‘50 శాతానికి మించి రిజర్వేన్లు ఇవ్వడం న్యాయం కాదు’

Supreme Court Temporarily Suspends Local Body Elections In AP - Sakshi

రాష్ట్రంలో స్థానిక సమరానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. ప్రభుత్వం బీసీలకు 34 శాతం ,ఎస్సీలకు 19.08 శాతం,ఎస్టీలకు 6.77 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది, ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసింది. 50 శాతానికి మించి రిజర్వేన్లు ఇవ్వడం న్యాయ సమ్మతం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో  విచారణ జరపాలని హైకోర్టును ఆదేశించింది. 

సాక్షి, కడప: రాష్ట్రంలో 59.85 శాతం రిజర్వేషన్లతో ఎన్నికల నిర్వహణను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు బుధవారం తాత్కాలికంగా స్టే విధించింది. ఈ అంశం హైకోర్టు విచారణ అనంతరం తేలనుంది. హైకోర్టు ఏం చెబుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ కోర్టు రిజర్వేషన్లు 10 శాతం తగ్గించి ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. అదే జరిగితే బీసీ రిజర్వేషన్లు మాత్రమే తగ్గించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ లెక్కన బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గుతాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందన్నది చూడాలి. రిజర్వేషన్లు తగ్గితే బీసీల వైఖరి ఎలా ఉంటుంది..? వారు మిన్నకుండి పోతారా.? లేక తిరిగి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా అన్నది వేచి చూడాలి. ఇదే జరిగితే మరింత మంది కోర్టు మెట్లెక్కే అవకాశాలు లేకపోలేదు. ఈనేపథ్యంలో ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యపడుతుందా అన్నది ప్రశ్నార్థకమే.  

చదవండి: ఏపీ : రిజర్వేషన్ల జీవోపై సుప్రీం కోర్టు స్టే

ప్రభుత్వం బీసీలకు 34 శాతం,ఎస్సీలకు 19.08 శాతం,ఎస్టీలకు 6.77 శాతం మొత్తం కలిపి 59.85 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది, ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసింది. జిల్లాలో 790 గ్రామపంచాయతీల్లో 247 పంచాయతీలను బీసీలకు,129 స్థానాలు ఎస్సీలకు, 22 స్థానాలు ఎస్టీలకు, మిగిలిన 392 స్థానాలను జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 14 బీసీలకు, 9 ఎస్సీలకు, 1 ఎస్టీకి, 26 స్థానాలు జనరల్‌కు కేటాయించారు.50 మండలపరిషత్‌ అధ్యక్షుల స్థానాల్లో 13 బీసీలకు, 7 ఎస్సీలకు, 1 ఎస్టీలకు, 29 స్థానాలను జనరల్‌కు కేటాయించారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపగా ఎలెక్షన్‌ కమిషన్‌ హైకోర్టుకు సమర్పించింది.

దీంతో పాటు ఫిబ్రవరి 15 నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మార్చి 3వతేదీనాటికి గ్రామపంచాయతీ ఎన్నికలను సైతం పూర్తి చేస్తామని కోర్టుకు తెలిపింది. ఈ మేరకు జనవరి 17న షెడ్యూల్‌ సైతం వెలువరిస్తామని చెప్పింది. దీంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది.నేతలు అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలు పెట్టారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అందరూ జనవరి 17న ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ లోగా బుధవారం సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించడంతో స్థానిక ఎన్నికల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top