బట్టబయలైన రహస్య బంధం | Sakshi
Sakshi News home page

బట్టబయలైన రహస్య బంధం

Published Fri, Mar 29 2019 10:18 AM

Pawan Kalyan Secret Alliance To Chandrababu - Sakshi

ఏడాది ముందు రాజధానిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగితే అందరూ నిజమేన నుకున్నారు. తరువాత జరిగిన మీటింగుల్లో కూడా అడపాదడపా విమర్శిస్తుంటే ఆ టెంపో కొనసాగిస్తున్నా రేమోనని భ్రమ పడిన జనం ఇప్పుడిప్పుడే నిజం తెలుసుకుంటున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఆ రెండు పార్టీలు వేర్వేరు కాదు. లోపాయికారీగా కలిసే పనిచేస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్‌లో అభ్యర్థులను బరిలోకి దించారు. జనసేనను నమ్ముకున్నోళ్లను అన్యాయం చేశారు. పొత్తుల వెనక చంద్రబాబు హస్తం ఉంది.   వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చేందుకు వేసిన ఎత్తుగడ. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా మాయ చేశారు.’ ఇవీ గత కొన్ని రోజులుగా జనసేన, బీఎస్పీ నేతల నుంచి వినిపిస్తున్న వ్యాఖ్యలు. 
టీడీపీ చెబితే టిక్కెట్లు ఇచ్చారా?  చీకటి ఒప్పందాలు, రాత్రి రాజకీయాలు చేతకావు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటున్న పవన్‌ కల్యాణ్‌... అభ్యర్థులను ఎలా ప్రకటించారో గుండె మీద చేయి వేసి ఆలోచించుకోవాలని, చీకటి ఒప్పందాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, రెండు రోజుల క్రితం వరకు జనసేనలో కొనసాగిన పంతం గాంధీమోహన్‌ ఆరోపించారు.

బంధం లోగుట్టును వివరించిన టీడీపీ నేత మెట్ల రమణబాబు

ఈసారి ఏకంగా టీడీపీ నేతే జనసేనతో బంధాన్ని బయటపెట్టారు. అమలాపురంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో టీడీపీ నేత మెట్ల రమణబాబు నేరుగా జనసేనతో ఉన్న రహస్య బంధాన్ని వెల్లడించారు. ‘చంద్రబాబు, పవన్‌ కలిసే ఉన్నారు. ఇద్దరూ ఒక అండర్‌ స్టాండింగ్‌తోనే ఉన్నారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులేమీ లేరు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్‌ క్రియేట్‌ అయింది. జనసేనలో కాపు యువత కావచ్చు లేదా వేరే యువత కావచ్చు...జనసేన అన్నప్పుడు మనం వివరించి చెప్పాలి... మీ ఓటు వృథా చేయవద్దు... ఈ సారికి ఇలా చేయండి...  పవన్‌ కల్యాణ్‌కు ఇంకా వయస్సు ఉంది.  భవిష్యత్‌ ఉంది...  ఆయన సంగతి అప్పుడు అలోచిద్ధామని చెప్పండి ’ అని మెట్ల రమణబాబు బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ నేత పవన్, బాబు మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేయడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది.

టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందం. ఒక్కో ఘటన బయటపడుతుండడంతో నిజమైన జనసేన శ్రేణులు నివ్వెరపోతున్నాయి. నిజంగానే బాబుతో విభేదించి బయటకు వచ్చారని, నిజమైన ప్రత్యామ్నాయం కోసం పవన్‌ కల్యాణ్‌ తపనపడుతున్నాడని నమ్మిన ఆయన అనుచరులు కంగుతింటున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను వెన్నుపోటు పొడిస్తే, చంద్రబాబును విమర్శిస్తున్నట్టు నటించిన పవర్‌ స్టార్‌ ఏకంగా షాక్‌కు గురి చేస్తున్నారని ఇప్పటి వరకు ఆయన వెంట తిరిగిన సమూహం కన్నెర్ర చేస్తోంది.

కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే...జనసేనలో గుర్తింపు లేదని, ఏడాది కాలంగా పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు రూ.70 లక్షలు ఖర్చుచేసి అనేక సేకా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జనసేన పార్టీ పటిష్టతకు పాటుపడిన యన్నపు లలిత కూడా పవన్‌ కల్యాణ్‌ ఎంతటి మోసాకారో వివరించారు. తనను కూడా పట్టించుకోలేదని, ఆయనలో నిజాయితీ లేదని, డబ్బున్న వారికే టిక్కెట్లు ఇచ్చారని, మాట మీద నిలబడే వ్యక్తిత్వం కాదని, మహిళలంటే కనీస గౌరవం లేదని, ఎవ్వరూ నమ్మొద్దని కన్నీటి పర్యంతమయ్యారు. వీరంతా టీడీపీతో ఉన్న రహస్య బంధాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. అంతకుముందు ఎంపీ హర్షకుమార్‌ అయితే నేరుగా ఇరుపార్టీలపైన... ఆ అధినేతలపైన విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఒక్కటేనని చెప్పుకొచ్చారు.

టీడీపీతో లాలూచీ లేదని, దేవుడి మీద ప్రమాణం చేసి పవన్‌ కల్యాణ్‌ చెప్పగలరా అని సవాల్‌ విసిరారు. బీఎస్పీ నాయకులైతే తమ పొత్తుకు తూట్లు పొడిచి, తమను మోసగించి, టీడీపీ డైరెక్షన్‌లో టిక్కెటు కేటాయించారని బాహాటంగానే వ్యాఖ్యానించారు. వీరి వ్యాఖ్యలను నిజం చేస్తూ తాజాగా టీడీపీ నేత మెట్ల రమణబాబు తమ కార్యకర్తల సమావేశంలో టీడీపీ, జనసేన బంధాన్ని బయటపెట్టడంతో మరింత చర్చనీయాంశమైంది. కొన్ని బంధాలు దాచినా దాగవులే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్‌ కావడంతో మరీ ఇంత నీచరాజకీయమా అని నెటిజన్లు చీదరించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement