
మాట వినకుంటే వేటే!
అధికారులూ... మాకు సలాం కొట్టి గులాం అంటే సరే.. లేదా మీరు తట్టా బుట్టా సర్దేసుకోవడం బెటర్.. మున్సిపాలిటీల్లో అధికారుల పట్ల తెలుగు తమ్ముళ్ల తీరిది.
సాక్షి, రాజమండ్రి :అధికారులూ... మాకు సలాం కొట్టి గులాం అంటే సరే.. లేదా మీరు తట్టా బుట్టా సర్దేసుకోవడం బెటర్.. మున్సిపాలిటీల్లో అధికారుల పట్ల తెలుగు తమ్ముళ్ల తీరిది. ప్రస్తుతం విధుల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తమకు అనుకూలంగా పనిచేయని వాళ్లు ఉంటే వాళ్లని తక్షణం సాగనంపేందుకు కొత్త ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. ఈ నెల 19 తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక సలాం కొట్టని అధికారులను సాగనంపి.. తమ వారిని రప్పించుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఒత్తిళ్లు ప్రారంభం
తమకు అనుకూలంగా పనిచేసేవారిని తెచ్చుకునేందుకు రాజమండ్రి, ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేయించాలని తెలుగు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమండ్రిలో కమిషనర్ తమకు అనుకూలంగా లేరని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే పుష్కరాల్లో అంతా తమకు అనుకూలంగా ఉండాలని చూస్తున్న టీడీపీ నేతలు కమిషనర్‌పై ముందుగా గురి పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే కన్నా తానే సిటీలో పట్టు సాధించాలని చూస్తున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఈ దిశగా అప్పుడే పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే బుచ్చయ్య పుష్కరాల ఏర్పాట్ల వంకతో తన నియోజకవర్గంలో కన్నా అర్బన్‌లో తిరుగుతూ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవహారం బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నా పైకి చెప్పుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. పుష్కరాల సందర్భంగా చేపట్టే పనులు పూర్తిగా తన కనుసన్నల్లోనే జరగాలని భావిస్తున్న ఈ సీనియర్ నేత వివిధ శాఖల్లో ఉన్న అధికారుల పనితీరును కూడా సమీక్షిస్తున్నారు. కలిసిరాని అధికారులను బదిలీ చేయించి, తలాడించే వారిని రప్పించుకోవాలని ఆయన ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.
ఎన్నికలే వేదికగా
ఏలేశ్వరం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి డివిజన్‌లలో మెజారిటీ లభించినా రిజర్వేషన్ ప్రకారం చైర్మన్ అభ్యర్థి గెలవలేదు. ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు గాలం వేసిన నేతలు చైర్మన్ ఎన్నికల్లో తమకు కమిషనర్ పూర్తిగా సహకరించాలని భావిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసే విప్‌ల విషయంలో పూర్తిగా తమకు కమిషనర్ అనుకూలంగా వ్యవహరించని పక్షంలో అధికారిని బదిలీ చేయించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి అయిన చినరాజప్ప నియోజకవర్గంలోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో కమిషనర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని తెలుస్తోంది. సామర్లకోట కమిషనర్ స్వయంగా బదిలీపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తలాడించకపోతే బదిలీయే : జిల్లాలోని నలుగురు కమిషనర్లు స్థానిక ఎమ్మెల్యేలు ఎలా చెబితే అలా సర్దుకుపోయేందుకు రాజీ పడ్డట్టు తెలుస్తోంది. మరో మూడుచోట్ల కమిషనర్లు మున్సిపల్ ఎన్నికలకు ముందే బదిలీలపై వచ్చారు. ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అనంతరం ఈ అధికారులు తాము చెప్పినట్టు తలాడించకపోతే బదిలీ వేటు వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.