
మరిన్ని విభజన ఉద్యమాలు ఖాయం
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జీవోఎం చేసిన సిఫార్సులు అరకొరగా ఉన్నాయని, ఇవి మరిన్ని విభజన ఉద్యమాలకు బీజం వేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటుల్లో బిల్లు చర్చకు వచ్చిన సందర్భంలో తాము వ్యతిరేకిస్తామని, దీంతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తామన్నారు.
శుక్రవారం ఆయన సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసే ఆందోళన కార్యక్రమాలు ఖరారు చేస్తామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయనే తాము ఆ బిల్లుకు మద్దతు ఇవ్వడంలేదన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై జీవోఎం ఎలాంటి సిఫార్సులు చేయలేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు వెయ్యి కోట్లు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, రాయలసీమకు పెద్ద ప్రాజెక్టు ఒకటి ఇవ్వాలన్నారు.
కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించి ఏర్పాటు చేసిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు, విభజనకు సంబంధం ఉందన్నారు. ఆ ట్రిబ్యునల్ గడువు రెండు సంవత్సరాలు పొడిగించి నూతన రాష్ర్టం ఏర్పాటు వల్ల ఏర్పడే వివాదాలు కూడా పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రకటించకుండా చూడాలని, ఆ తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్షంలో అదే విషయాన్ని చెప్తామన్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని రాష్ట్రాలతో కేంద్రం సమావేశం నిర్వహించి వెంటనే వివాదాన్ని పరిష్కరించాలన్నారు. కాగా, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ నియంత్రణ సంస్థ త్వరలో చేపట్టబోయే బహిరంగ విచారణను మూడు నెలలు వాయిదా వేయాలన్నారు.
మండేలాకు జోహార్లు
నల్లజాతి ప్రజల హక్కుల కోసం పోరాడిన నెల్సన్ మండేలా మృతికి సీపీఎం రాష్ట్ర కమిటీ తరఫున రాఘవులు జోహార్లు అర్పించారు.