
మొదట్నుంచీ జగన్ మద్దతుదారునే
జగన్ సమైక్య దీక్షకు జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి మద్దతు ప్రకటించారు.
జగన్ సమైక్య దీక్షకు జమ్మలమడుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి మద్దతు ప్రకటించారు. అనుచరులతో కలిసి బుధవారం దీక్షాశిబిరానికి వచ్చిన ఆదినారాయణరెడ్డి జగన్‌ను కలిసి తన సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘నేను వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఇప్పుడు చేరడం కాదు. 2011లో ఆ పార్టీ పెట్టినప్పడే సోనియాగాంధీని ఎదిరించి జగన్‌కు మద్దతు ప్రకటించాను’ అన్నారు.
తమ నియోజకవర్గంలోని స్థానిక పరిస్థితులు, ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌లోనే కొంత కాలం ఉండాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు తమ కార్యకర్తల అభీష్టానుసారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఆదినారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, వైఎస్సార్ జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ కె.సురేష్‌బాబు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, జమ్మలమడుగు సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇ.వి.సుధాకర్‌రెడ్డి ఉన్నారు.