విదేశీ విద్యతో బంగారు భవిత

Students Like To Study In Foeign Universities - Sakshi

విదేశాల్లో చదివేందుకు  పోటీపడుతున్న జిల్లా విద్యార్థులు

పరిశోధనాత్మక విద్యాబోధనే ఇందుకు కారణం

చదువుతూనే  సంపాదించే వెసులుబాటు

నేటి యువతరం విదేశీ విద్యపై క్రేజ్‌ పెంచుకుంది.  ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలు విదేశాల్లో ఉండడం, పైగా పరిశోధనాత్మక విద్యాబోధన అందిస్తుండడం విద్యార్థులనుఆకర్షిస్తోంది. చదువుకుంటూనే సంపాదించే వెసులుబాటు ఆయా యూనివర్సిటీలుకల్పిస్తుండడంతో విద్యార్థులు విదేశీ విద్యపై మోజు పెంచుకుంటున్నారు. అయితే ఏయే కోర్సులకు ఏయే దేశాల్లోని యూనివర్సిటీలను ఎంచుకోవాలి, నకిలీ యూనివర్సిటీల బారినపడకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఏయే అర్హత పరీక్షలు రాయాలి, అవి ఎప్పుడు నిర్వహిస్తారు వంటి వివరాలను నిపుణులు వివరిస్తున్నారు.

తిరుపతి: అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అనే సంస్థ విడుదల చేసిన ఓపెన్‌ డోర్స్‌ నివేదిక ప్రకారం 1998–99లో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కేవలం 707 మంది మాత్రమే. తాజాగా 2017–18 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 1.86 లక్షలకు చేరుకుంది. వీరందరూ స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌) కోర్సుల్లో విద్యనభ్యసించేవారు మాత్రమే. యూఎస్‌ఏ కా కుండా 2017లో ఉన్నత విద్య కోసం  కెనడాకు వెళ్లిన వారు దాదాపు లక్ష మంది, ఆస్ట్రేలి యాకు 65,471మంది, జర్మనీకి 15,529 మంది వెళ్లారు. జిల్లా నుంచి గత విద్యా సంవత్సరంలో దాదాపు 600 మందికిపైగా విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ తెలిపిన వివరాల మేరకు 2017–18లో బీసీ కార్పొరేషన్‌ నుంచి 15మంది, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి ఆరుగురు, కాపు కార్పొరేషన్‌ నుంచి 9మంది, మొత్తం 30మంది విదేశాలకు వెళ్లారు. వీరందరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం అందిస్తోంది. మరో రూ.10 లక్షలు విద్యా రుణం కింద బ్యాంకులు మంజూరు చేశాయి.

ఇంటర్‌ తరువాత విదేశాల్లో బీటెక్‌
సాట్‌(స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌–పేపర్‌ బేస్డ్‌): ఇంటర్‌ తరువాత అమెరికాలోని పేరుగాంచిన యూనివర్సిటీల్లో బీటెక్‌ చేయడానికి సాట్‌(స్కాలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌–పేపర్‌ బేస్డ్‌) అర్హత పరీక్షను రాయాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివేటప్పుడే (ఏడాది ముందే) సాట్‌లో మంచి స్కోర్‌తో ఉత్తీర్ణత సాధిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ పొందవచ్చు.  క్రిటికల్‌ రీడింగ్, రైటింగ్‌ అండ్‌ మ్యాథ్స్, ఇంగ్లీష్‌ వ్యాసంలో పరీక్ష నిర్వహిస్తారు. సాట్‌లో అర్హత పొందిన వారికి ఐదేళ్లు చెల్లుబాటు ఉంటుంది.  ప్రతి ఏడాది డిసెంబర్, మార్చ్, మే, జూన్‌లో పరీక్షలు ఉంటాయి. సాట్‌ స్కోర్‌ను అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌(యూకె), సింగపూర్, కెనడా దేశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. సాట్‌కు సంబంధించిన అధికార వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.ఛిౌ  ్ఛజ్ఛ b్చౌటఛీ.ౌటజలో మరింత సమాచారం పొందవచ్చు.

ఏసీటీ(పేపర్‌–బేస్డ్‌):అమెరికాలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అం దుబాటులో ఉన్న మరో మార్గం అమెరికన్‌ కా లేజ్‌ టెస్టింగ్‌(ఏసీటీ). ఏసీటీలో సాధించిన స్కోరు ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఇంగ్లీష్, మ్యా థ్స్, సైన్స్, రీడింగ్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. అలాగే యాక్ట్‌ ప్లస్‌ పరీక్షలో ఆప్షనల్‌గా 30నిమిషాల పాటు హైస్కూల్‌ స్థాయి ఇంగ్లీష్‌ రచనా నైపుణ్యాన్ని పరీక్షించే రాత పరీక్ష ఉంటుంది. ప్రతి ఏడాది ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్‌లో ఐదుమార్లు పరీక్ష నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.్చఛ్టి.ౌటజలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

ఇతర అర్హత పరీక్షలు
ఇంటర్‌ తరువాత విదేశాల్లో బీటెక్‌ చేయడానికి సాట్, ఏసీటీతో పాటు ఇతర అర్హత పరీక్షలు ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టం(ఐఈఎల్‌టీఎస్‌), టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ యాజ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌(టోఫెల్‌/టీఓఈఎఫ్‌ఎల్‌), పియర్‌సన్‌ టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌(పీటీఈ).

