విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుల వివరాలు మావోయిస్టులు సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు ఉపాధ్యాయులు ఏ వేళకు ఎందరు వస్తున్నదీ ఆరా తీస్తున్నారు.
కొయ్యూరు, న్యూస్‌లైన్: విధులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుల వివరాలు మావోయిస్టులు సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని బడులకు ఉపాధ్యాయులు ఏ వేళకు ఎందరు వస్తున్నదీ ఆరా తీస్తున్నారు. నాలుగు రోజుల కిందట యు.చీడిపాలెం పంచాయతీ పలకజీడి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వద్దకు దళసభ్యులు వచ్చారు. అక్కడివారితో కొద్దిసేపు మాట్లాడారు. గోడలపై కరపత్రాలు అంటించారు.
అనంతరం పాఠశాలలో ఎందరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నదీ, ఎందరు వేళకు వస్తున్నదీ, రోజుల తరబడి ఎవరు విధులకు డుమ్మాకొడుతున్నది తదితర విషయాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఇద్ద రు పూర్తిగా రావడం లేదని గ్రామస్తులు వివరించినట్టు తెలిసింది. పలకజీడి మారుమూల ప్రాంతం కావడంతో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కాగా గ్రామానికి చెందిన అటవీ ఉద్యోగి ఒకరిని తమతో పాటు కొంత దూరం తీసుకెళ్లిన మావోయిస్టులు ఉద్యోగం మానేయాలని హెచ్చరించినట్టు తెలిసింది.