
’ఎర్ర’ బంగారంపై వెర్రి
ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ దొరకని అరుదైన వృక్ష సంపద.. ఎర్రచందనం.
అంతరించిపోతున్న అరుదైన వృక్షసంపద
రాష్ట్రంలో మినహా ప్రపంచంలో మరెక్కడా లేని ఎర్రచందనం వృక్షాలు
టన్ను విలువ రూ. 20 లక్షలు పైనే
దొంగతనంగా నరికించి సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు
ఈ ఏడాదిలోనే 500 టన్నుల దుంగలు స్వాధీనం
సాక్షి, చిత్తూరు
ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచల అడవుల్లో తప్ప ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ దొరకని అరుదైన వృక్ష సంపద.. ఎర్రచందనం. శాస్త్రీయంగా పెట్రోకార్పస్ సానతలీనస్ అని పిలిచే ఈ వృక్షాలు.. పాలకొండ, శేషాచలం పర్వత శ్రేణుల్లోని కడప, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా.. కొంత భాగం కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించి ఉన్నాయి. మొత్తం ఐదు జిల్లాల్లో 5,160 చదరపు కిలోమీటర్ల పరిధిలో మూడు లక్షల హెక్టార్లలో ఈ ఎర్రచందనం అడవులు విస్తరించి ఉన్నాయి. అత్యంత అరుదైన ఈ వృక్షాల అంతర్జాతీయ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. మన దేశంలో ఎర్రచందనం కలపను పెద్దగా వినియోగించరు. కానీ.. చైనా, జపాన్, సింగపూర్, మలేసియా వంటి దేశాల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. సంగీత వాద్య పరికరాలు, ఖరీదైన ఫర్నిచర్‌తో పాటు.. ఔషధాల తయారీకి కూడా అక్కడ ఎర్రచందనాన్ని వినియోగిస్తారు. అంతర్జాతీయ విపణిలో టన్ను ఎర్రచందనం విలువ దాదాపు రూ. 20 లక్షలకు పైగా ఉందని అనధికారిక అంచనా. దీనినే స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. శేషాచల అడవుల్లోని ఎర్రచందనం వృక్షాలను ఇష్టానుసారం నరికివేసి.. దుంగలను దొంగ రవాణా చేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారు. ఫలితంగా అరుదైన ఎర్రచందనం వృక్షాలు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.
స్మగ్లింగ్ దందా సాగుతోందిలా...
ఎర్రచందనం కీలక స్మగ్లర్లు ప్రధానంగా చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాల్లోని మధ్యవర్తులు సహకరిస్తున్నారు. ఈ మధ్యవర్తులు స్థానికులతో పాటు, సరిహద్దుల్లోని తమిళనాడు ప్రాంతం వారికి లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చి.. వారిని అడవుల్లోకి పంపి ఎర్రచందనం వృక్షాలను నరికిస్తుంటారు. అలా నరికిన ఎర్రచందనం దుంగలు సమీపంలోని రోడ్డు పాయింట్‌కు రాగానే స్మగ్లర్లు ముందే ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఎక్కించి.. రాత్రికి రాత్రి చెన్నై, బెంగళూరుల్లోని రహస్య గోడౌన్లకు తరలిస్తారు. స్మగ్లర్లు బియ్యం, రాగులు, ఎర్రగడ్డలు ఇతర సాధారణ వస్తువులు సముద్రమార్గంలో మలేసియా, చైనా, దుబాయ్‌లకు; రోడ్డు మార్గంలో బర్మా, నేపాల్‌లకు ఎగుమతి చేసే విధంగా నకిలీ పర్మిట్లను సృష్టిస్తారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వీటిని ఎగుమతి చేసేందుకు కంటెయినర్లు బుక్ చేస్తారు. ఆ కంటెయినర్లను సెంట్రల్ ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేసి సీల్ వేసిన తర్వాత.. వాటిని సమీపంలోని రహస్య గోడౌన్లకు తీసుకెళ్లి సీల్ తీసి.. సరుకుల