‘కోళ్లు’ కోలేని దెబ్బే.. !

Poultry Farms: Officer Explains Precautions To Taken Prevent VVND Virus - Sakshi

వీవీఎన్‌డీ వైరస్‌ నియంత్రణకు చికిత్స లేదు

కోళ్ల ఫారాన్ని పరిశీలించిన పశుసంవర్ధకశాఖ డీడీ

వద్దిపర్రు నుంచి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ

సాక్షి, ఆలమూరు (తూర్పుగోదావరి) : వెరీ విరులెంట్‌ న్యూ కేస్టల్‌ డిసీజ్‌ (వీవీఎన్‌డీ) వైరస్‌ సోకి సుమారు 2200 కోళ్లు మృతి చెందిన ఆలమూరు మండలంలోని బడుగువానిలంక కోళ్ల ఫారాన్ని జిల్లా పశుసంవర్ధకశాఖ డీడీ, రోగ నిర్ధారణ వైద్యాధికారి  కె.రామకృష్ణ బుధవారం పరిశీలించారు. ఆలమూరు పశుసంవర్ధకశాఖ ఏడీ ఓ రామకృష్ణతో కలిసి కోళ్ల ఫారం పరిసర ప్రాంతాలను అధ్యయనం చేశారు. ఈ వ్యాధి నివారణ సాధ్యం కాదని, ముందస్తు జాగ్రత్తలే తీసుకోవాలి తప్ప వైరస్‌ నియంత్రణకు చికిత్స లేదని తెలిపారు. గత వారంలో ఆత్రేయపురం మండలంలోని వద్దిపర్రులో వీవీఎన్‌డీ వైరస్‌ సోకి వేలాది బాయిలర్‌ కోళ్లు మృతి చెందడం వల్లే ప్రస్తుత పరిస్థితి కారణమని అభిప్రాయపడ్డారు. వేగంగా సోకే స్వభావం కలిగిన ఈ వైరస్‌ గోదావరి అవతలి నుంచి ఇవతల ఉన్న బడుగువానిలంకలోని కోళ్ల ఫారంలోకి చేరిందన్నారు. కోళ్ల రైతులు వీవీఎన్‌డీ వైరస్‌ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. లేయర్‌ ఫారంలో పెంపకం సాగించే కోళ్లకు ఐదో రోజు నుంచి ఏడాది పాటు ప్రతినెలా తప్పనిసరిగా లాసోటా టీకాలను వేయించాలని సూచించారు. అనంతరం ఆలమూరు ఏడీఏ కార్యాలయంలో వీవీఎన్‌డీ వైరస్‌ నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఆలమూరు మండల పశు వైద్యా«ధికారి జి.భానుప్రసాద్, సీహెచ్‌.మౌనిక తదితరులు పాల్గొన్నారు.  

వీవీఎన్‌డీ వైరస్‌ సోకి మృతి చెందిన కోళ్ల ఫారాన్ని పునరుద్ధరించే విధానం 
► ఒకసారి వైరస్‌ సోకి కోళ్లు మృతి చెందిన ఫారంలో మూడు నెలల పాటు విరామం ప్రకటించాలి. 
► కోళ్ల ఫారంలో ఉన్న పాత మట్టిని, ఇసుకను తీసివేసి బయట పారబోయాలి. అనంతరం ఆ ఫారాన్ని పరిశుభ్రం చేసి కొత్త ఇసుకను, మట్టిని సమకూర్చుకోవాలి. 
► డిసినిఫికెంటెండ్, గ్లీజర్ల్‌డ్‌హైడ్‌ మందులో క్లోరుసులాన్‌ను మిశ్రమం చేసి కోళ్లఫారంలో పిచికారీ చేయాలి. 
► ఒకేసారి ఎక్కువ కోళ్లు పెంపకం చేపట్టకుండా కేవలం 15 నుంచి 20 వరకు మాత్రమే పెంచుకుని పరీక్షించుకోవాలి. 
► వ్యాధి నిరోధక లక్షణాలు కనిపించకపోతే మరో ఏడు వారాల నుంచి ఎనిమిది వారాలలోపు కోళ్ల ఫారంలో పెంపకాన్ని చేపట్టవచ్చు. 
► ప్రతి 2–3 ఏళ్లకు తప్పనిసరిగా టీకాలు వేయిస్తూ ఫారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 

వ్యాధి నిరోధక టీకాలు వేయించుకునే విధానం
► బ్రాయిలర్‌ ఫారం : కోడి పెంపకం ప్రారంభించిన ఐదో రోజున లాసోటా లేదా ఆర్‌2బీను వాడాలి. బూస్టర్‌ ఒక నెల తరువాత, మళ్లీ రెండో నెల తరువాత తప్పనిసరిగా వేయాలి. 
► పెరటి కోళ్లకు టీకాలు 
► ఇంటాఓ క్యూలర్‌ (కళ్లల్లో చుక్కల మందు) ఐదు, ఆరో రోజున వేయాలి. 
► టీకాలు వేసే రెండు రోజుల ముందు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ పాముల మందును కోళ్లకు నోటి ద్వారా అందించాలి. 
► నిమిరోల్‌ 1 చుక్క మందును వేస్తే విటమిన్‌ ఏ సమృద్ధిగా లభించి రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. 
► నిట్రోప్యూరంటన్‌ మందును ఇవ్వడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించుకోవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top