సమస్యలపై ముప్పేట దాడి | Sakshi
Sakshi News home page

సమస్యలపై ముప్పేట దాడి

Published Thu, Sep 18 2014 11:46 PM

సమస్యలపై ముప్పేట దాడి

కర్నూలు(జిల్లా పరిషత్):
 జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ సమస్యలు, వ్యవసాయ పంట రుణాల మాఫీ, పారిశుద్ధ్యం, ఆరోగ్య కేంద్రాల పనితీరుపై పాలక సభ్యులపై దుయ్యబట్టారు. ఆరు నెలల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు హామీ ఇవ్వగా, ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం కర్నూలులోని జెడ్పీ సమావేశ భవనంలో నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్
 అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్, జెడ్పీ సీఈవో ఎం.జయరామిరెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాదానాలు ఇచ్చారు. ఎస్‌సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద దళితులకు 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్  అమలు కావడం లేదని ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు రాంభీంనాయుడు ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ బసప్ప చెప్పారు. సీరియల్ సంఖ్యను బట్టి గాకుండా సమస్య తీవ్రతను బట్టి ట్రాన్స్‌ఫార్మర్లు రైతులకు కేటాయించాలని కర్నూలు ఎంపీపీ రాజా విష్ణువర్దన్‌రెడ్డి కోరారు. మంత్రాలయంలో ఫ్లోరైడ్ నీరు ఎక్కువగా ఉన్నందున ఆ ప్రాంతంలో నీటిశుద్ధి పరికరాన్ని ఏర్పాటు చేయాలని మంత్రాలయం జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీలు సైతం విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతే ఎలాగని ప్రశ్నించారు. అవసరమున్న చోట ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌లో నియమించుకుని పనిచేయించుకోవాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కారణంగా పలు సమస్యలు ఉన్నాయని, వాటిని అర్థం చేసుకోవాలని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్‌ను ఇస్తామని చెప్పారు. ఏఈ, డీఈలు తప్పనిసరిగా ప్రజాప్రతినిధులకు ఫోన్‌లో అందుబాటులో ఉండాలని, ఫోన్ లిఫ్ట్ చేయని వారిని సస్పెండ్ చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కేటాయింపులో అక్రమాలు జరిగినందు వల్లే విచారణ చేస్తున్నామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఇప్పిస్తానని, ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పారు. 13వ ఫైనాన్స్ నిధులేమైనా ఉంటే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు. త్వరలో హంద్రీనీవా కాలువ ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇస్తామన్నారు. ఆత్మకూరు పట్టణంలోని తాగునీటి పథకాన్ని మొదటి వారంలో ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో 55 వేల క్వింటాళ్ల యూరియాను సరఫరా చేశారని తెలిపారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ తీరు వల్లే రుణమాఫీ ఆలస్యమవుతోందన్నారు. రుణమాఫీ హామీపై వెనుకడుగు వేయమన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే ఉద్యోగం చేయాలంటే ఎలాగని ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. డెంగీ కేసులు నమోదైన చోట నివారణ చర్యలు తీసుకోవడం లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ వై. నరసింహులుపై మండిపడ్డారు. ఇలాంటి ఫిర్యాదులు మళ్లీ రానీయవద్దని హితవు పలికారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మాట్లాడుతూ మొత్తం వ్యవసాయానికి 25 వేల విద్యుత్ స్తంబాలు, 400 ట్రాన్స్‌ఫార్మర్లు కావాలని రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇందిర జలప్రభ కింద 300 కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాటుకు నిధుల సమస్య లేదని చెప్పారు. ఆర్‌డబ్ల్యుఎస్, ఎస్‌ఎస్‌ఏ అధికారులను సమన్వయం చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు.


విద్యుత్ సమస్యల, దాడి, ఎం.జయరామిరెడ్డి
 

Advertisement
Advertisement