నిప్పుల కుంపటి

Summer Effect on East Godavari - Sakshi

కర్ఫ్యూను తలపిస్తున్న రహదారులు

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న జనం

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

కాకినాడ సిటీ: భానుడు భగభగ మండిపోతున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వారం పది రోజులుగా తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు. శనివారం ఏకంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని రాజమహేంద్రవరంలో అత్యధికంగా 42.9 డిగ్రీలఉష్ణోగ్రత నమోదయింది. మార్చి ప్రారంభంలోనే 36 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా ఏప్రిల్‌ 19వ తేదీ వరకు క్రమంగా పెరుగుతూ 39 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతూ ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్తున్నారు. కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లకు గిరాకీ పెరిగింది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఎండల తీవ్రతకు ఉపాధి పనులు చేసే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేస్తున్నారు. అయినప్పటికీ ఉదయం 9 గంటల నుంచే భానుడు నిప్పుల వాన కురిపిస్తుండడంతో తట్టుకోలేకపోతున్నామని కూలీలు వాపోతున్నారు. ఇప్పుడే ఇంతగా ఎండలు మండుతుంటే మే నెలలో ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రక్షణ చర్యలు తీసుకోవాలి...
వడదెబ్బ తగులకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ వీలైనంతగా బయటకు రాకపోవడమే మేలని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే గొడుగు, లేదా కాటన్‌ చేతిరుమాళ్లు, టవళ్లు తలపై కప్పుకొని, టోపీలు పెట్టుకుని రావాలంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. గంటకోసారి పరిశుభ్రమైన నీటితోపాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని, కూల్‌డ్రింక్‌లు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

ఇంకా పెరుగుతుంది...
ఈసారి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఎండలూ మండిపోతున్నాయి. ప్రస్తుతం కాకినాడలో 39, రాజమహేంద్రవరంలో 41–42 డిగ్రీల మధ్య కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌ చివరి నుంచి మే నెలంతా 45–48 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ చివరి వారం దాకా 40–43 డిగ్రీలు దాటుతుంది. ఇక మే నెలలో సూర్యుడు తన అసలు ప్రతాపాన్ని చూపనున్నాడు. ఈ నెలలో 45–48 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

తగు జాగ్రత్తలు పాటించాలి...
వేసవిలో ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటికి వెళ్లకపోవడం మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి. కుండలో నీటిని తాగడం మంచిది. కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. చిన్న పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో విరేచనాలు, అలసట, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించాలి. ప్రతి పీహెచ్‌సీ సెంటర్‌లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నాం.– డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్, జిల్లా వైద్యాధికారి, కాకినాడ

ఎండలకు బయటకు వెళ్లలేని పరిస్థితి
ఎండలు అధికమయ్యాయి. బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలైనా ఎండ వేడి తగ్గడం లేదు. వేడి గాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది. కూలి పనులకు వెళ్లాలంటేనే భయమేస్తుంది. వడగాడ్పులు వీస్తున్నాయి. వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలను తీసుకుంటున్నాం.                 – బి. రాము, కాకినాడ

గతంతో పోలిస్తే అధికం
గతంతో పోలిస్తే ఎండలు మండుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే రక్షణగా టోపీలు, రుమాళ్లను ధరించి వెళ్తున్నాం. కూలీ పనులకు వెళ్తున్నా ఎండలో పనిచేయలేక పోతున్నాం.
ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే పనులు చేస్తున్నాం. పిల్లలను వీలైనంతగా బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– ఎండీ బాషా,   కాకినాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top