దేశ ఆర్థిక వ్యవస్థలో నేవీది కీలక పాత్ర

Navy is a key player in the country's economy - Sakshi

నిషాన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి

విశాఖ సిటీ: భారత నౌకాదళమంటే దేశ రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇస్తున్న సహ కారం ప్రముఖమైనదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాఖ్యానించారు. ఇండియన్‌ నేవీలో సబ్‌మెరైన్‌ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైన విశాఖలో సబ్‌మెరైన్‌ స్వర్ణోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి కోవింద్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు.

కల్వరి నుంచి కల్వరి ప్రత్యేక శకం
భారత నౌకాదళంలో ఐఎన్‌ఎస్‌ కల్వరి సబ్‌మెరైన్‌ సేవలు 1967లో ప్రారంభించి తీర ప్రాంత రక్షణ రంగంలో నూతన శకానికి నాంది పలికిందని అభిప్రాయపడ్డారు. అదే పేరుతో నూతన సబ్‌మెరైన్‌ సిద్ధం చెయ్యడంతో కల్వరి నుంచి కల్వరి వరకూ జరిగిన ప్రయాణం ఇండియన్‌ నేవీకి ప్రత్యేకమైన శకంగా అభివర్ణించారు. 50 ఏళ్లలో 25 సబ్‌మెరైన్‌లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జలాంత ర్గాముల్లో పనిచెయ్యడం క్లిష్టమైనప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్న నేవీ సిబ్బంది సేవల్ని అభినందించారు. మేక్‌ ఇన్‌ ఇండియా లో భాగంగా సబ్‌మెరైన్‌ల తయారీలోనూ స్వదేశీ సాంకేతి కతను అందిపుచ్చుకోవడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. 

సబ్‌మెరైన్‌ విభాగానికి రాష్ట్రపతి పతాకం
సబ్‌మెరైన్‌ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్రపతి తొలుత నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. రక్షణ రంగంలో విశిష్ట సేవలందించే విభాగానికి అందించే అరుదైన పురస్కారం ప్రెసిడెంట్‌ ఆఫ్‌ కలర్స్‌ పతాకాన్ని ఇండియన్‌నేవీ సబ్‌మెరైన్‌ విభాగానికి రాష్ట్రపతి అందించారు. నేవీ బ్యాండ్‌ నడుమ సబ్‌మెరైన్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌ తేజేందర్‌ సింగ్‌ ఈ పతాకాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. 

త్రివిధ దళాల అధిపతి కోవింద్‌ నుంచి రాష్ట్రపతి పతాకం స్వీకరిస్తున్న సబ్‌మెరైన్‌ లెఫ్టినెంట్‌ కమాండర్‌ తేజేందర్‌ సింగ్, చిత్రంలో ఇండియన్‌ నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌లాంబా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top