మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం | post-mortem to the maoists bodies | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

Jun 22 2014 3:32 AM | Updated on Oct 9 2018 2:51 PM

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పటిష్ట బందోబస్తు నడుమ వైద్యులు ఎస్.రవీంద్రారెడ్డి, లతలు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు.

మార్కాపురం : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో పటిష్ట బందోబస్తు నడుమ వైద్యులు ఎస్.రవీంద్రారెడ్డి, లతలు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మురారికురవ వద్ద పోలీసుల కాల్పుల్లో నెల్లూరు జిల్లా సంగం మండలం కొడవలూరు గ్రామానికి చెందిన జానా చెన్నయ్య కుమారుడు జానాబాబూరావు(49), మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మాదావవానిపల్లెకు చెందిన మంది ఈదెయ్య కుమార్తె భారతి అలియాస్ నాగమణి (40), మెదక్ జిల్లా కొండపాక మండలం ఉద్దంచెరువు గ్రామానికి చెందిన పడిగె మల్లయ్య కుమార్తె కవిత అలియాస్ విమల(30)లు మృతి చెందిన విషయం తెలిసిందే.
 
శుక్రవారం రాత్రి 11గంటల సమయంలో మృతదేహాలను ఒక ట్రక్కులో ఉంచి ప్లాస్టిక్ పట్టల్లో చుట్టి ఆస్పత్రికి తీసుకొచ్చారు. చనిపోయి మూడు రోజులు కావటంతో మృతదేహాల నుంచి దుర్వాసన వెదజల్లింది. శరీరాలు పోలీసుల తూటాలతో జల్లెడగా మారాయి. రక్తం గడ్డకట్టింది. గుర్తు పట్టలేని విధంగా మృతదేహాలు ఉన్నాయి. కవిత మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు శంబవ్వ, మల్లయ్యలు భోరున విలపించారు.
 
అక్క నాగమణి మృతదేహాన్ని చూసి తమ్ముడు హనుమన్న కన్నీటి పర్యంతమయ్యాడు. మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు, సీఐ శివ రామకృష్ణారెడ్డి, యర్రగొండపాలెం సీఐ పాపారావు, పట్టణ ఎస్సై రాంబాబుల నేతృత్వంలో ప్రత్యేక సాయుధ పోలీసులు ఏరియా వైద్యశాలలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. జానా బాబూరావు పెద్ద భార్య మార్చురీ గదికి వచ్చినప్పటికీ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించింది. దీంతో నాగమణి తమ్ముడు హనుమన్నే జానా బాబూరావు మృతదేహాన్ని కూడా తీసుకెళ్లాడు.
 
బుల్లెట్ వెలికితీత
కవిత మృతదేహం నుంచి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు ఒక బుల్లెట్‌ను వెలికి తీశారు. సంఘటన స్థలం నుంచి తప్పించుకెళ్లిన మావోయిస్టు విక్రమ్ అలియాస్ శ్రీనివాస్ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు.
 
మళ్లీ వస్తానని వెళ్లి శవమయ్యావా బిడ్డా : కవిత తల్లిదండ్రులు
15 ఏళ్ల కిందట మళ్లీ వస్తానని బయటకు వెళ్లి శవమై వచ్చావా బిడ్డా.. అని కవిత తల్లిదండ్రులు శంబవ్వ, మల్లయ్యలు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. ఏ రోజుకైనా ఇంటికి వస్తే పెళ్లి చేద్దామని ఎదురు చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, విలేకరులు, గ్రామ పెద్దలు వచ్చి మీ కూతురు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయిందని చెప్పటంతో నోట మాట రాలేదని విలపించారు. తమ ఆరుగురు కుమార్తెల్లో కవిత నాలుగో కుమార్తెని తెలిపారు.
 
అక్కను చూసి పదేళ్లయింది : నాగమణి తమ్ముడు హనుమన్న
తమది నిరుపేద కుటుంబమని, అమ్రాబాద్ మండలం మాధవవానిపల్లె సర్పంచ్‌గా ఇటీవలే ఎన్నికయ్యానని, అక్కను చూసి పదేళ్లయిందని నాగమణి తమ్ముడు బయ్యన్న తెలిపాడు. పోలీసుల సమాచారం మేరకు హూటాహుటిన మార్కాపురం వచ్చినట్లు చెప్పారు. ఇంతటి ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు.
 
బూటకపు ఎన్‌కౌంటర్: కళ్యాణరావు
విరసం నేత జి.కళ్యాణరావు,  దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, పొటికలపూడి జయరామ్‌లు మాట్లాడుతూ మావోయిస్టులది బూటకపు ఎన్‌కౌంటరని ఆరోపించారు. సంఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల బంధుమిత్రుల సంఘ సభ్యులు, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు వైద్యశాలకు వచ్చి మృతుల బంధువులను ఓదార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement