అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 7, 11 చొప్పున విభజించేందుకు చేపట్టాల్సిన ప్రక్రియ వాయిదా పడింది.
న్యూఢిల్లీ: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 7, 11 చొప్పున విభజించేందుకు చేపట్టాల్సిన ప్రక్రియ వాయిదా పడింది. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 18 మంది ఎంపీలను లాటరీ ద్వారా రెండు రాష్ట్రాల కు పంచాలి. ఈ మేరకు విభజన ప్రక్రియ చేపట్టేందుకు బుధవారం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ ముందు ఆ ఎంపీలు హాజరుకావాల్సి ఉండగా.. టీడీపీ సభ్యులెవరూ రాలేదు. కాంగ్రెస్ నుంచి చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి మినహా మిగతా వారంతా వచ్చారు.
టీఆర్‌ఎస్ సభ్యుడు కె.కేశవరావు వచ్చారు. ఈ ఎంపీలంతా లాటరీ ద్వారా ఇరు రాష్ట్రాలకు తమను కేటాయించడం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. లాటరీ ద్వారా స్థానికత నిర్ధారించడం సమంజసం కాదన్నారు. ఈ అభ్యంతరాలను విన్న హమీద్ అన్సారీ.. తాను పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని, సభ్యుల అభ్యర్థన మేరకు ప్రత్యామ్నాయ అవకాశాల పరిశీలనకు న్యాయశాఖకు పంపిస్తానంటూ ప్రక్రియను ఈనెల 30కి వాయిదావేశారు.