ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం!

New academic year starting August 1st - Sakshi

యూజీసీకి నిపుణుల కమిటీ సూచనలు

వర్సిటీలకు వారానికి ఆరు రోజుల పనిదినాలు

సంవత్సరాంత పరీక్షలు జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలి

పీజీ, యూజీ కోర్సుల్లోకి ప్రవేశాలను ఆగస్టు 31లోపు జరుపుకోవచ్చు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు నిలిచిపోయాయి. వాటిని నిర్వహించడంతోపాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (యూజీసీ)కు పలు సిపార్సులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని సూచించింది. అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ వివరించింది. అంతేకాదు.. వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్‌షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్‌ పూర్తి, ఇంటర్నల్‌ అసెస్‌మెంటు, అసైన్‌మెంట్లు, ప్లేస్‌మెంటు డ్రైవ్‌ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలి.

పరీక్షల షెడ్యూల్‌ ఇలా ఉండాలి..
► సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి.
► పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి. 
► యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్‌ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి.
► ఓఎమ్మార్‌/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్, ఓపెన్‌ చాయిస్‌ అసైన్‌మెంటు వంటివి అనుసరించాలి.
► భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి.
► మిడ్‌ సెమిస్టర్‌ తదితర ఇంటర్నల్‌ ఇవాల్యుయేషన్‌ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి.
► యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్‌డౌన్‌ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి.
► ల్యాబ్‌ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్‌ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి.
► రాష్ట్ర, జాతీయస్థాయి కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు.
► వర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. సెప్టెంబర్‌ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. 

ప్రైవేటు స్కూళ్ల వివరాలకు ప్రత్యేక పోర్టల్‌
ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇందులో ఆయా స్కూళ్లు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారం మొత్తాన్ని అందించాలి. పాఠశాలల అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానం ఇప్పటికే అమలవుతోంది. అందులో ఆయా స్కూళ్ల భవనాలు, తరగతి గదులు, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్, మున్సిపల్‌ తదితర వివిధ విభాగాల అనుమతులు, నిరభ్యంతర ధృవపత్రాలు సమర్పించేలా నిబంధనలు ఉన్నాయి. విద్యార్థులు, వారి ఫీజులు, సదుపాయాలు వంటి నిబంధనలూ ఉన్నాయి. టీచర్లకు సంబంధించి కూడా కొన్ని నియమాలున్నా వాటి అమలు అంతంతే. ఇక విద్యార్థుల ఫీజుల నుంచి టీచర్లకు ఇచ్చే జీతాలు, సదుపాయాల కల్పన ఇలా అన్నీ వాస్తవ విరుద్ధమైన రీతిలోనే ఉంటున్నాయి. అలాగే..

► కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు అయితే అనుమతుల్లేకుండానే నడిపేస్తున్నాయి.
► కొన్ని ఒక అడ్రసులో అనుమతులు తీసుకుంటూ వేరేచోట ఎక్కడో నిర్వహిస్తున్నాయి.
► ఆయా టీచర్ల అర్హతలు, వారికిస్తున్న వేతనాలు, ఇతర సదుపాయాల విషయంలో స్కూళ్ల యాజమాన్యాలు ఇస్తున్న సమాచారం వేరు.. వాస్తవంగా వేరుగా ఉంటోంది.
► ఇవి విద్యాశాఖలోని అధికారులందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడంవల్ల ఈ తంతు దశాబ్దాల తరబడి సాగుతోంది.
► కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు గత ప్రభుత్వ పెద్దల బినామీవిగా ఉండడం, స్కూళ్ల అధిపతులే మంత్రులు కావడంతో అధికారులు కూడా ఏమీచేయలేని స్థితి.
► ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల, ఉన్నత విద్యారంగాలు రెండింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి ప్రమాణాలు పెంచే దిశగా అనేక చర్యలు చేపట్టింది.
► ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండింటికీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు చైర్మన్లుగా చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటుచేసింది.
► అంతేకాక.. పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లలోని పరిస్థితులపై వాస్తవిక, సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా..
► ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రైవేటు టీచర్స్‌ పర్టిక్యులర్స్‌’ పేరుతో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్‌సైట్లో కొన్ని వివరాలు అప్‌లోడ్‌ చేయిస్తోంది.
► ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వినతి మేరకు మే 5వ తేదీ గడువు పొడిగించి ఆ తేదీలోగా అందరూ తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించింది. టీచర్లకు సంబంధించి అనేక అంశాలు దీనిలో ఉన్నాయి.

ప్రైవేట్‌ స్కూళ్లు ఇవ్వాల్సిన వివరాలు 
► జిల్లా కోడ్, స్కూల్‌ పేరు, జిల్లా పేరు, మండలం, గ్రామం, స్కూల్‌ కేటగిరి.

టీచర్లు ఇవ్వాల్సిన ప్రాథమిక సమాచారం 
► టీచర్‌ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్‌కార్డు నెం, ఆధార్‌ నెం, మొబైల్‌ నెం, కమ్యూనిటీ, నెల జీతం, నెలవారీ టాక్స్, బ్యాంక్‌ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌.
► ఇక టీచర్ల అర్హతలకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితరాలను పొందుపర్చాలి. ఆయా కోర్సులు పాసైన తేదీలు, వాటిని ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, సంస్థల్లో చదివారో కూడా స్పష్టంగా తెలియజేయాలి. వీటితో పాటు టీచర్లు ఎక్కడ నివసిస్తున్నారన్న అంశాలను పొందుపర్చాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top