ఎప్పటికి పూర్తయ్యేనో..? | POLAVARAM work stopped at gobburu | Sakshi
Sakshi News home page

ఎప్పటికి పూర్తయ్యేనో..?

Mar 1 2016 11:59 PM | Updated on Aug 21 2018 8:34 PM

మండలంలోని గొబ్బూరు వద్ద పోలవరం ప్రాజెక్టు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి.

గొబ్బూరు వద్ద ఆగిపోయిన పోలవరం పనులు
వైఎస్ హయాంలో ప్రారంభం..ఆ తరువాత నిర్లక్ష్యం
పూర్తయితే లక్షన్నర ఎకరాలకు సాగునీరు, విశాఖకు తాగు నీరు

 
కశింకోట: మండలంలోని గొబ్బూరు వద్ద పోలవరం ప్రాజెక్టు పనులు రెండు నెలలుగా నిలిచిపోయాయి. ప్రాజెక్టు ఏడో ప్యాకేజీలో భాగంగా  గత ఏడాది ఏప్రిల్‌లో ఇక్కడ చేపట్టిన పనులను  అర్ధంతరంగా నిలిపేశారు. 2005 లో జిల్లాకు సాగునీరు, తాగునీరు అందివ్వాలనే ఉద్దేశంతో ఇందిర సాగర్ పేరిట పోలవరం ఎడమ కాలువ నిర్మాణాన్ని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో                                చేపట్టారు.  అప్పటి నుంచి రెండేళ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే వైఎస్ దివంగతులు కావడం,  అటవీ, రెవెన్యూ భూముల అప్పగింత లో జాప్యం, నిధుల లేమి తదితర కారణాలతో పనులు చేపట్టలేదు.  ఈ కాలువ పొడవునా ఎనిమిది ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టారు.  ఏడో ప్యాకేజిని జిల్లాలోని దార్లపూడి నుంచి కశింకోట మండలంలోని తాళ్లపాలెం వరకు 26.50 కిలోమీటర్ల  మేర, 53 మీటర్ల వెడల్పు, నాలుగున్న మీటర్ల లోతున రూ.175 కోట్లతో చేపట్టారు.  
 
స్థానికుల ఆందోళనతో..
గొబ్బూరు వద్ద చెట్లకు, ఇళ్లకు  పరిహారం చెల్లించకపోవడంతో నిర్మాణ పనులను   స్థానికులు అడ్డుకోవడంతో ఏడేళ్లపాటు ఆటంక ం కలిగింది. అధికారులు ఎట్టకేలకు మళ్లీ సర్వే జరిపించి గొబ్బూరు, గైతులపాలెం, తాళ్లపాలెం ప్రాంతాల్లో కిలోమీటరున్నర పొడవునా కాలువ తవ్వకంలో   నష్టపోయిన చెట్లకు,  ఇళ్లకు   రూ.14 లక్షల మేర పరిహారం చెల్లించడానికి నిర్ణయించారు.  దీంతో స్థానికుల నుంచి అభ్యంతరాలు తొలగడంతో గత ఏడాది పనులు ఇక్కడ ప్రారంభించారు. ఇక్కడి నుంచి తాళ్లపాలెం వరకు కాలువ తవ్వి అక్కడ ప్రస్తుతం ఇప్పటికే విశాఖకు తాగునీరు సరఫరా అవుతున్న ఏలేరు కాలువకు కలపాల్సి ఉంది. అక్కడి నుంచి ప్రస్తుతం  ఉన్న కాలువను 8వ  ప్యాకేజీ కింద వెడల్పు చేసి స్లూయిజ్‌ల ద్వారా  విశాఖకు తాగు, సాగునీటిని అందిస్తారు.
 
అధిక బిల్లుల కోసం కాంట్రాక్టర్ వత్తిడి
ఈ పనులు  చేపట్టిన కాంట్రాక్టర్   రెండు నెలల క్రితం నిలిపేశారు.  నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో అందుకు అనుగుణంగా సవరణ చేసి బిల్లులు చెల్లించాలని  ప్రభుత్వంపై వత్తిడి తేవడం కోసం కాంట్రాక్టర్ పనులు నిలిపేసినట్లు సమాచారం.  ఈ మేరకు ప్రభుత్వం హామీ  ఇచ్చినప్పటికీ ఇంకా ఉత్తర్వులు రాకపోవడంతో పనులు చేయడం లేదని తెలిసింది.  ప్యాకేజిలో వేర్వేరు చోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నందున గొబ్బూరు వద్ద పనులను తాత్కాలికంగా నిలిపి వేశారని అధికారులంటున్నారు.
 
పుష్కలంగా సాగు, తాగు నీరు
పోలవరం కాలువ  పూర్తి అయితే జిల్లాలో లక్షన్నర ఎకరాల పంట భూములకు సాగునీరు అందడమే కాకుండా ప్రధానంగా విశాఖకు 23.4 టీఎంసీల తాగునీటి అవసరాలు, స్టీల్‌ప్లాంట్ సహా పలు పరిశ్రమలకు నీరు అందివ్వడానికి వీలవుతుంది. ఇప్పటికి ఏడో ప్యాకేజి పనులు 40 శాతం మేర పూర్తయ్యాయని,  రూ.70.68 కోట్లు ఖర్చయిందని అధికారిక సమాచారం. మొదట  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర విభజన నేపథ్యంలో  కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికి  ఈ ఏడాది తాజా బడ్జెట్‌లో కేవలం వంద కోట్లు ప్రకటించడంతో ఇప్పటికే నత్తనడకన సాగుతున్న పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యే అవకాశం లేకుండా పోయింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరునాటికి పనులను పూర్తి చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ల కోరిక మేరకు 2018 జనవరి నెలాఖరులోగా పూర్తి చేయడానికి అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.  అందుకు అనుమతి రావలసి ఉంది.
 
త్వరలో పునఃప్రారంభం
గొబ్బూరు వద్ద పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. కాంట్రాక్టర్ ప్యాకేజిలో మరోచోట పనులు నిర్వహించడం కోసం ఇక్కడ పనులు తాత్కాలికంగా ఆపేశారు. గొబ్బూరు వద్ద చెట్లు, ఇళ్లు పోయినందుకు చెల్లించాల్సిన రూ.14 లక్షల పరిహారం త్వరలో చెల్లిస్తాం. ప్రభుత్వం ప్రాజెక్టు పనులకు అదనంగా చెల్లింపునకు సవరణ చేసినట్లు ప్రకటించింది.
 -ఝాన్సీలక్ష్మి, డీఈఈ, నీటిపారుదల శాఖ  (పోలవరం ఎడమ కాలువ)
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement