కబ్జాకు కాదేదీ అనర్హం

Officials Do Not Mind That Government Lands Are Subject To Aggression - Sakshi

సాక్షి, పెరవలి: పేదలు ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటేనే నానా రాద్ధాంతం చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు వారి కళ్లెదుటే ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. పెరవలి మండలంలో కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ స్థలాలను టీడీపీ నేత, పెరవలి నీటి సంఘం అధ్యక్షుడే దర్జాగా ఆక్రమణలకు పాల్పడటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

అంతే కాకుండా ఆక్రమించుకున్న స్థలం చాలదన్నట్టు కాలువను పూడ్చి గట్టును ఆక్రమించుకుని ఇటుక బట్టీ ఏర్పాటు చేసి ఇరిగేషన్‌ స్థలాన్ని తన సొంత జాగీరుగా అనుభవిస్తున్నాడు. మరోవైపు శ్మశానాన్ని సైతం ఆక్రమించుకుని చేనుగా మలిచాడు. కాలువగట్లను రెండువైపులా ఆక్రమించుకుని ఇళ్లు కూడా నిర్మించుకున్నాడు. ఈ అధికార పార్టీ నేత కబ్జాలో ఇరిగేషన్‌కు చెందిన సుమారు 70 సెంట్ల భూమి ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు తమకు పట్టనట్టు వ్యవహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

కాలువలనూ వదలని అక్రమార్కులు
ప్రభుత్వ కార్యాలయాల మధ్య జాతీయ రహదారి పక్కన లక్షలాది రూపాయలు విలువ చేసే ఇరిగేషన్‌ భూమి ఆక్రమణ చెరలో ఉంది. ఇరిగేషన్‌కు చెందిన రెండున్నర ఎకరాల స్థలం ఈ కాలువ పక్కనే ఉండగా అడుగడుగునా ఆక్రమణలకు గురవ్వడంతో కనీసం 10 సెంట్లు భూమి కూడా ఎక్కడా కనిపించడం లేదు.   ఇది మండల కేంద్రమైన పెరవలిలో ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని విలవిల్లాడుతున్న భూపయ్య కాలువ దుస్థితి. ఈ కాలువ నర్సాపురం నుంచి పెరవలి లాకుల వద్ద మీదుగా నేరుగా ఇరగవరం మండలంలో వందలాది ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తోంది.

కాలువగట్లను పూడ్చేసి ఇళ్లు నిర్మించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కాలువనే పూడ్చివేసి ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. ఇంత ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం కొసమెరుపు. సదరు నేతపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు నెలనెలా అందుతున్న మామూళ్లే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 
 

70 సెంట్లు స్వాహా
ఇరిగేషన్‌కి చెందిన ఖాళీ స్థలం 24 సెంట్లు, కాలువగట్టు 10 సెంట్లు, ఇరిగేషన్‌ స్థలం మరో 20 సెంట్లు, శశాన భూమి 16 సెంట్లు మొత్తం కలిపి సమారు 70 సెంట్లు ఆనేత అధీనంలో ఉంది
 

శ్మశాన భూమిలో ఇటుకల బట్టీ
జాతీయ రహదారి పక్కన, మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆనుకుని సర్వే నం.117/2ఏలో 18 సెంట్లు, 117/2సీలో 13 సెంట్లు  మొత్తం 31 సెంట్లు భూమి ఉంది. కానీ జాతీయ రహదారి విస్తరణలో దీనిలో 9 సెంట్లు భూమి పోవడంతో మిగిలిన 22 సెంట్లు ఉంది. దీనిపై కన్నేసిన ఆనేత దీనిని కొద్దికొద్దిగా ఆక్రమించుకుని చేనుగా మలిచి ఇప్పడు ఇటుక బట్టీ నిర్వహిçస్తున్నాడు. 
 

కనుమరుగవుతున్న కాలువ గట్లు
కాలువ గట్లు అక్రమణదారుల కోరల్లో చిక్కుకుని గట్లే కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గట్లు చిక్కిపోయి నడవటానికి తప్ప, ఎటువంటి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.  ప్పుడు ఏకంగా గట్టునే కబ్జా చేసి నేరుగా సాగు చేస్తున్నారు. పెరవలి మండలంలో మూడు ప్రధాన కాలువలతో పాటు 69 పిల్ల కాలువలు ఉన్నాయి. వీటిపై మండలంలో 34,600 ఎకరాల్లో సాగు జరుగుతుండగా ఇరగవరం, పెనుగొండ, తణుకు, అత్తిలి, ఆచంట మండలాల భూముల పంటలకు సాగునీరు అందించాల్సి ఉంది.

ఇప్పడు ఇవన్నీ ఆక్రమణల చెరలో ఉన్నాయి. ముక్కామలలో వైరు కాలువ గట్లుపై అరిటి సాగు చేస్తుంటే ఖండవల్లి వద్ద నక్కల డ్రెయిన్‌ కుడిగట్టును ఆక్రమించుకుని దర్జాగా బొప్పాయి, జామ సాగు చేస్తున్నారు. అన్నవరప్పాడులో బ్రాంచ్‌ కెనాల్‌ గట్లు పూర్తిగా ఆక్రమించుకోవడంతో గట్టుపై నడవటానికి తప్ప కనీసం సైకిల్‌ కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఈకాలువ గట్ల పొడవునా కొందరు రైతులు గట్లను చేలో కలుపుకోగా మరికొందరు గట్లపైనే పశువుల పాకలు వేసి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు.

పదేళ్ల క్రితం వరకు ఈ గట్లపై ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు రాకపోకలు సాగించేవి. శివారు భూముల పంట ఉత్పత్తులను ఈ గట్ల ద్వారానే ప్రధాన రహదారి చేర్చేవారు. ఇప్పుడు గట్లు కనుమరుగవ్వటంతో శివారు భూముల రైతులు పంట ఉత్పత్తులను మోసుకురావడం తప్ప మార్గం లేకుండా పోయింది. ఇంత జరుగుతున్నా అధికారులు మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్టు వ్యవహరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top