రైతుల సమస్యలను పరిష్కరించాలి

problems of farmers should be solved - Sakshi

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలోని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఉపాధి పనులు, తాగునీరు, సంక్షేమ పథకాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని అధికారులను జెడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కోరారు. శనివారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో జరిగిన స్టాండింగ్‌ (స్థాయీ సంఘాల) సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆర్థిక విషయాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య–వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, అభివృద్ధి అనే ఏడు అంశాలపై చర్చను ప్రారంభించాలని బొమ్మిరెడ్డి సభ్యులకు సూచించారు. తొలుత సభ్యులు పింఛన్లపై అడిగిన ప్రశ్నలకు డీఆర్డీఏ పీడీ లావణ్యావేణి సమాధానమిస్తూ జిల్లాలో కొత్తగా 20వేల పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఇవి కాక మరో 20 వేల దరఖాస్తులు వచ్చాయని వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

 ప్రవాసాంధ్రులకోసం ప్రభుత్వం కొత్తగా రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించిందన్నారు. ఇది వలస కార్మికులకు, ఇతర దేశాల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగమన్నారు.  బొమ్మిరెడ్డి మాట్లాడుతూ జెడ్పీ నుంచి మండలాలకు మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చేందుకు తాము ఇచ్చిన 450 కుట్టు మిషన్లు మూలన పడేశారన్నారు. ఇందుకు ఎంపీడీఓలదే బాధ్యతన్నారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పొట్టేళ్ల శిరీష, కో–ఆప్షన్‌ సభ్యుడు బాషా తదితరులు మాట్లాడుతూ జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతుల ధాన్యాన్ని వారం రోజుల వరకు లారీ నుంచి అన్‌లోడ్‌ చేయడం లేదని ఇందుకు వ్యవసాయ అ«ధికారులే కారణమని ఆరోపించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ నాయుడుపేటలో ఒక ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ ప్రభుత్వ భవనానికి, కుర్చీలకు సైతం పసుపు రంగు వేశారన్నారు. ఏడోతరగతి చదివిన కమిటీ చైర్మన్‌ ఉద్యోగులను తక్కువగా చేసి పేర్లతో పిలుస్తున్నారని విమర్శించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరం ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దుత్తలూరు జెడ్పీటీసీ సభ్యుడు చీదెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ తమ ప్రాంతంలో చేసిన ఉపాధి పనులకు రెండేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా అధికారులు తిప్పుకుంటున్నారని తెలిపారు. 

 వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు వెంకటశేషయ్య మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాల్లో అధికార పార్టీ నాయకులు సూచించిన వారికే రుణాలు ఇస్తున్నారని  విమర్శించారు.  చివరగా చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ ఈ వేసవి సెలవుల్లో వసతిగృహాలను మరమ్మతులు చేయించాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు. సాంఘిక సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకా లు, పంచాయతీరాజ్‌ శాఖలో జరిగే అభివృద్ధి పనులు గురిం చి చర్చించారు.  జెడ్పీ సీఈఓ సీహెచ్‌ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ సీఈఓ వసుంధర,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top