ఆర్టీసీలో ఎన్నికల వేడి | RTC Elections Four Months Late With NMU IN West Goadavari | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో ఎన్నికల వేడి

Jun 23 2018 6:28 AM | Updated on Jun 23 2018 6:28 AM

RTC Elections Four Months Late With NMU IN West Goadavari - Sakshi

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నేపధ్యంలో ఏలూరు డిపో గ్యారేజ్‌ వద్ద వెలసిన వివిధ యూనియన్ల ఫ్లెక్సీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో విజయానికి యూనియన్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. కార్మికుల సంక్షేమం కోసం సాధించిన విజయాలను ప్రస్తుత గుర్తింపు సంఘం నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ) ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుత గుర్తింపు సంఘం హ యాంలో కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన చ ర్యలు శూన్యమని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కార్మికులకు గుర్తు చేస్తోంది. ఈ దఫా కూడా తమ గుర్తింపును కాపాడుకోవాలని ఎన్‌ఎంయూ ప్రయత్నిస్తుండగా, ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఈయూ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సా ర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ప్రకటించడంతో ఎన్నికల సమీకరణలు మారుతున్నా యి. ఇదిలా ఉండగా కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంపై గుర్తింపు సంఘం ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయభేదాలు పొడసూపాయి. దీంతో ఎన్‌ఎం యూ రాష్ట్ర చైర్మన్‌ను సైతం దూరం చేసుకుంటోంది.

సంఘాలెన్నో.. పోటీ రెండిటి మధ్యే
రెండేళ్లకు ఒక సారి జరిగే యూనియన్‌ గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించి గుర్తింపు పొందగలిగితే రెండేళ్లపాటు ఆర్టీసీ యాజమాన్యం ఆ యూనియన్‌కు చర్చలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తుంది. దీనికోసం యూనియన్లు తీవ్రంగా పోటీపడుతుంటాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎంఎంయూ, ఈయూ, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్, వైఎస్సార్‌ మజ్దూర్‌ సంఘ్, ఆర్టీసీ కార్మిక పరిషత్, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయాస్‌ యూనియన్‌తోపాటు మరికొన్ని చిన్న యూనియన్లు కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్నాయి. ఎన్ని సంఘాలున్నా పోటీ మాత్రం ఎప్పుడూ ఎన్‌ఎంయూ, ఈయూ మధ్యే ఉంటోంది.

గత ఎన్నికల్లో ఎన్‌ఎంయూ విజయం
ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి, రీజియన్‌ స్థాయి గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. 2016, ఫిబ్రవరి 18న జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్‌ఎంయూ 186 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎంయూకు 1322 ఓట్లు పోలవగా ఎంప్లాయీస్‌ యూనియన్‌కు 1136 ఓట్లు వచ్చాయి. దీంతో రీజియన్‌ స్థాయితో పాటు రాష్ట్ర గుర్తింపు కూడా ఎన్‌ఎంయూ సొంతమైంది.

కార్మికుల్లో విశ్వాసం కోల్పోతున్న ఎన్‌ఎంయూ
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కయ్యిందనే భావన కార్మికుల్లో బలంగా నాటుకుపోయింది. గన్నవరంలో సుమారు రూ.600 కోట్ల విలువైన 32 ఎకరాల ఆర్టీసీ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుని హెచ్‌సీఎల్‌ సంస్థకు కట్టబెట్టడాన్ని ఎన్‌ఎంయూ కనీసం వ్యతిరేకించ లేదనే విమర్శను ఎదుర్కొంటోంది. అలాగే విజయవాడ గవర్నర్‌ పేట 1, 2 డిపోలకు చెందిన సుమారు తొమ్మిదిన్నర ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టినా ఎన్‌ఎంయూ అడ్డగించలేదంటున్నారు.

ఇదే కాక కార్మికుల జీతాల ఫిట్‌మెంట్‌ సాధించడంలో కూడా గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమయిందనే ఆగ్రహం కార్మికుల్లో కనిపిస్తోంది. గుర్తింపు సంఘంగా కార్మికుల హక్కుల సాధనలో, వారి సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు విఫలమౌతూ ప్రభుత్వానికి తొత్తుగా ఎన్‌ఎంయూ వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక ప్రశ్నిస్తున్న ఆ యూనియన్‌ రాష్ట్ర చైర్మన్‌ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావును దూరం చేసుకోవడానికి యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం వెనుకాడడం లేదు. ఆయనను యూనియన్‌ నుంచి తొలగించడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయిస్తూ జూలై నెల వరకూ పొడిగించిందనే ఆరోపణలు ఉన్నాయి.

జగన్‌ ప్రకటన ఆశలు రేపింది
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్‌ చేసిన ప్రకటన కార్మికుల్లో ఆశలు రేపింది. సంస్థను నష్టాలబారి నుండి కాపాడాలంటే ఇంధనంపై పన్ను తగ్గించాలి. అన్ని కార్మిక సంఘాలు ఐక్య పోరాటం చేస్తేనే ఆర్టీసీ మనుగడను కాపాడుకోగలుగుతాం. ఎన్‌ఎంయూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వంతో కుమ్మక్కై కార్మికుల హక్కులను హరించివేసింది.
– బొల్లినేని రాంబాబు, రీజనల్‌ కార్యదర్శి, ఎంప్లాయీస్‌ యూనియన్‌

జగన్‌ ప్రకటనతో మారిన సమీకరణలు    
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని  ప్రజా సంకల్పయాత్రలో  ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం వచ్చింది. తాము ఎంత కష్టపడుతున్నా సంస్థ నష్టాలను తమకు ఆపాదించడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్మికులకు జగన్‌ ప్రకటన ఊరటనిచ్చింది. దీంతో వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉండే సంఘానికి మద్దతు పలికి గుర్తింపు ఎన్నికల్లో పట్టం కట్టడానికి కార్మికులు ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement