మైదుకూరు టీడీపీలో ముసలం | mydukuru tdp lo musalam | Sakshi
Sakshi News home page

మైదుకూరు టీడీపీలో ముసలం

Sep 25 2016 4:33 PM | Updated on Aug 11 2018 4:24 PM

మైదుకూరు టీడీపీలో ముసలం - Sakshi

మైదుకూరు టీడీపీలో ముసలం

మైదుకూరు టీడీపీలో గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

మైదుకూరు టౌన్‌: పాలకులు అవినీతి పరులైతే కింది స్థాయి సిబ్బంది కూడా వారి ఇష్టానుసారం దోచుకొనేందుకు ప్రయత్నిస్తారు. ఇందుకు పావులు కదుపుతారు. మైదుకూరు మున్సిపాలిటీలో రోజు రోజుకు అవినీతి తీవ్ర స్థాయిలో పేరుకుపోతోంది. స్వపక్షంలోని కౌన్సిలర్లే రెండు వర్గాలుగా విడిపోయి  మీరంటే మీరే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

మున్సిపాలిటీలో సిబ్బంది ఓ వర్గం కౌన్సిలర్లుకు మాత్రమే కొమ్ము కాస్తుండడంతో స్వపక్షంలోని మిగితా కౌన్సిలర్లు జరిగిన అక్రమాలపై నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పుట్లా మున్సిపల్‌ చైర్మన్‌ సీఎన్‌ రంగసింహపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించే కౌన్సిల్‌ సమావేశంపై ముందుగానే శుక్రవారం చైర్మన్‌ టీడీపీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. తనపై పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు ఫిర్యాదు చేయడమెందుకు, సమస్యలుంటే ఇక్కడే ప్రస్తావిస్తే లబ్ధి చేకూరేలా చూస్తాను కదాని చెప్పినట్లు సమాచారం.  

పలువురు కౌన్సిలర్లు డుమ్మా..
శనివారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశానికి మున్సిపల్‌ అధికారులు, చైర్మన్‌ రూపొందించిన అజెండాలోని పనులపై కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చేసి సమావేశానికి  డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఈ అజెండాలోని ముఖ్యమైన వాటిలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాచనూరు చంద్ర పేరుపై మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె సమీపంలో సర్వేనం.1453–1లో 1.74 హెక్టారుల్లో రోడ్డు మెటల్‌  , బిల్డింగ్‌ స్టోన్‌ క్రషరు పరిశ్రమ ఏర్పాటుకు కడప జియాలజీ డిపార్ట్‌మెంటు సర్వే చేసి తదుపరి సదరు పరిశ్రమ ఏర్పాటుకు మైదుకూరు పురపాలిక సంఘం నుంచి నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు కౌన్సిలర్ల ఆమోదం కోసం ఉంచారు.

అయితే కొందరు కౌన్సిలర్లు ఇందుకు సమ్మతించడానికి ఇష్టం లేక కొందరు కౌన్సిలర్లు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అంతేకాక మున్సిపల్‌  చైర్మన్‌ వ్యవహారం మొదట నుంచి నచ్చని కొందరు కౌన్సిలర్లు ఆ పదవిని వేరే వ్యక్తికి కట్టబెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.    అలాగే మరుగుదొడ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారంపై శనివారం సమావేశంలో నిలదీసేందుకు స్వపక్ష కౌన్సిలర్లతోపాటు వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో చైర్మన్‌ సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోయారు.   

టీడీపీలో ముసలం పుట్టిందిలా...
టీడీపీ ఇన్‌చార్జి తమ సామాజిక వర్గం కాబట్టి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి తమకే వస్తుందని  కొంతమంది నాయకులు ఆశలపల్లకిలో ఊగిసలాడారు. ఈ నేపథ్యంలో ఆయన మాచనూరు చంద్రకు ఆ పదవిని కట్టబెట్టారు. ఏడాది కాలం తర్వాతనైనా మకు వస్తుందని ఆశించారు. అయితే మళ్లీ మాచనూరు చంద్రకే చైర్మన్‌ పదవిని అప్పగించారు. దీంతో పార్టీలోని మరో వర్గం ఖంగు తిన్నట్లయింది. పార్టీ కోసం కష్టపడుతున్నా తమకు పదవులు రాకపోవడంతో వారిలోవారే మల్లగుల్లాలు పడుతున్నారు. అంతేకాక మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం కొంతమంది టీడీపీ కౌన్సిలర్లు ఆశలు పెట్టుకున్నారు. ఆ పదవి కూడా వారికి దక్కకపోవడంతో   ముసలం పుట్టింది. ఎలాగైనా సరే మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ పదవుల్లో ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి, తమ వర్గానికి దక్కేలా కొంతమంది నాయకులు, కౌన్సిలర్లు  పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీడీపీలో ఇరువర్గల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement