విద్యుత్‌ బస్సులపై ప్రతిపాదనలు రెడీ!

Proposals on electric buses to be ready - Sakshi

రాష్ట్ర ప్రభుత్వమే బస్సుల కొనుగోలుకు యోచన

కేంద్ర సబ్సిడీ కోసం ప్రణాళికలు

ఐదు నగరాల్లో 350 బస్సుల్ని తిప్పనున్న ఆర్టీసీ

నిర్వహణ వ్యయం తగ్గించడమే లక్ష్యం

ఈ నెల 26న అధ్యయన కమిటీకి అధికారుల నివేదిక 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. నిర్వహణ వ్యయం భారీగా తగ్గించేందుకు 350 బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తే మేలని నిర్ణయించారు. ఇందుకు రూ. 764 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. విజయవాడ, అమరావతి, విశాఖపట్టణం, తిరుపతి, కాకినాడ నగరాల్లో విద్యుత్‌ బస్సులను తిప్పనున్నారు. ఏటా ఆర్టీసీ 32 కోట్ల లీటర్ల మేర డీజిల్‌ను వినియోగిస్తుండగా... ధరల పెరుగుదలతో రూ.300 కోట్ల వరకు నష్టాల్ని చవి చూస్తోంది.

ఈ భారం నుంచి ఆర్టీసీని గట్టెక్కించడానికి ఇటీవల ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల నిర్వహణపై నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డీజిల్‌ బస్సులు నడపడం వల్ల కి.మీ.కు డ్రైవరు జీతభత్యంతో కలిపి రూ. 38 వరకు ఖర్చవుతుంది. అదే విద్యుత్తు బస్సు నిర్వహణ ఖర్చు కి.మీ.కి రూ. 19 వరకే అవుతుందని కమిటీ తేల్చింది. ఈ నెల 26న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన అధ్యయన కమిటీ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఈ కమిటీకి ఆర్టీసీ ప్రతిపాదనలు అందించనుంది.

ఆ టెండర్లు రద్దు..
ఎన్నికల ముందు విద్యుత్‌ బస్సులు నడపడానికి ఆర్టీసీ ప్రైవేటు కంపెనీలతో చర్చలు జరిపింది. అయితే కి.మీ.కి రూ. 65 వరకు అవుతుందని ప్రైవేటు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆ తర్వాత 80 విద్యుత్‌ బస్సులను నిర్వహించేందుకు ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. ఒకే ఒక్క కంపెనీ అందులో పాల్గొనగా... ఎక్సెస్‌ రేట్లకు టెండర్లు దాఖలు చేయడం గమనార్హం. నిర్వహణకు కి.మీ.కు రూ. 38 చెల్లించేలా ఆర్టీసీ టెండర్లలో పొందుపరిస్తే, టెండర్లలో పాల్గొన్న కంపెనీ కిలోమీటరుకు రూ. 50కి పైగా కోట్‌ చేసింది. ఇప్పుడు ఆ టెండర్లను రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 పథకం కింద రాయితీ అందిస్తే విద్యుత్తు బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేస్తే మేలని ప్రతిపాదనలు రూపొందించారు. 

ఛార్జింగ్‌ చేస్తే ఏడు నుంచి ఎనిమిది గంటలు
రాష్ట్రాల్లో ఇంధన పొదుపు చర్యలు చేపట్టేందుకు గాను ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం ఫేమ్‌-2 పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా విద్యుత్‌ బస్సు కొనుగోలు చేయాలంటే రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఖరీదు ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్‌ బస్సులో సీసీ కెమెరా, 31 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఆటోమేటిక్‌ గేర్లతో బస్సు నడుస్తుంది. రెండు గంటలు ఛార్జింగ్‌ చేస్తే నిరంతరాయంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు బస్సు నడుస్తుందని ఆర్టీసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

కేంద్రం సాయం కోరేందుకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో నడిపేందుకు ప్రభుత్వమే విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేస్తుంది. ఇందుకు కేంద్ర సాయం కోరేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. విద్యుత్తు బస్సు నిర్వహణ వ్యయం డీజిల్‌ బస్సు నిర్వహణ వ్యయంతో పోలిస్తే కిలోమీటరుతో సగానికి సగం తక్కువగా ఉంది. ఈ నెల 26న అధ్యయన కమిటీతో భేటీ కానుంది. అందరం చర్చించి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులోకి తెస్తాం.
- పేర్ని వెంకట్రామయ్య (నాని), రవాణా శాఖ మంత్రి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top