రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
మేళ్లచెరువు, న్యూస్‌లైన్: రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. మేళ్లచెరువు మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. సొంత పార్టీ వారికే ప్రభుత్వ పథకాలు అందజేస్తూ, పేదలకు మంజూరు చేసే ఇంది రమ్మ ఇళ్లను నాయకులకు కేటాయిస్తూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తమ పార్టీ నాయకులను దళారులుగా తయారు చేసిన ఘనత మంత్రికే దక్కుతుందన్నారు. ఇతర పార్టీల సర్పంచ్‌లు, నాయకులను భయపెట్టి, మభ్యపెట్టి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పుతున్నారని అన్నారు.
గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్లు, దీపం పథకాలను కూడా తన రాజకీయానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు పెత్తనాలు కట్టబెట్టి గెలిచిన సర్పంచ్‌లకు అధికారాలు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. మంత్రి ఉత్తమ్ హయాంలో వీధి నాయకులు కూడా కోట్లు గడించారని ఆరోపించారు. శాసనసభలో గానీ మరే ఇతర సమావేశాలలో గానీ తెలంగాణ గురించి మాట్లాడని మంత్రి ఇవాళ కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నాడని అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు శాఖను మార్చినా ముఖ్యమంత్రిని ఒక్క మాటా అనలేదని అన్నారు. తెలంగాణ విషయంలో నియోజకవర్గ ప్రజలను ఆయన మభ్యపెడుతున్నారని, పులిచింతల ముంపు బాధితుల విషయంలో రాజకీయ రంగు పులుముతున్నాడని విమర్శించారు. సమావేశంలో నాయకులు వేముల శేఖర్‌రెడ్డి, అయిల వెంకన్నగౌడ్, చిలకల శ్రీనివాసరెడ్డి, కోడి మల్లయ్యయాదవ్, వెంకటరెడ్డి, శంబిరెడ్డి, కృష్ణారెడ్డి తదిత రులు పాల్గొన్నారు.