ధర్మవరంలో విద్యార్థి లోకం గర్జించింది. ‘సమైక్య’ నినాదంతో కదం తొక్కింది. దేహం ముక్కలైనా.. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమంటూ సమరనాదం పూరించింది.
సాక్షి, అనంతపురం : ధర్మవరంలో విద్యార్థి లోకం గర్జించింది. ‘సమైక్య’ నినాదంతో కదం తొక్కింది. దేహం ముక్కలైనా.. రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వబోమంటూ సమరనాదం పూరించింది. రాజకీయ పార్టీల స్వార్థపూరిత చర్యలను ముక్తకంఠంతో నిరసించింది. ‘పద్ధతి’ మార్చుకోకపోతే ‘పని’పడతామంటూ గట్టిగా హెచ్చరించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం ధర్మవరంలోని కళా జ్యోతి సర్కిల్‌లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యార్థి గర్జన’ విజయవంతమైంది.
ధర్మవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారికి మద్దతుగా అన్ని ప్రభుత్వ శాఖల జేఏసీ నాయకులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, వృద్ధులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సమైక్యగళాన్ని విన్పించారు. విభజనపరుల గుండెలదిరేలా సమర శంఖం పూరించారు. జిల్లా వ్యాప్తంగా 74వ రోజైన శనివారం సమైక్య పోరు హోరెత్తింది.
ఉద్యమకారులకు వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు అండగా నిలుస్తూ... ఉద్యమస్ఫూర్తిని రగిలింపజేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి జేఏసీ నాయకులు గుత్తిలోని ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా ఇంటి ఎదుట సమైక్య సభ నిర్వహించారు. అసెంబ్లీలో ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తామంటూ ఎమ్మెల్యే నుంచి హామీ పత్రం తీసుకున్నారు. గుంతకల్లులో జేఏసీ, వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిల్చొని, తలపై కుర్చీలను అడ్డంగా పెట్టుకుని నిరసన తెలిపారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సప్తగిరి కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైల్‌రోకో చేపట్టారు.
కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో కమ్మ సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. కదిరి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పట్టణంలో బైక్ ర్యాలీ చేశారు. కళ్యాణదుర్గంలో ఎన్‌జీఓలు రిలే దీక్షలు ప్రారంభించారు. సమైక్యవాదులు పట్టణంలో అర్ధనగ్న ప్రదర్శన, మానవహారం చేపట్టారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తిప్పేస్వామి పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో మడకశిరలో ర్యాలీ చేశారు. పుట్టపర్తిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పెనుకొండలో పాత్రలు, దోమతెరలు అమ్ముతూ నిరసన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తానని రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జేఏసీ నాయకుల ఎదుట ప్రమాణం చేసి.. హామీ పత్రం అందజేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యమాన్ని కొనసాగించాలని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని జేఏసీ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు. తెలంగాణపై తీర్మానాన్ని ఓడించాలంటూ జేఏసీ నాయకులు తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డికి విన్నవించారు. రాష్ట్రం విడిపోతే పనులు కూడా దొరకవంటూ బెళుగుప్పలో జేఏసీ నాయకులు వ్యవసాయ కూలి పనులు చేస్తూ నిరసన తెలిపారు. అనంతపురంలో హౌసింగ్ ఉద్యోగులు, ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.