టాప్‌ 10 అమెరికన్‌ యూనివర్సిటీలు
లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రిక టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచంలోని టాప్‌ 10 విశ్వవిద్యాలయాలు అమెరికా నుంచే వస్తున్నాయి. 2018లోనూ మొదటి స్థానాన్ని మసాచుసెట్స్‌(ఎంఐటీ), ద్వితీ య స్థానం హార్వర్డ్, మూడో స్థానంలో స్టాన్‌ఫోర్డ్‌ వంటి యూనివర్సిటీలున్నాయి. విద్యలో నాణ్య మైన రీసెర్చ్, విభిన్న దేశాల సంస్కృతుల సమ్మేళనం, లెర్నింగ్‌ బై డూయింగ్‌(చదువుతూనే సంపాదించడం), సుస్థిరమైన ప్లేస్‌ మెంట్స్‌తోపాటు గ్లోబల్‌ సిటిజన్‌గా ఎది గేందుకు ఇక్కడ ఆస్కారం ఉంది.

 విదేశాల్లో ఎంబీఏ
అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఎంబీఏ చెయ్యడానికి జీమాట్‌(గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) పరీక్ష రాయాలి. ప్రముఖ యూనివర్సిటీలు జీమాట్‌ స్కోర్‌ నే అర్హతగా పరిగణిస్తాయి. అమెరికాలో ఎంబీఏ అడ్మిషన్‌కు పని అనుభవం తోడైతే మంచి యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. జీమాట్‌ స్కోర్‌ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. అధికారిక వెబ్‌సైట్‌ ఠీఠీఠీ.జఝ్చఛి.ఛిౌఝ.

ఇతర అర్హత పరీక్షలు
విదేశాల్లో ఎంబీఏ చేయడానికి జీమాట్‌తో పాటు ఇతర అర్హత పరీక్షలు ఉన్నాయి. ఇంగ్లండ్‌(యూకే)లో ఎంబీఏ చేయడానికి టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్, ఆస్ట్రేలియాకు ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్‌/పీటీ ఈ, కెనడాలో ఐఈఎల్‌టీఎస్‌/జీఆర్‌ఈ, న్యూజి లాండ్‌లో ఐఈఎల్‌టీఎస్‌ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది.

డిగ్రీ తర్వాత విదేశాలకు...
బీటెక్‌ తరువాత అమెరికాలో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(ఎంఎస్‌) చేయడానికి జీఆర్‌ఈ(గ్రాడ్యుయేట్‌ రికార్డ్‌ ఎగ్జామినేషన్స్‌)తో పాటు ఐటీఎల్‌టీఎస్‌/టోఫెల్‌లో ఏదో ఒక పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఈ పరీక్షలు ఏడాది పొడవునా నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం 340 మార్కులకు 300 పైగా స్కోర్‌ సా ధించిన వారికి అమెరికాలో మంచి యూ నివర్సిటీల్లో అడ్మిషన్‌ లభిస్తుంది. ఆరు నెలల ముందే విద్యార్థులు ఆయా పరీక్షల్లో సాధించిన స్కోర్స్‌ ను తమ వద్ద ఉంచుకుని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలి. జీఆర్‌ఈలో సాధించిన స్కోరు ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా 130కిపైగా దేశాల్లోని దాదాపు 3,200 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవ చ్చు. అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, కెన డా, జర్మనీ వంటి దేశాల్లో ఎంఎస్‌ చెయ్యడానికి ఐఈఎల్‌టీఎస్‌ పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షను ఏడాదిలో నాలుగు మార్లు నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోరును 140 దేశాల్లోని సుమారు 6 వేల విద్యాసంస్థలు అర్హతగా పరిగణిస్తున్నాయి. అలాగే టోఫెల్‌ అర్హత పరీక్షలో సాధించిన స్కోరు రెండేళ్ల పాటు చెల్లుబాటు ఉంటుం ది. అమెరికా, కెనడా, బ్రిటన్‌తోపాటు 130దేశాల్లోని దాదాపు 10వేల కళాశాలలు, యూనివర్సిటీలు ఈ స్కోరును అర్హతగా పరిగణిస్తాయి. ఈ పరీక్షను ఏడాది పొడవునా వివిధ తేదీల్లో 50రోజులకుపైగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

ఏయే దేశాల్లో  ఏయే కోర్సుల ఎంపిక
1. అమెరికా: కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బయోలాజికల్‌ సైన్సెస్, ఎంబీఏ విద్యకు అమెరికా ప్రసిద్ధి. ఏటా రెండు మార్లు అడ్మిషన్‌(ఆగస్టు, జనవరి) నిర్వహిస్తారు. అమెరికాలో ఎంఎస్‌/ ఎంబీఏ చేయడానికి 16 ఏళ్ల డిగ్రీ అవసరం. ఇండియాలో బీటెక్‌ మినహా మిగిలినవన్నీ 15 ఏళ్ల డిగ్రీలు కావడంతో పైన తెలిపిన కోర్సులకు బీటెక్‌ విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎంఎస్‌ తరువాత ఉద్యోగ అన్వేషణకు ఏడాది, ఆ తరువాత ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) కింద మరో ఏడాది అక్కడ ఉండొచ్చు. స్టెమ్‌(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌) విద్యార్థులు అదనంగా 17 నెలలు అక్కడే ఉండొచ్చు. దీనికి అర్హత పరీక్ష జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌/టోఫెల్, ఎంబీఏకు జీమాట్‌.

2. ఆస్ట్రేలియా: ఇంజినీరింగ్‌లో కెమికల్, సివిల్, ఏరోస్పేస్‌ బ్రాంచ్‌లు ఇక్కడ ప్రసిద్ధి. మెల్‌బోర్న్, న్యూసౌత్‌వేల్స్, సిడ్నీ, మోనాన్, క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీలు  ఇంజినీరింగ్‌ విద్యకు పేరుగాంచినవి. ఇక్కడ చదువుకుంటూనే పార్ట్‌ టైం జాబ్స్‌ చేసుకోవడానికి యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. ఉద్యోగ అన్వేషణలో భాగంగా రెండేళ్ల పాటు విద్యార్థులు అక్కడ ఉండొచ్చు. ఐఈఎల్‌టీఎస్‌/పీటీఈ అర్హత పరీక్షలు.

3.జర్మనీ: తక్కువ ఖర్చుతో ఇంజినీరింగ్‌లో విదేశీ పట్టా పొందాలనుకునే వాళ్లకు జర్మనీ ఉత్తమం. ఈ దేశంలో పబ్లిక్‌ ఫండెడ్‌ యూనివర్సిటీలు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ట్యాషన్‌ ఫీజులు తీసుకోకపోవ డం విశేషం. గ్రాడ్యుయేట్‌ కోర్సులకు మా త్రం తక్కువ మొత్తంలో ఫీజులు ఉంటాయి. మంచి ప్రతిభ ఉన్నవారికి 90శాతం స్కాలర్‌షిప్‌ అందించడంతో పాటు చదువు పూర్తైన వెంటనే ఉద్యోగావకాశాలను  ఆ దేశం కల్పిస్తుంది. ఆటోమేటివ్‌ ఇంజినీరింగ్‌ చేరాలనుకునే వారు జర్మనీకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. హంబోల్డ్, మ్యూనిచ్, బెర్లిన్, ఆర్‌డబ్ల్యూటీహెచ్‌ ఆచన్, కిర్లోస్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఈ దేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు. అయితే  అత్యధిక శాతం విద్యాబోధన జర్మన్‌ భాషలోనే ఉండడంతో జర్మన్‌ భాషా పరిజ్ఞానం తప్పనిసరి.

4.ఇంగ్లండ్‌(యూకే): మేనేజ్‌మెంట్‌(ఎంబీఏ), హ్యుమానిటీస్, ఇంజినీరింగ్‌ విద్యకు యూకే ప్రసిద్ధి. రెండేళ్ల మాస్టర్స్‌ డిగ్రీని ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసే వెసులుబాటు ఈ దేశంలో ప్రత్యేకత. ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఈ దేశంలోనే ఉన్నాయి. అయితే కోర్సు పూర్తైన తరువాత ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాకుంటే వెంటనే స్వదేశం తిరిగొచ్చేయాలి.

పేద విద్యార్థులు రాణించొచ్చు
ప్రతిభ ఉంటే పేద వారైనప్పటికీ విదేశాల్లో విద్యనభ్యసించొచ్చు. ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్లతోపాటు విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లోనూ స్కాలర్‌షిప్స్‌ పొందవచ్చు. మా సంస్థలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, జీమ్యాట్‌కు శిక్షణ ఇస్తున్నాం. విదేశీ విద్యపై మరింత సమాచారం కావాలంటే 96981 23456 నంబరులో సంప్రదించవచ్చు.  
– ఎన్‌.శ్రీధర్, డైరెక్టర్, కెరీర్‌ లాంచర్, తిరుపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top