కీచక గురువు

Students Protest Infront of School in Chittoor - Sakshi

విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన  

ప్రధానోపాధ్యాయుడి తీరుపై నిరసన

పాఠశాల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థుల ధర్నా  

విద్యార్థులకు మంచిని నేర్పాల్సిన గురువు అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఉపాధ్యాయ లోకానికే తలవంపులు తెస్తున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.  జిల్లా కేంద్రంలోని సంతపేట ఓబనపల్లి హౌసింగ్‌ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికలపై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

చిత్తూరు కలెక్టరేట్‌ :  ‘ఈ హెచ్‌ఎం మాకొద్దు’ అంటూ జిల్లా కేంద్రంలోని సంతపేట ఓబనపల్లి హౌసింగ్‌ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెచ్‌ఎం సుధీర్‌ వారిని శారీరకంగా, మానసికంగాహింసిస్తున్నాడని చెబుతున్నారు. చెప్పిన పనులు చేయడం లేదనే కారణంతో రక్తం వచ్చేలా పిల్లల్ని కొడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని వాపోతున్నారు. అమ్మాయిలతో చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  తమ పిల్లల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎం సుధీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. 

సమస్య ఉన్నతాధికారుల వద్దకు
ఈ సమస్య విద్యాశాఖ చిత్తూరు డివిజన్‌ డీవైఈవో పురుషోత్తం దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులను, టీచర్లను విచారించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ హెచ్‌ఎం సుధీర్‌పై వచ్చిన ఆరోపణలపై ఎంఈఓతో సమగ్ర విచారణ చేయించి నివేదిక తెప్పించుకుంటామన్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.  

రక్తం వచ్చేలా కొట్టాడు
నా కొడుకు జాఫర్‌ను కంటి దగ్గర రక్తం వచ్చేలా కొట్టాడు. పిల్లలు చదవకపోతే దండించాలి. మరీ విచక్షణారహితంగా ప్రవర్తించడం సరికాదు. గతంలో ఎన్నిసార్లు హెచ్‌ఎంకు చెప్పినా తన తీరు మార్చుకోలేదు.      – వహీదా, విద్యార్థి తల్లి

పరుగెత్తలేదని చేతులపై కొట్టాడు
పరుగెత్తలేదనే కారణంతో రెండో తరగతి చదివే చరణ్‌ను చేతుల తిప్పించి వేళ్లపై తీవ్రంగా కొట్టాడే. ఏమైనా అడిగితే మీ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తాడు.  ఏడో తరగతి చదివే బాలికల పట్ల చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ హెచ్‌ఎంను మార్చేయాలి. ఇలాంటి వారి వల్లే ప్రభుత్వ బడుల పేరు పోతోంది.– దుర్గ, విద్యార్థి తల్లి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top