సుక్కలు చూపిస్తున్నారు

Police Serious On Drunk And Drive in West Godavari - Sakshi

డ్రంక్‌ డ్రైవ్‌పై పోలీసులు సీరియస్‌

ప్రమాదాల నివారణకు చర్యలు

మందుబాబుల బెంబేలు

పశ్చిమగోదావరి, దెందులూరు: మందు బాబుల మత్తు వదిలిస్తున్నారు జిల్లా పోలీసులు. తాగి ఇష్టమొచ్చినట్లు రోడ్లపై వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిని ఎక్కడికక్కడ పట్టేస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయడమే కాదు.. తీవ్రతను బట్టి జైలుకు కూడా పంపిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు భారీగా పెరుగుతుండడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ తరహా కేసులపై గట్టి నిఘా పెట్టడంతో మందుబాబులుబెంబేలెత్తుతున్నారు. అరెస్టుల భయంతో మందు తాగి రోడ్డెక్కాలంటే జంకుతున్నారు. ఈ పరిణామం ఆహ్వానించదగిందే అయినా.. డ్రంక్‌ డ్రైవ్‌పై అవగాహన పెంచితే సమస్యను కొంతవరకూ నివారించవచ్చని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు.

రెండ్రోజుల నుంచి 30 రోజుల జైలుశిక్ష
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి నుంచి 2016 నుంచి 2018 సెప్టెంబర్‌ వరకూ పోలీసులు రూ. 1.66 కోట్లకు పైగా అపరాధ రుసుంగా వసూలు చేశారు. బ్రీత్‌ అనలైజర్‌ పరీక్ష చేశాక మందు బాబుల్ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపిన వారికి రెండ్రోజుల నుంచి 30 రోజుల వరకూ శిక్ష పడుతుంది. భారీగా జరిమానాలు కూడా విధిస్తుండటంతో తాగి వాహనం నడిపేందుకు భయపడుతున్నారు.

1,180 మందికి పైగా జైలుశిక్ష
జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో ఎక్కడికక్కడ మందుబాబుల దూకుడుకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపినవారిపై ఈ రెండేళ్లలో సుమారు 18,497 పైగా కేసులు నమోదయ్యాయి. ఇంతవరకూ సుమారు 1,180 మందికి జైలు శిక్ష పడింది. ఇందులో ఎక్కువ మంది యువత ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల మద్యం మత్తులో వాహనాలు నడపకుండా అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top