కొల్లేరుకు కష్టాలు | mistreatment for kolleru | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు కష్టాలు

Apr 7 2015 4:07 AM | Updated on Sep 29 2018 5:10 PM

నిత్యం జలకళ ఉట్టిపడే కొల్లేరు ఎండిపోతోంది. దీంతో దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రజలు, పక్షులు దాహార్తితో అలమటించే దుస్థితి దాపురిస్తోంది.

డ్రెయిన్లకు తగ్గిన ఇన్‌ఫ్లో
కొల్లేరు సరస్సులో అడుగంటుతున్న నీరు
ఆటపాక పక్షుల కేంద్రం వద్ద  నిలిపేసిన బోటు షికారు
మండు వేసవిలో మరింత జటిలం కానున్న నీటి సమస్య

 
సాక్షి, విజయవాడ బ్యూరో : నిత్యం జలకళ ఉట్టిపడే కొల్లేరు ఎండిపోతోంది. దీంతో దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ప్రజలు, పక్షులు దాహార్తితో అలమటించే దుస్థితి దాపురిస్తోంది. కొల్లేరు ఎండిపోతుండటంతో బావులు, బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. ఫలితంగా కొల్లేరు గ్రామాల ప్రజలు మంచినీటికోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మంచినీటిని కొనుక్కొని తాగాల్సిన దురవస్థ ఏర్పడుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. మండు వేసవిలో నీటి సమస్య మరింత జటిలం కానుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో విస్తరించిన కొల్లేరుకు గత కొన్నేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని జలవనరుల నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా చేలు, చేపల చెరువులు, కాలువల్లోని నీరు దాదాపు 24 డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి చేరుతుంది. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు వంటి కీలక డ్రెయిన్ల నుంచి కూడా నిత్యం పెద్దఎత్తున నీరు కొల్లేరులోకి వచ్చేది. ఏటా సుమారు 1.20 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరులో చేరుతుందని అంచనా. ఈ నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి పోతుంది.అయితే సరైన వర్షాల్లేక జలసిరులు అడుగంటడంతోపాటు జిల్లాలో రెండో పంట సాగు లేకపోవడం, అటు గోదావరి, ఇటు కృష్ణా నదిలో నీటి విడుదల తగ్గిపోవడంతో గతేడాది డిసెంబర్ నుంచే కొల్లేరుకు చుక్కనీరు రావట్లేదు. డ్రెయిన్ల ద్వారా నీరు చేరకపోవడంతో వేసవికి ముందే కొల్లేరుకు నీటి దుర్భిక్షం వచ్చిపడింది.

ఆటపాకలో ఆగిన బోటు షికారు..

కొల్లేరులో నీరు అడుగంటిపోవడంతో గత వారం రోజులుగా  కైకలూరు సమీపంలోని ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు కూడా నిలిపేశారు. ఇది పర్యాటకులకు తీవ్ర నిరుత్సాహాన్ని మిగులుస్తోంది. వేసవి సెలవులు సమీపిస్తున్నతరుణంలో ఆటపాక వెళ్లి బోటులో చక్కర్లు కొడదామనుకునే చిన్నారుల ఉత్సాహంపై ఈ పరిణామం నీళ్లు చల్లింది.

ప్రమాద సంకేతమే..

కొల్లేరు ఎండిపోయే పరిస్థితి రావడం ప్రమాద సంకేతమని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన పర్యావరణ, జలవనరుల(వెట్ సెంటర్) కేంద్రం కో ఆర్డినేటర్ పీఏ రామకష్ణంరాజు చెప్పారు. కొల్లేరు నీరు నిత్యం ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళుతుంటేనే సముద్రంలోని ఉప్పునీరు చొచ్చుకు రాకుండా ఉంటుందని చెప్పారు. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్ర నీరు ఉప్పుటేరు ద్వారా సుమారు 35 కిలోమీటర్లు మేరకు (పెద్దింట్లమ్మ గుడి వరకు) చొచ్చుకుని వచ్చే ప్రమాదం ఉందన్నారు. తద్వారా కొల్లేరు ఉప్పునీటి కయ్యగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక సమీప ప్రాంతాల్లోని చెరువులు, భూగర్భ జలాల్లోనూ ఉప్పునీటి సాంద్రత పెరుగుతుందన్నారు. దీనివల్ల పంటలు దెబ్బతినడంతోపాటు పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతుందన్నారు. దీన్ని నివారించేందుకు కొల్లేరులో నిత్యం జలసిరులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement