వెంకన్నకు పన్నుపోటు | Property Tax in Venkana Swamy | Sakshi
Sakshi News home page

వెంకన్నకు పన్నుపోటు

Feb 26 2016 12:46 AM | Updated on Sep 3 2017 6:25 PM

ఆమదాలవలసలోని వెంకన్నకు కష్టమొచ్చిపడింది. ఉన్నఫలాన రూ.11లక్షల మేర ఆస్తిపన్ను చెల్లించాలంటూ

 ఆమదాలవలసలోని వెంకన్నకు కష్టమొచ్చిపడింది. ఉన్నఫలాన రూ.11లక్షల మేర ఆస్తిపన్ను చెల్లించాలంటూ మున్సిపల్ అధికారులు పట్టుబడుతున్నారు. నోటీసులు మీద నోటీసులు పంపుతున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులు ప్రకారం చెల్లించనవసరం లేదు మహాప్రభో అని దేవాదాయ అధికారులు వేడుకుంటున్నా‘ కుదరదు కట్టాల్సిందే ’నంటున్నారు.  ఈ పన్నుపోటు వెంకన్న ఆలయాన్ని దశాబ్దంగా వెంటాడుతోంది. ఈమధ్య కాలంలో ఇది తీవ్రతరమైంది. మరోపక్క ఆలయ ఆస్తులపై వస్తున్న నామమాత్ర లీజు ఆదాయంతో దూపదీపాలకూ ఇబ్బంది ఎదురవుతోంది. ఆస్తులను వేలం వేద్దామంటే మున్సిపల్ శాఖ కన్నెర్ర చేస్తోంది.
 
 ఆమదాలవలస/ రూరల్: 1930లో ఆమదాలవలసలో బరంపురానికి చెందిన కాళ్ల సత్యవతి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించారు. కొందరు అప్పట్లో స్ధలాలను దానం చేశారు. మరికొంత మంది భవనాలను కూడా దేవుని పేరున రిజిస్ట్రేషన్ చేశారు.  బరంపురంలో 16.62 ఎకరాలు, ఇచ్చాపురంలో 2.88 ఎకరాలు, ఆమదాలవలసలో 69 సెంట్లు, 7 దుకాణాలు, రెండు ఇళ్లు స్వామికి ఇలా సంక్రమించిన ఆస్తులే. 5 కిలోల బంగారం, 30.49 కిలోల వెండి కూడా ఉన్నాయి. దాతలే ట్రస్టుగా ఆలయ బాగోగులను చూసేవారు. 1993లో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. రెండు దుకాణాలు, రెండు భవనాలు, కొంత ఖాళీస్ధలం, ఒక ఇల్లు  మినహాయించి మిగిలిన ఆస్తులను ట్రస్టు ఎండోమెంట్‌కు అప్పగించింది.
 
 పన్ను ఎందుకు చెల్లించలేదంటే..
  గతంలో ట్రస్టు ఆలయానికి సంబంధించి ఆస్తి పన్నులు చెల్లించేది. ఎండోమెంట్ అధీనంలోకి వెళ్లాక సమస్య మొదలైంది. ఒక ఆలయం విషయంలో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పును అనుసరించి ఆదాయం ఆలయ అభివృద్ధికే వినియోగించుకోవాలని.. ఎటువంటి పన్నులు చెల్లించవలసిన అవసరం లేదని తెలిపింది. దీంతో 2004 నుండి మున్సిపల్ శాఖకు ఆస్తి పన్నులను కట్టలేదు. మున్సిపల్ అధికారులు ఏటా నోటీసులు పంపుతూనే ఉన్నారు. దీనిపై ఎండోమెంట్ శాఖ కూడా లీగల్ నోటీసులు కూడా బదులిస్తూ వస్తోంది, దీంతో ఇది రెండు శాఖల మధ్యవివాదంగా తయారైంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఆలయం ఆస్తులను అమ్ముకోలేని పరిస్థితి ఎదురైంది.
 
 లీజుతో అతితక్కువ ఆదాయం
 ఏటా దుకాణాల నుంచి రూ. 2,88లక్షలు, కల్యాణ మండపాల ద్వారా రూ. 8,600, పూజల ద్వారా రూ.50 వేలు, హుండీ ద్వారా రూ.87 వేలు, ఖాళీస్ధలం, భవనాల, దుకాణాల ద్వారా స్వల్ప మొత్తంలో అద్దెలు వస్తున్నాయి. అప్పట్లో ట్రస్టు వేలంలో కొందరు దక్కించుకుని నామమాత్రంగా అద్దెలు చెల్లిస్తూ అనుభవిస్తున్నారు. ఈ ఆదాయంతోనే పూజలు, అర్చకుల జీతాలు  వ్యయం చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు.
 
 వాస్తవంగా అతి తక్కువ లీజు ఆదాయంతో స్వామివారికి సరైన అర్చనలూ జరగడంలేదని భక్తులు వాపోతున్నారు. బొటాబొటీ ఆదాయంతో నిర్వహణను అతికష్టం మీద నెట్టుకొస్తున్నారు.  ఆలయ ఆస్తులను నామమాత్రపు అద్దెకు కట్టబెట్టిన సంగతిని దేవాదాయ శాఖ గమనించింది. వీటిని వేలం వేయాలని నిర్ణయించింది. వేలంలో ఈ ఆస్తులను అతి తక్కువ ధరకే దక్కించుకోవాలని పట్టణానికి చెందిన కొందరు సిండికేట్ అయ్యారు. అయితే తమకు ఆస్తిపన్ను బకాయి చెల్లించకుండా వేలం వేయడానికి వీల్లేదని మున్సిపల్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో వేలం పాటను ఆలయ ఈవో రద్దు చేశారు.  
 
 అద్దె లీజుల్లో స్వాహా జరుగుతుంది
 వెంకటేశ్వరస్వామికి ఎన్నో రకాలుగా ఆదాయం వస్తుంది. ఈ ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారు. దేవుని పేరున ఉన్న దుకాణాలు, భూములు మార్కెట్ ధరకంటే తక్కువకే అద్దెకు ఇవ్వడంలో పెద్ద మతలబు ఉంది. వేలం పాట నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. ఈ ఆస్తులపై విచారణ జరపాలి.
  పేడాడ సన్యాసప్పారావు, రాష్ట్ర హిందూ
  దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement