రాజధానిలో రౌడీలు

రాజధానిలో  రౌడీలు - Sakshi


రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు   భూములు ఇవ్వని రైతులు లక్ష్యంగా ఆస్తులపై దాడులు

అధికార పార్టీ ముసుగులో అకృత్యాలు

ఏడు కేసులు నమోదైనా పట్టించుకోని పోలీసులు

వేలిముద్రలు ఉన్నా నిందితులను గుర్తించని వైనం

అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పోలీసులు

చెరుకు తోట దగ్ధం ఘటనపై రెండు ప్రత్యేక బృందాల ఏర్పాటు


 

నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రాజధాని పల్లెల్లో రౌడీలు రాజ్యమేలుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు చూసుకొని వ్యతిరేకుల్ని లక్ష్యంగా చేసుకొని ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. చేతికి అందివచ్చిన పంటను దగ్ధం చేయటం, పంట పొలాలకు నిప్పంటించటం, పొలాల్లో ఉన్న వివిధ యంత్ర పరికరాలను ధ్వంసం చేయటం లాంటి దుశ్చర్యలకు దిగుతున్నారు. ప్రతి ఘటనకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నా, నష్టం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్ర డీజీపీ మొదలుకొని స్థానిక ఎస్‌ఐ వరకు అందరూ వీటిని చిన్న ఘటనలంటూ కొట్టిపారేస్తూ పరోక్షంగా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. పరోక్షంగా రాజధానిలో చిచ్చు రగిలిస్తూనే ఉన్నారు.

 

విజయవాడ :  అమరావతి రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్‌కు భూమి ఇవ్వకపోతే అతను ప్రభుత్వ వ్యతిరేకిగా ముద్ర వేసి గ్రామాల్లో అధికార పార్టీ నేతలు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఐదు రోజుల క్రితం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో గద్దె చంద్రశేఖర్ అనే రైతుకు చెందిన 4.79 ఎకరాల చెరుకు తోటను దుండగులు దగ్ధం చేసిన ఘటన నేపథ్యంలో రాజధానిలో శాంతిభద్రతలు అదుపు తప్పాయనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు యథావిధిగా రెండు ప్రత్యేక బృందాలు వేసి చేతులు దులుపుకొన్నారు.హుదూద్ తుపాను వచ్చి పంటను కబళిస్తుందని అన్నదాతలు ఆందోళన చెందటం లేదు. ఏ అల్లరి మూక వచ్చి పంటను ధ్వంసం చేస్తుందో ఎన్ని వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది డిసెంబర్ 28న రాజధాని పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, వెంకటాయపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో భూసమీకరణకు వ్యతిరేకించిన రైతుల పొలాల్ని, పొలాల్లో ఉన్న ఆస్తుల్ని లక్ష్యంగా చేసుకొని ఆగంతకులు దాడికి తెగబడ్డారు. ఘటనలో సుమారు రూ.20 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగింది. దీనిపై పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, రైతుల నిరసనలతో ప్రభుత్వం తొలుత సీరియస్‌గా స్పం దించినట్లు హడావుడి చేసింది. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించటం కోసం నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. నిందితుల్ని పట్టిస్తే రూ.5 లక్షలు బహుమానం కూడా ఇస్తామని పేర్కొంది. చివరికి ఈ ఆరు కేసుల్లోనూ పోలీసులు చేసిందేమీ లేదు. ఈ ఘటనలతో సంబంధం లేని కొంతమంది రైతులను అధికా ర పార్టీ సూచనలతో ఇబ్బందిపెట్టడం మినహా మరేమీ చేయలేకపోయారు. ఘటన జరిగి 10 నెలలు దాటినా కనీసం నిం దితుల్ని నేటికీ గుర్తించలేని స్థితిలో పోలీసు యంత్రాంగం ఉంది. ఈ కేసుల సమయంలో గ్రామాల్లో ఉన్న 450 మంది రైతుల పాదముద్రలు తీసుకుని విమర్శలపాలయ్యారు.

 

నష్టం జరిగిందిలా...

 లింగాయపాలెంలో పొలాల ధ్వంసం, రాయపూడిలో జి.శ్రీనివాసరావుకు చెందిన 1500 వెదురు బొంగులు తగలబెట్టడం వంటి ఘటనలకు దుండగులు పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన మీరాసాహెబ్‌కు చెందిన 2500 వెదురు బొంగులు, లింగాయపాలెం వాసి గుంటుపల్లి సాంబశివరావుకు చెందిన 3100, మందడం వాసి ముప్పాళ్ల వెంకటేశ్వరరావుకు చెందిన 1300, యర్రమనేని శ్రీనివాస్‌కు చెందిన 2500, యంపరాల అప్పారావుకు చెందిన 500 వెదురు బొంగులను, డ్రిప్ వైర్‌ను ధ్వంసం చేశారు. వెంకటపాలెం వాసి లంకా రఘునాథరావుకు చెందిన అరటి బొత్తలు, పెనుమాక సర్పంచ్ కల్లం పానకాలరెడ్డికి చెందిన 2500 వెదురు బొంగులు, బోనం శంకరరెడ్డికి చెందిన డ్రిప్ వైర్, పశువుల పాక, నెమలికంటి నాగేశ్వరరావుకు చెందిన 500 వెదురు బొంగులు, ఉండవల్లిలో కె.మల్లికార్జునరెడ్డికి చెందిన 600 వెదురు బొంగులు, 20 యూరియా బస్తాల ధ్వంసానికి దుండగులు పాల్పడ్డారు. ఈ ఘటనలపై ఆరు కేసులు నమోదయ్యాయి. రౌడీల దందా ..

 రాజధానిలో రౌడీల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తుల దాడి అని పోలీసులు కేసును మూసివేసే ప్రయత్నాలు చేయటం దుండగులకు కలిసొచ్చి మరిన్ని దాడులకు ఊతమిస్తోంది. సాక్షాత్తూ సీఎం క్యాంపు కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నా సీఎం సహా అందరూ మౌనం వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీకి చెందిన రాయలసీమ యువనేత, ప్రజాప్రతినిధి ఇక్కడి భూవివాదాల్లో జోక్యం చేసుకోవటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయని అందరూ చెబుతున్నా కనీసం గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించటం కాని, నేర చరిత్ర ఉన్నవారిని గుర్తించటం కాని చేయకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. ఇంకా వెయ్యి ఎకరాల భూమి వరకు ఇక్కడి రైతులు సమీకరణకు ఇవ్వలేదు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వాస్తవాలను దాచిపెడుతున్న పోలీసులు

 ఇదే క్రమంలో ఉండవల్లి గ్రామంలో బంటు గోవర్థనరెడ్డి అనే రైతు పొలంలో మంచినీటి కోసం వేసిన బోరింగ్ పంపు కాడను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్కడే పడేసిన ఆ కాడను పోలీసులు స్వాధీనం చేసుకొని దానిపై ఉన్న వేలిముద్రలు పరిశీలించారు. నిందితులను కూడా ప్రాథమికంగా గుర్తించినా రాజకీయ ఒత్తిళ్లతో కేసును ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. పెనుమాక-ఉండవల్లి గ్రామాల మధ్యలో కల్లం నరేంద్రరెడ్డి అనే రైతు పొలంలో బలమైన ప్లాస్టిక్‌తో సిద్ధం చేసిన నెట్ ఉంది. దానిని పెట్రోల్ పోసి తగులబెట్టారు. బలమైన ప్లాస్టిక్ కావటంతో ఎక్కువ పెట్రోల్‌ను వినియోగిస్తే కాని దగ్ధం కాదు. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితుల్ని గుర్తించవచ్చు. అయినా పోలీసులు ఈ కేసును కూడా పెండింగ్‌లోనే ఉంచారు. రూ.5 లక్షల రివార్డు ప్రకటించినా పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకోకుండా మౌనం వహించటం వెనుక బలమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలు జరిగిన మూడు నెలల అనంతరం డీజీపీ జె.వి.రాముడు ఇది చిన్న కేసని, దీనిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విజయవాడలో విలేకరులతో వెల్లడించటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top