
పైఫొటోలో కన్పిస్తున్న మహిళ ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీకి చెందిన చిట్టెమ్మ. ఈమెకు ముగ్గురు సంతానం. తమలాగా పిల్లలు కూలీ పనులకు వెళ్లకుండా చదువుకోవాలన్న తపన ఉంది. కానీ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలనీ నుంచి పిల్లలను పంపడం కష్టంగా మారింది. గత్యంతరం లేక బడి మాన్పించింది. ప్రభుత్వం కాలనీలో పాఠశాలకు స్థలం కేటాయించింది. తాత్కాలికంగా షెడ్డు ఏర్పాటు చేసి, విద్యావలంటీర్‌ను నియమిస్తేనైనా తమ పిల్లలు చదువుకుంటారని అభిప్రాయ పడుతోంది.
మేం బడికి వెళ్లం అని మారాం చేసే పిల్లలను చూశాం.. బడికి పంపేది లేదనే తల్లిదండ్రులనూ చూసి ఉంటాం.. అందుకు భిన్నంగా మా పిల్లలను చదివిస్తాం..బడి చూపండి అని తల్లిదండ్రులు.. బడికిపోతామని పిల్లలు’ వేడుకుంటున్నా..ఉరవకొండ పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరామిరెడ్డి కాలనీవాసులకు ‘బడి’ భాగ్యం కలగలేదు. పలక, బలపం పట్టి భుజానికి సంచి వేసుకొని బడి బాట పట్టాల్సిన చిన్నారులెందరో ఊరిబయట మగ్గుతున్నా పట్టించుకునేవారు లేరు.
ఉరవకొండ: పట్టణంలోని బళ్లారి బైపాస్ వద్ద ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వైపు ఉన్న శివరామిరెడ్డి కాలనీ 20 ఏళ్ల క్రితం ఏర్పడింది. కాలనీలో సంచారజాతులు, బుడగజంగం, జోగి, పిచ్చికుంట్ల, ఎరికల కులస్తులకుసంబంధించి 350 కుటుంబాలున్నాయి. వీరికి ప్రభుత్వం స్థలాలు మంజురు చేయించడంతో పాటు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు మంజూరు చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో కాలనీ ఉంది. కాలనీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం లాంటి మౌలిక వసతులూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. కాలనీలో దాదాపు ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు 280 మంది పిల్లలున్నారు. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పిల్లలను అతికష్టం మీద పంపేవారు. పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే రద్దీగా ఉన్న 42వ జాతీయ రహదారి దాటుకొని వెళ్లాలి. గతేడాది పాఠశాలకు వెళ్లడానికి వెళ్తున్న ఇద్దరు చిన్నారులను ద్విచక్రవాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కాలనీవాసులు తమ పిల్లలను బడికి పంపాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.
కలెక్టర్ చొరవతో పాఠశాల మంజూరు
శివరామిరెడ్డి కాలనీవాసుల అవస్థలు గుర్తించి వందలాది పిల్లల భవిష్యత్ కోసం అప్పటి కలెక్టర్ కోన శశిధర్ తాత్కాలిక భవనంలో ప్రభుత్వ పాఠశాల నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పాటు వెంటనే ఒక విద్యావలంటీర్‌ను నియమించారు. కాలనీలో పాఠశాల నిర్మాణానికి 13 సెంట్ల స్థలం కూడా కేటాయించారు. దీంతో మండల విద్యాశాఖ అధికారులు ఒక గదిలో పాఠశాలను తాత్కలికంగా ప్రారంభించారు. అయితే పాఠశాల కేవలం నాలుగు నెలలు మాత్రమే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పిల్లల చదువుకు చెదలు పట్టింది.
కన్నెత్తి చూడని అధికారులు
అయ్యా తమ పిల్లలను బడికి పంపి చదివించాలని అనుకుంటున్నాం. వారిని చదివించాలా లేక భిక్షమెత్తుకోవడానికి పంపాలా అంటూ పిల్లల తల్లిదండ్రులు అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, మండల అధికారులకు శివరామిరెడ్డి కాలనీవాసులు అనేక మార్లు తమ పిల్లలను చదివించాలని మొరపెట్టుకున్నా వారి బాధలు ఒక్కరూ పట్టించుకోలేదు.