పౌల్ట్రీకి వడదెబ్బ

summer effect on Poultry forming East Godavari - Sakshi

వడగాడ్పులకు కళ్లు తేలేస్తున్న కోళ్లు    

అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన మరణాలు

రోజుకు 5.6 లక్షలకు పైగా మృత్యువాత

15 శాతం మేర తగ్గిన గుడ్ల ఉత్పత్తి

ఐదు రోజుల్లో రూ.58.97 కోట్ల మేర నష్టం

తూర్పుగోదావరి, మండపేట: మండుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులు తాళలేక కోళ్లు కళ్లు తేలేస్తున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్లు ఉత్పత్తి పడిపోయింది. గడిచిన ఐదు రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ. 58.97 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అంచనా. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి.

జిల్లాలో 400 వరకు పౌల్ట్రీలు ఉండగా, వివిధ దశల్లో సుమారు 2.8 కోట్లు కోళ్లున్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్లున్నాయి. రోజుకు సాధారణంగానే 0.05 శాతం ఉండే కోళ్ల మరణాలు ప్రస్తుత ఎండలతో రెండు శాతానికి పెరిగాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. గత ఐదు రోజులుగా 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది మరణాలు పెరిగాయని కోళ్ల రైతులు అంటున్నారు. రోజుకు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున సుమారు రూ. 200 మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ మేరకు గత ఐదు రోజుల వ్యవధిలో కోళ్ల మరణాలు రూపంలో జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు రూ.56 కోట్లు మేర నష్టం వాటిల్లింది.

మరోపక్క ఎండల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షలు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ. 3.6 పైసలుండగా రోజుకు రూ. దాదాపు రూ. 59.4 లక్షలు చొప్పున గత ఐదు రోజుల్లో రూ.2.97 కోట్లు మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. కోళ్ల మరణాలు, గుడ్లు ఉత్పత్తి పడిపోవడం ద్వారా గత ఐదు రోజుల్లో రూ. 58.97 కోట్లు మేర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఈ నెల 12వ తేదీ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్‌సీ, నూకల ధరలు గత నెల రోజుల వ్యవధిలో 40 నుంచి 60 శాతం మేర పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను అధిక ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తడిసి మోపెడవుతున్న నిర్వహణ భారం   
అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్‌ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లుతో నిర్వహణ భారం పెరిగిపోతోంది.

పాత నిల్వలనుకోళ్ల రైతులకు ఇవ్వాలి
ప్రస్తుత ఎండలు పౌల్ట్రీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. సివిల్‌ సప్లై ఎఫ్‌సీఐ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు అందజేయాలి. ఈ విషయమై రాష్ట్ర అసోసియేషన్‌ ద్వారా ఇప్పటికే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.– పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి, నెక్‌ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు, మండపేట మండలం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top