వారికి ఏడేళ్లక్రితం వివాహమైంది. అప్పటి నుంచి చిలుకగోరింకల్లా.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. దీనికి ప్రతిఫలంగానా..? అన్నట్లు విధి చిన్నచూపు చూసింది.
ఎల్కతుర్తి, న్యూస్‌లైన్ : వారికి ఏడేళ్లక్రితం వివాహమైంది. అప్పటి నుంచి చిలుకగోరింకల్లా.. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. దీనికి ప్రతిఫలంగానా..? అన్నట్లు విధి చిన్నచూపు చూసింది. ఆ దంపతులకు సంతానం లేకుండా చేసింది. అయినా నిరాశ చెందని ఆ భార్యాభర్తలు మాతృత్వం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆసుపత్రుల్లో చూపించుకుంటున్నారు. ఇంతలోనే విధి వారిని మరోమారు పగబట్టింది.
రోడ్డు ప్రమాదం రూపంలో భార్యను కబళించింది. నూరేళ్లు కలిసి ఉంటానని బాస చేసిన భార్య.. భర్త ఒడిలోనే కన్నుమూసింది. ఈ సంఘటన ఎల్కతుర్తి శివారులో విషాదం నింపింది. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన పోరెడ్డి వనజ, విజేందర్‌రెడ్డి దంపతులు. వివాహమై ఏడేళ్లయినా సంతానం కలగలేదు. పిల్లల కోసం ఆసుపత్రిలో చూపించుకుంటున్నారు. హన్మకొండలోని ఓ సంతాన సాఫల్య కేంద్రంలో చికిత్స చేయించుకునేందుకు శుక్రవారం ద్విచక్రవాహనంపై బయల్దేరారు. తిరుగు ప్రయాణంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఇంటికి వస్తుండగా.. ఎల్కతుర్తి శివారులోకి రాగానే.. వనజ ద్విచక్రవాహనంపై నుంచి ఉన్నట్టుండి కింద పడిపోయింది.
విజేందర్‌రెడ్డి వాహనాన్ని నిలిపి దగ్గరకొచ్చేసరికే వనజ తలపగిలి రక్తపుమడుగులో కొట్టుకుంటోంది. ఆమెను ఒడిలోకి తీసుకున్న విజేందర్‌రెడ్డి ‘వనజ.. ఏమైంది.. కళ్లు తిరిగాయా.. ఎలా పడిపోయావ్.. నీకేంకాదు.. ఇటు చూడు.. నన్ను విడిచి వెళ్లకు..’ అంటూనే సాయం కోసం అర్థించాడు. స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చేలోపే వనజ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కలకాలం కలిసి ఉంటానని బాస చేసిన భార్య ఒడిలోనే కన్నుమూయడంతో విజేందర్‌రెడ్డి ఆవేదనకు అంతులేకుండా పోయింది. అతడిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.