మధ్యలో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తారు. మళ్లీ సీల్ అతికించి ఆ కంటెయినర్లను.. నేరుగా చెన్నై, కోచి, మంగళూరు, ముంబై, గుజరాత్‌లోని ముంద్రా, కాండ్ల పోర్టుల ద్వారా కార్గో షిప్పుల్లోకి ఎక్కిస్తారు. అలా ఓడల ద్వారా సింగపూర్, ఇండొనేసియా, మలేసియా, దుబాయ్ పోర్టులకు.. అక్కడినుంచి హాంకాంగ్, చైనాలకు ఎర్రచందనం రవాణా అవుతోంది. ఇక్కడి స్మగ్లర్ గ్యాంగ్‌కు సంబంధించినవారే ఆయా ప్రాంతాల్లోని వ్యాపారులకు ఎర్రచందనం దుంగలను నేరుగా అందిస్తారు. దానికి సంబంధించిన సొమ్మును హవాలా మార్గంలో తెప్పించుకుంటారు. ఇక రోడ్డు మార్గంలో అయితే.. ఇదే విధమైన కంటెనర్లలో ఒకవైపు నేపాల్ నుంచి నేరుగా చైనాకు తరలిస్తారు. మరోవైపు అసోం, మణిపూర్, మిజోరం సరిహద్దుల గుండా బర్మాకు.. అక్కడి నుంచి చైనాకు తరలిస్తారు.
చెట్లు నరుకుతూ పట్టుబడ్డా శిక్ష స్వల్పమే...
ఎర్రచందనం వృక్షాలు నరికేందుకు కూలీలు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల వరకూ అడ్వాన్‌సను స్మగ్లర్లు ఇస్తున్నారు. వారు అడవిలోకి చేరేందుకు ప్రత్యేక వాహన సదుపాయం, ఆహారం సమకూరుస్తారు. ఒక దుంగ నరికితే రూ. 1,500 వరకు గిట్టుబాటు అవుతోంది. ఒకవేళ పట్టుబడితే ఏపీ అటవీశాఖ చట్టం సెక్షన్ 20(1)డీ కింద నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడాదిలోపు శిక్ష పడుతుంది. బెయిల్ వెంటనే లభిస్తుంది. దీంతో స్వల్పకాలిక శిక్షను లెక్క చేయకుండా మళ్లీమళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు, తిరువళ్లూరు, కంచి, సేలం, కృష్ణగిరి, ధర్మపురి జిల్లాల నుంచి ఎక్కువగా వస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరు సైతం ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డాగా ఉంది. ఇక్కడ కొందరు చోటా నాయకులు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లు గడించి ఇప్పుడు రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నారు. వీరిలో కొందరికి అధికార పార్టీ నాయకుల అండదండలూ ఉన్నాయి.
పట్టుబడిన దుంగలు 15 వేల టన్నులు పైనే...
ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అటవీశాఖ పదేళ్లుగా దాడుల్లో జరిపి 15 వేల టన్నులకు పైగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో 8,600 టన్నులను గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు ఇటీవల కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 6,000 కోట్లకు పైమాటే. గతేడాది వరకూ అటవీశాఖ మాత్రమే స్మగ్లర్లపై దాడులు చేసేది. 2013 నుంచి పోలీసుశాఖ కూడా రంగంలోకి దిగింది. పోలీసు, అటవీశాఖలు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాయి. డీఎస్‌పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఐదు జిల్లాల పరిధిలో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్మగ్లర్ల వేట సాగిస్తున్నారు. అయినా స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో గత మూడేళ్లలో నాలుగు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ. 15 కోట్లకు పైగా విలువైన 500 టన్నుల ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వెయ్యి మందికి పైగా ఎర్రచందనం నరికేవారిని, 50 మంది రెండో శ్రేణి స్మగ్లర్లను అరెస్టు చేశారు.