పర్యావరణ కలుషితం హత్య లాంటిదే.. | Sakshi
Sakshi News home page

పర్యావరణ కలుషితం హత్య లాంటిదే..

Published Sat, Apr 27 2019 4:36 AM

National Green Tribunal Indicated To LV Subrahmanyam Pollution Control - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితం పేరుతో నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు వేసినట్టు ఇసుక తవ్వకాలు జరిగితే ఎలా అని ప్రశ్నించింది. పర్యావరణాన్ని కలుషితం చేయడం హత్య లాంటిదేనని అభిప్రాయపడింది. పర్యావరణానికి హాని కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, భారీ జరిమానాలు విధించాలని, అది చూసి తప్పు చేయాలనుకొనే వారు భయపడాలని సూచించింది. నూతన రాజధాని రూపుదిద్దుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ, వాయు, జల కాలుష్య నివారణకు గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై ఎన్జీటీ శుక్రవారం సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఢిల్లీ పిలిపించుకొని చర్చించింది. జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్, జస్టిస్‌ కె.రామకృష్ణన్, జస్టిస్‌ డా. ఎన్‌.నందలతో కూడిన బెంచ్‌ ముందు సీఎస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలుష్య నివారణకు పలు సూచనలు చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల విషయమై ఈ నెల 4న జరిమానా విధించామని గుర్తు చేసింది. 

నష్ట పరిహారం వసూలు జరగడం లేదు..
పర్యావరణాన్ని కలుషితం చేయడం కూడా నేరమేనని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. ‘ఒక హత్య వల్ల ఒక మనిషి చనిపోతాడు. పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల అనేక మంది చనిపోతున్నారు. ఇది కూడా మర్డర్‌ లాంటిదే’ అని పేర్కొంది. కానీ పర్యావరణానికి జరుతున్న నష్టానికి సమానంగా నష్టపరిహారం వసూలు జరగడం లేదంది. అసలు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని తిరిగి పూడ్చలేమని వ్యాఖ్యానించింది. నదులను ఇష్టానుసారం తవ్వేయడం వల్ల ప్రవాహ దిశలు మారిపోవడం, వరదలు రావడం, నీటి ఎద్దడి, భూగర్భ జలాలు అడుగంటడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొంది. తద్వారా ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సరైన ప్రణాళికతో వెళ్లడం లేదని, వారి వద్ద ఉన్న నిధులను సరిగ్గా ఖర్చు పెట్టకపోవడం వల్ల వందల కోట్లు మిగిలిపోతున్నాయని తెలిపింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఈ రోజుల్లో సరిగ్గా అంచనా కూడా వేయలేకపోతున్నామని, కొన్ని విషయాల్లో ఎలాంటి పర్యావరణ నష్టం జరగలేదని రాష్ట్ర స్థాయి కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇస్తే.. తద్భిన్నంగా తాము పంపే కమిటీలు నివేదికలు ఇస్తున్నాయని వివరించింది.

సీఎస్‌ వచ్చినా హాజరుకాని ఏజీ, ప్రభుత్వ న్యాయవాది..
ఎన్జీటీలో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరైనా అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) మాత్రం హాజరు కాలేదు. కనీసం ఢిల్లీలో నియమించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కూడా ట్రిబ్యునల్‌తో సమావేశానికి వెళ్లకపోవడం గమనార్హం. 

మీరే దగ్గరుండి పర్యవేక్షించండి..
పర్యావరణ పరిరక్షణ అన్నది తమ ప్రధాన ఎజెండా అని, అది దేశంలోనైనా, ఆంధ్రప్రదేశ్‌లోనైనా ఒక్కటే అని బెంచ్‌ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనే చర్చించడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావించి పిలిపించినట్టు తెలిపింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో వాయు కాలుష్యం విపరీతంగా ఉందని, విశాఖలో వ్యర్థాలన్ని సముద్రంలో కలుస్తున్నాయని, కొల్లేరు 14 రకాల హానికారక క్రిములతో నిండి ఉందని, తూర్పుగోదావరి, శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉందని వివరించింది. దీనిపై దృష్టి సారించాలని, పర్యావరణ పరిరక్షణను దగ్గరుండి పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచించిన ట్రిబ్యునల్‌.. దీని కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలంది. సీఎస్‌ స్పందిస్తూ తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, నిబంధనల మేరకు అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక క్లçస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని, దీనిపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ట్రిబ్యునల్‌ ఆదేశించింది. తదుపరి మరో ఆరు నెలల తరువాత సమావేశమవుదామని తెలిపింది.  

Advertisement
Advertisement