
శ్రీవారి దర్శనానికి క్యూలో వెళుతున్న పవన్‌కల్యాణ్
సాక్షి, తిరుమల: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత హంపి మఠంలో బస చేశారు. గతంలో హత్యకు గురైన అభిమాని వినోద్‌రాయల్ కుటుంబసభ్యులను కలిశారు. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై కసరత్తు చేసినట్టు, అందుకోసం కొన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. తర్వాత గదిలోనే ఒంటరిగా ధ్యానంలో నిమగ్నమయ్యారని పార్టీ శ్రేణులు తెలిపారు. సోమవారం తిరుగు ప్రయాణానికి ముందు స్థానిక ఆలయాలు సందర్శించేలా కార్యక్రమాన్ని రూపొందించినట్టు సమాచారం. జాపాలి ఆంజనేయస్వామి ఆలయంతో పాటు అభయాంజనేయస్వామి ఆలయాలను పవన్ సందర్శించనున్నారు.
అభిమానుల అత్యుత్సాహం..
తిరుమల పుణ్యక్షేత్రంలో జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన వెళ్లే మార్గంలో జై పవన్.. జైజై పవన్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు ఏకంగా పీఎం పవన్, సీఎం పవన్ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. అభిమానుల అత్యుత్సాహం భక్తులకు కొంత ఇబ్బంది కలిగించింది.