అవినీతిని జీరో చేస్తాం: మంత్రి ఆదిమూలపు సురేష్‌

Minister Adimulapu Suresh Attended To Spandhana Programme In Prakasam - Sakshi

సాక్షి, ప్రకాశం(యర్రగొండపాలెం) : అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రధానుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, రాష్ట్రంలో అవినీతిని జీరో చేసే విధంగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘స్పందన’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవటానికి తమ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో అవినవభావ సంబంధాలు ఉంటాయని, సహజంగా తమకున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లినప్పటికీ వారిపై ఉన్న రాజకీయ ఒత్తిళ్ల వలన సమస్య పరిష్కారానికి నోచుకోదని, గత టీడీపీ ప్రభుత్వంలో నాయకులు చెప్పినట్లే ప్రభుత్వ వ్యవస్థ పనిచేసిందన్నారు. ఫిర్యాదులలో 60–70 శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయని, అర్జీలు ఎక్కువగా ఉన్నాయంటే రెవెన్యూ అధికారులు పనిచేయడంలేదని కాదన్నారు.

దుర్మార్గపు టీడీపీకి తగిన బుద్ధిచెప్పారు
దుర్మార్గంగా పాలన చేసిన పచ్చనేతలకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధిచెప్పి, టీడీపీని సాగనంపారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. జన్మభూమి కమిటీలు వ్యవస్థనే నాశనం చేశాయని, తమ వర్గం, తమ పార్టీ, తమ కులం అంటూ విర్రవీగిన వారు ఇప్పుడు కనిపించకుండా పోయారని ఆయన వ్యగ్యంగా అన్నారు. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారన్నారు. 

గ్రామ వ్యవస్థ పటిష్టత కోసం సచివాలయాలు
గ్రామ వ్యవస్థ పటిష్టత కోసం గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నామని, నియోజకవర్గంలో మొత్తం 87 గ్రామ సచివాలయాలు పనిచేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలు చేయటానికి ఇప్పటికే 1475 మంది గ్రామ వలంటీర్లను నియమించామని, ఆయా ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు  శాతం కేటాయించారని చెప్పారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని, టాలెంట్‌ ఉన్న ప్రతి ఒక్కరు కొలువు దీరుతారన్నారు. 

2020 ఉగాదికి అర్హులందరికీ ఇంటి స్థలాలు
అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, 2020 ఉగాది రోజున ఇంటి పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. ఇంటి స్థలాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, తమ ఇంటి వద్దకే గ్రామ వలంటీర్లు వచ్చి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. 

జనవరి 26న అమ్మఒడి పథకం 
వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీన అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామని, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విడతల వారిగా అమలు పరుస్తున్నారని మంత్రి తెలిపారు. చిత్తుగా అధికారం కోల్పోయినవారికి ఇంకా బుద్ధి రావడంలేదని, హింసతోపై చేయి సాధించాలని టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారన్నారు. ఇలాంటి చర్యలను సహించేదిలేదని, ఎంతవారైనప్పటికీ వదలిపెట్టే సమస్యలేదని ఆయన హెచ్చరించారు. భూ తగాదాలను శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా పరిష్కరించాలని ఆయన పోలీసులను ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి తహసీల్దార్‌ కె.నెహ్రూబాబు అధ్యక్షత వహించారు. మార్కాపురం ఆర్డీఓ మర్రెడ్డి శేషిరెడ్డి, డీవైఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఐదు మండలాలకు చెందిన తహశీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులు పాల్గొన్నారు.

ప్రతి నెలా ఒక మండలం స్పందనలో నేనుంటా 
ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంలో అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని ఆనందించాలో.. బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఉందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పరిశీలించి వాటిని పరిష్కారిస్తారన్న భరోసా ప్రజలకు అధికారులు కల్పించాలన్నారు. తనవద్దకు ప్రతిశాఖ నుంచి అర్జీలు వస్తున్నాయి. వాటిని దాదాపు పరిష్కరించామన్నారు.సమస్యలు పరిష్కరించాము కదా అని చేతులు దులుపుకుంటే సరిపోదు.. అర్జీదారుని ఎంతవరకు తృప్తి పరిచామన్నది ముఖ్యమని ఆయన అధికారులకు చెప్పారు. ప్రతి నెల ఒక మండలంలో స్పందన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్పందన కార్యక్రమం నిరంతరం జరుగుతుందని ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top