల్లో నమోదు చేయించాలి.
గిరిజన మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో వైఎస్సార్‌ అమృత హస్తం, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద సరఫరా చేస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలిస్తూ.. లబ్ధిదారులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి.
- అంగన్‌వాడీ వర్కర్స్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా పౌష్టికాహార లోపం, తక్కువ బరువుగల పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.
అంగన్‌వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లతో కలిసి రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులు, పౌష్టికాహార లోపంగల పిల్లల్లో అవగాహన కల్పించేందుకు వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలి.
బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు యువతీ యువకుల వయస్సు వెరిఫై చేశాక పెళ్లికి అర్హులుగా సర్టిఫికెట్‌ జారీ చేయాలి. స్పందన దరఖాస్తులను స్వీకరించి, పై అధికారులకు పంపించాలి. వీటిపై అవసరమైతే క్షేత్ర స్థాయి సందర్శనకు వెళ్లాలి.
- శిశు గృహాలు, ఎన్‌జీవో హోమ్స్, వృద్ధాశ్రమాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్లను సందర్శించి సహాయ సహకారాలను అందించాలి.
- తమ పరిధిలోని పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, హోటల్స్, ఆసుపత్రులు, వ్యవసాయ క్షేత్రాల్లో బాల కార్మికులు పనిచేస్తుంటే వారిని గుర్తించి తల్లిదండ్రుల సహకారంతో వారిని స్కూళ్లలో చేర్పించాలి.
- గృహ హింస, లైంగిక వేధింపులు, బాల్య వివాహాల గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. స్కూల్స్, కాలేజీలు, బాలికల హాస్టల్స్, వర్కింగ్‌ మహిళల హాస్టళ్లను సందర్శించి, మహిళలపై నేరాలు నివారించేందుకు అవగాహన పెంపొందించాలి.
ప్రతి దరఖాస్తును రిజిస్టర్‌ చేయాలి. నిర్ధారించిన సమయంలోగా చర్యలు తీసుకోవాలి. అసహజ మరణాలు, గుర్తు తెలియని మృతదేహాలపై వెంటనే పోలీసులు, ఎమ్మార్వోకు తెలియజేయాలి.
- ప్రతి నెలా 30 లేదా 31వ తేదీన ఎస్సీ, ఎస్టీ చట్టాలపై ఆయా వర్గాల్లో అవగాహన, చైతన్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.
జనవరి 24వ తేదీన జాతీయ గర్ల్స్‌ చైల్డ్‌ డే నిర్వహించాలి. ఫిబ్రవరి నెలలో మైనర్‌ బాలికల సంరక్షణలో భాగంగా లైంగిక వేధింపుల నిరోధం, బాల్య వివాహాల నివారణపై చర్యలు తీసుకోవాలి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా డే నిర్వహించాలి. మే 10వ తేదీన మదర్స్‌ డే నిర్వహించాలి. జూన్‌ 12వ తేదీన ప్రపంచ బాల కార్మికుల నివారణ డే నిర్వహించాలి. నవంబర్‌ 14న అంతర్జాతీయ పిల్లల డే నిర్వహించాలి. నవంబర్‌ 20న అంతర్జాతీయ పిల్లల హక్కుల డే నిర్వహించాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement