రాజకీయ పార్టీలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఓపక్క సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయ పార్టీలకు ఎన్నికల జ్వరం పట్టుకుంది. ఓపక్క సాధారణ ఎన్నికలు ముంచుకొస్తుండగా మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఇదే సమయంలో జెడ్పీటీసీలు.. ఎంపీటీసీల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటికీ త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఆశావహులకు శుభపరిణామమే అయినా.. ప్రధాన పార్టీల నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల ఖర్చు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు భరిస్తారా? లేక చైర్మన్ అభ్యర్థులా? అనే విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు. మరోపక్క అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్, టీడీపీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు సైతం ఆ పార్టీల పట్ల అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకే అభ్యర్థులు దొరక్క జుట్టు పీక్కుంటున్న తరుణంలో స్థానిక ఎన్నికలు వచ్చిపడటాన్ని ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మొత్తం తొమ్మిది మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయటంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. పార్టీల గుర్తు మీద జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్ ఫలితాలు సాధారణ ఎన్నికలపైనా ప్రభావం చూపనున్నాయి. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాము కానుంది. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ మున్సిపాలిటీలతో పాటు ఆత్మకూరు, బనగానపల్లి, ఆళ్లగడ్డ, గూడూరు, నందికొట్కూరు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగునున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాల్లో వారు సూచించిన అభ్యర్థులే చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లుగా బరిలో నిలవనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీల్లో గుబులు మొదలైంది.
గెలుపు గుర్రాల కోసం వేట
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉండటంతో చైర్మన్, కౌన్సిలర్ల ఎంపికపై నేతలు కసరత్తు ప్రారంభించారు. కర్నూలు మినహా ఏడు మున్సిపాలిటీలు మహిళలకు కేటాయించారు. వీటిలో నాలుగు బీసీలకు దక్కడం విశేషం. ఆ స్థాయి మహిళా నాయకుల ఎంపిక రాజకీయ పార్టీలకు సవాల్‌గా మారింది. కొన్ని మున్సిపాలిటీల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో తమ వారికే కేటాయించాలని పట్టుబడుతుండటంతో నాయకులకు తలనొప్పిగా మారుతోంది. ఒకరికి టికెట్ ఇచ్చి ఇంకొకరికి నిరాకరిస్తే అసంతృప్తి పెరిగి ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలాంటి వారంతా పార్టీ మారే అవకాశం ఉంటుందని కాంగ్రెస్, టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ల ఎంపిక పరోక్ష పద్ధతిన నిర్వహిస్తుండటంతో మెజారిటీ స్థానాల్లో కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇన్‌చార్జ్‌లపైనే ఉంది. గెలిచిన అభ్యర్థులందరినీ ఒప్పించి చైర్మన్ ఎంపిక చేసే విషయంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. అందరినీ ఏకతాటిపై తెచ్చి గొడవలు, గ్రూపులు లేకుండా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ఉపయోగించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టికెట్లు ఆశిస్తున్న జాబితాలో మాజీ కౌన్సిలర్లే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న తమకు అవకాశం కల్పించాలనే వారూ అధికమే. మొత్తం మీద మున్సిపల్‌ఎన్నికలు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయనటంలో సందేహం లేదు.