త్వరపడండి.. అమ్మకానికి షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు

Shift Operator Posts For Sale In Giddalur Constituency - Sakshi

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు పూర్తవకుండానే ప్రారంభోత్సవాలు

ఆ వెంటనే మార్కెట్‌లోకి షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు

పరాకాష్టకు చేరిన టీడీపీ నేతల అవినీతి

 సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): ఎన్నికల నియమావళి వస్తోందని పనులు పూర్తికాక ముందే ప్రారంభించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో ఖాళీగా ఉండే షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టును రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు సొమ్ము చేసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడూ ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నినాదంతో అధికార టీడీపీ నాయకులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మళ్లీ అధికారం వస్తుందో లేదో అన్న అనుమానంతో అర్హత కలిగిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను డబ్బులిచ్చిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా తిరగలేక కనీసం డబ్బులు కడితేనైనా తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో నాయకులు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు లేవని పెళ్లి కూడా చేసుకోకుండానే అలాగే ఉండిపోతుఆన్నరు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్‌ వంటి ఉపాధి కోర్సులు చదువుకున్నా సొంతంగా దుకాణాలు పెట్టుకున్నా పోటీ ఎక్కువ కావడంతో కనీసం ఇల్లు గడవడానికి సంపాదించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగమైనా ఏదో ఒక రోజు మనసున్న ముఖ్యమంత్రి రాకపోతాడా..తమ ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయకపోతాడా.. అన్న ఆశతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించి షిఫ్ట్‌ ఆపరేటర్‌లుగా చేరుతున్నారు.

ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఐదు పోస్టులు
ప్రతి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో పనిచేసేందుకు ఐదుగు ఉద్యోగులను ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన నియమిస్తారు. ఇందులో ఒకరు వాచ్‌మన్‌ కాగా మిగిలిన నలుగురు షిఫ్ట్‌ ఆపరేటర్లుగా ఉంటారు. ఇందులో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతకు ఒక పోస్టు ఇవ్వగా మిగిలిన పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న అధికార టీడీపీ నాయకులు డిమాండ్‌ సృష్టించి నిరుద్యోగుల నుంచి అందిన కాడికి పిండుకుంటున్నారు. తమ గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో పోస్టుల్లో తనకు వాటా ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు ముందుగానే అడ్వాన్సులు పుచ్చుకున్నారు. తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తోందని నగదు ఇచ్చిన వారు నాయకుల వెంట తిరుగుతున్నారు.

టీడీపీలో చేరితే పోస్టులంటూ ఎర
గిద్దలూరు నియోజకవర్గంలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ.. షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులిస్తాం..తమ పార్టీలో చేరండని మాజీ సర్పంచ్‌లు, కుల సంఘాల నాయకులను బతిమిలాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముండ్లపాడులో ఓ నాయకునికి రెండు పోస్టులు ఇస్తామని కండువా కప్పారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచికి రెండు షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు ఇస్తానంటూ ఎరవేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ల్లో ఆరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పొదలకుంటపల్లెలో ఉన్న సబ్‌స్టేషన్‌ ఇటీవల పూర్తయింది. మిగిలిన కొత్తపల్లె, బురుజుపల్లె, అనుములపల్లె, చిన్నకంభం, నల్లగుంట్ల గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లు నిర్మాణాలు పూర్తికాక ముందే పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో సబ్‌ స్టేషన్‌లో నాలుగు పోస్టుల చొప్పున మొత్తం 24 పోస్టులు విక్రయానికి పెట్టారు.

ఎన్నికల నియమావళి రావడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాత తేదీలతో నియామకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పొదలకుంటపల్లె గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో నేటికీ కొత్త ఉద్యోగులు విధుల్లో చేరలేదు. అయినా ఈ నెల 5వ తేదీనే నియామకాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలానే అన్ని సబ్‌స్టేషన్‌లలోని పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.1.60 కోట్లు నిరుద్యోగుల నుంచి లాగేసుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నియామకాలు చేపడుతున్న విద్యుత్‌ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై విద్యుత్‌ శాఖ మార్కాపురం డీఈఈ టి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top