కంచానికీ.. కరువాయె...!

plates and trunk suitcase's distribution sopped in BC hostels  - Sakshi

విద్యార్థులకు అందని ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు

జిల్లా బీసీ హాస్టళ్లను వేధిస్తున్న నిధుల కొరత

జనాభాలో అధిక శాతం కలిగిన బీసీ విద్యార్థుల సంక్షేమం అటకెక్కింది. బీసీ హాస్టళ్లలో ఉంటున్న వారికి ప్లేట్లు, గ్లాసులు, ట్రంకుపెట్టెలను కూడా పాలకులు అందించలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కడప రూరల్‌: జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల హాస్టళ్లు మొత్తం 57 ఉన్నాయి. అందులో 6 వేల మంది బాల బాలికలు ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం ఏడాదికి నాలుగు జతల దుస్తులు, ఒక విద్యార్థికి ఒక ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె ఇవ్వాలి. పౌష్టికాహరాన్ని అందించాలి.  విద్యాభివృద్ధికి కృషి చేయాలి. అయితే ప్రభుత్వం నుంచి ఆ విధంగా సహకారం లభించడంలేదు.

ఏడాది దాటినా ...
 విద్యార్థులకు అందించే ప్లేటు, గ్లాసు, ట్రంకు పెట్టె కాలపరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది.గడువు దాటగానే కొత్తవి అందించాలి. అయితే  ఏడాది అవుతున్నా ఇంతవరకు ప్రభుత్వం వాటికి నిధులను కేటాయించలేదు. ప్రభుత్వం నిధులను కేటాయిస్తేనే ఆ శాఖ అధికారులు టెండర్ల ద్వారా వాటిని తీసుకొని విద్యార్ధులకు అందజేస్తారు. అయితే అలా జరగడంలేదు.

కాలం చెల్లిన వాటితోనే...
 సాధారణంగా హాస్టళ్లకు సరఫరా చేసే వస్తువులు నాసిరకంతో ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో సరఫరా చేసిన ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు కూడా దాదాపు నాసిరకానివి అనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్టలకు ఉన్న చిలుకులు ఊడిపోయాయి.   దీంతో చాలా మంది విద్యార్థులు తమ ఇంటి నుంచే వస్తువులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది పాత వాటితోనే   సర్దుకుపోతున్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా బీసీ విద్యార్ధుల సంక్షేమం ఇలా కొనసాగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

బడ్జెట్‌ రాగానే చర్చలు చేపడుతాం..
 నేను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారిగా గడిచిన ఏప్రెల్‌లో బాధ్యతులు చేపట్టాను. అప్పుడే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇందుకు సంబంధించి నిధులు విడుదల కాగానే చర్యలు చేపడుతా.– లక్ష్మీకాంతమ్మ,జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top