కొల్లలుగా డ్రాఫ్ట్‌లు.. కొల్లగొట్టేది కోట్లు | Sand mafia Transport operators in Kakinada | Sakshi
Sakshi News home page

కొల్లలుగా డ్రాఫ్ట్‌లు.. కొల్లగొట్టేది కోట్లు

May 23 2015 1:43 AM | Updated on Aug 28 2018 8:41 PM

డ్వాక్రా సంఘాల ముసుగులో బడా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌లు ఇసుక రీచ్‌లపై గుత్తాధిపత్యం చలాయిస్తూ ఖజానాకు కన్నం వేస్తుంటే

  కొత్తపుంతలు తొక్కుతున్న ఇసుక మాఫియూ
  ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ల
  ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌ల గుప్పెట్లో రీచ్‌లు
  అనుచరులతో డీడీలు తీరయించి గుత్తాధిపత్యం
  చక్రం తిప్పుతున్న ఓ శాఖ జిల్లా అధికారి
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : డ్వాక్రా సంఘాల ముసుగులో బడా ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్‌లు ఇసుక రీచ్‌లపై గుత్తాధిపత్యం చలాయిస్తూ ఖజానాకు కన్నం వేస్తుంటే మామూళ్ల మత్తులో యంత్రాంగం కుంభకర్ణ నిద్ర పోతోంది. కోనసీమలో నిన్న, మొన్నటి వరకు ఈ పరిస్థితి అయినవిల్లి రీచ్‌లో ఉండేది. అధికారపార్టీ నేతల అండదండలతో కాకినాడకు చెందిన ఒక ట్రాన్స్‌పోర్టు యజమాని కోట్లు కొల్లగొట్టుకుపోయాడు. ఇప్పుడు ఆ దందా కొత్తపేట మండలం మందపల్లి రీచ్‌కు పాకింది. ఇద్దరు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, ముగ్గురు వడ్డీ వ్యాపారులు అధికారులకు రోజువారీ మామూళ్లు ముట్టజెబుతూ రీచ్‌ను గుప్పెట్లో పెట్టుకుని డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)ల మాయాజాలంతో ఇసుక దందాను కొత్త పుంతలు తొక్కించారు.
 
 ఒకే డీడీ లేదా ఒకే వే బిల్లుపై నాలుగైదు లారీల ఇసుకను తరలించుకుపోవడం ఇంతవరకు చూశాం. తాజాగా అక్రమార్కులు కొత్త జిమ్మిక్కులతో మందపల్లి రీచ్‌లో అధికారులు అనుమతించిన పరిమాణం మేరకు అనుచరులతో పెద్ద ఎత్తున డీడీలు తీయించేసి ఇసుకపై గుత్తాధిపత్యం ఏర్పరచుకుని, సరుకు బ్లాక్ చేసేశారు. ఆ ఇద్దరు ఆపరేటర్లు కోనసీమతో పాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో బ్యాంకులు, సహకార సంఘాల్లో అనుచరుల పేర్లతో డీడీలు తీసి తమ గుప్పెట్లో పెట్టుకుని ఇసుకను బయట జిల్లాలకు తరలించి కోట్లు వెనకేసుకుం టున్నారు. ఇలా డీడీలు తీయడానికి గడువు గురువారంతో ముగియడంతో.. ఇసుకకు వారు చెప్పిందే రేటుగా చలామణీ అయ్యే అవకాశమూ ఉంది.
 
 10 రోజుల వ్యవధిలో 4 వేల డీడీలు
 ప్రతి రీచ్‌లో ఎన్ని వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక తవ్వాలనేది ప్రభుత్వం ముందుగానే నిర్థారించింది. సామాన్యులు, లారీలు, ట్రాక్టర్ల యజమానులు ఇసుక అవసరాన్ని బట్టి డీడీలు తీసుకుని ఇసుక కొనుగోలు చేస్తుంటారు. ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు అందుకు భిన్నంగా అనుచరుల ద్వారా ఒకేసారి రూ.కోట్లు పెట్టుబడి పెట్టి డీడీలు తీసి ఇతర జిల్లాలకు భారీ లారీల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల ఊబలంక రీచ్‌లో ఇద్దరు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు సుమారు రూ.కోటి విలువైన ఇసుకను అనుచరుల ద్వారా తీసుకున్న డీడీలతో తవ్వేసుకుని సొమ్ములు చేసుకున్నారు. వారే ఇప్పుడు మందపల్లి రీచ్‌పై పడ్డారు. మందపల్లి రీచ్‌లో 90 వేల, 600 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి జిల్లా యంత్రాంగం అనుమతించింది. సర్కార్ నిర్ణయించిన ధర యూనిట్‌కు రూ.2000లు. ఈ లెక్కన ఐదు యూనిట్ల లారీకి ఒక డీడీ రూ.10 వేలు అవుతోంది. ఆ ఆపరేటర్లు అధికారులకు ముడుపులు ముట్టచెప్పి అనుచరులతో 10 రోజుల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో సుమారు రూ.4 కోట్ల విలువైన 4,000 డీడీలు తీశారు. పి.గన్నవరం నియోజకవర్గంలోని ఒక సహకారం సంఘంలో రూ.10 లక్షల విలువైన డీడీలు ఒకే రోజు తీయడం గమనార్హం. ఆ రకంగా తీసీన డీడీలపైనే సుమారు రూ.20 లక్షలు వెనకేసుకున్నారు.
 
 రూ.5 వేల అదనపు ధరతో అక్రమ రవాణా
 5 యూనిట్ల లారీ ఇసుక ధర ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.10 వేలు. ఆ ఇద్దరు ఆపరేటర్లు ముందే తీసిన డీడీలతో మందపల్లి రీచ్‌లో తవ్విన ఇసుకను లారీకి రూ.5 వేల నుంచి రూ.8వేలు అదనంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.అంటే ప్రతి డీడీపైనా రూ.5 వేల నుంచి రూ.8వేలు ఆదాయం ఆపరేటర్ల జేబులో పడుతోంది. ఆ ఇసుకంతా ఖమ్మం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద అపార్టుమెంట్‌ల నిర్మాణానికి తరలిపోతోంది.  ఒక శాఖ జిల్లా స్థాయి అధికారి పేరుతో ప్రతి రోజు పలురీచ్‌ల నుంచి ఇసుక తరలించేస్తున్నారు. మందపల్లి సహా పలు రీచ్‌ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10  నుంచి 12 గంటల మధ్య  సుమారు 10 లారీల ఇసుక కాకినాడ పరిసర ప్రాంతాల్లోని అపార్టుమెంట్లకు తరలిస్తున్నారు. కాకినాడలో పలువురు బిల్డర్‌లకు 10 లారీల(లారీకి రూ.15,000) ఇసుక రవాణా చేయడం, ఆ  మేరకు వచ్చే లక్షన్నరలో సంబంధిత అధికారికి రూ.లక్ష, నిర్వాహకులకు రూ.50వేలు ఇచ్చే ఒప్పందం మేరకు రాత్రి రవాణా జోరుగా సాగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement