మనసుతో చూడండి.. | Lovers day | Sakshi
Sakshi News home page

మనసుతో చూడండి..

Feb 14 2015 2:29 AM | Updated on Sep 2 2017 9:16 PM

ప్రేమకు అర్థం ఎవరంటే మేమని చూపే ప్రేమికులు ఎందరో ఉన్నారు. రెండక్షరాల ప్రేమను ప్రణయనాదంగా భావించి జీవితంలో ఆనందంగా ప్రయాణిస్తున్నవాళ్లూ ఉన్నారు.

ప్రేమకు అర్థం ఎవరంటే మేమని చూపే ప్రేమికులు ఎందరో ఉన్నారు. రెండక్షరాల ప్రేమను ప్రణయనాదంగా భావించి జీవితంలో ఆనందంగా ప్రయాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. అలాంటి ప్రేమను పానుపు పనుపనుకునే కాముకులకూ కొదవేం లేదు. మనోనేత్రంతో మనసు చూసి, వలచి, తలచి.. తరించిన ప్రేమ పెళ్లి వరకూ వెళ్లినా.. పెద్దరికం ముందు ఓడినా.. పవిత్రంగానే ఉంటుంది. ఆకర్షక ఒంపుల వైఖరిలో చిక్కి, అదే ప్రేమని భ్రమిసి.. అందాన్ని దక్కించుకోవాలనుకునే కీచక ప్రేమకు ఎందరో అమ్మాయిలు బలవుతున్నారు. కన్నవారి ప్రేమ తప్ప అన్యం ఎరుగని ముక్కుపచ్చలారని బాలికలు కూడా వీరిలో ఉన్నారు. అసలైన ప్రేమ వయసెరిగి.. మనసెరిగి ప్రవర్తిస్తుంది.
 
 అందుకే ఈ ప్రేమలోకంలో మాటరాని మౌనాన్ని జయించిన మూగమనసులూ ఉన్నాయి, ప్రేమతో చీకట్లను చీల్చి వెలుగుల్లో పయనిస్తున్న చూపులెరగని మనుషులూ ఉన్నారు. అయితే  ప్రేమే సర్వస్వం అనుకునే యువతకు.. ప్రేమ నేరం అనుకునే పెద్దరికానికి వైరం ఇవాళ్టిది కాదు. లైలా మజ్నూ జ మానా నుంచి పెద్దల చేతిలో ప్రేమ ఓడిపోతూనే ఉంది. పెద్దల పట్టింపులకు పెళ్లిపీటలెక్కాల్సిన ఎన్నో ప్రేమలు బలవంతంగా ‘చితి’కిపోతున్నాయి. కన్నవారిని, కన్నె మనసుని రెండు కళ్లుగా భావించే ప్రేమికులూ కరువవుతున్నారు.
 
 కని, పెంచిన తల్లిదండ్రులను కాదని, వారి ప్రేమను తోసిరాజని.. లవ్ బర్డ్స్ ఎగిరిపోతున్నాయి. గుండెల మీద ఆడించుకుని పెంచిన బిడ్డలు.. ప్రేమ మాయలో పడి గూడు విడిచి వెళ్లిపోతే.. ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. గడపదాటిన పరువు తిరిగి రాదని తెలిసి.. సమాజంలో ముఖం చెల్లక  ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.  మొండిగా వీడిపోయిన కన్నపేగుతో బంధం తెంచుకోవడానికి పరువు హత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమకు ఇన్ని పార్శ్వాలు ఉన్నాయి మరి. అది కొందరికి మోదం.. ఇంకొందరికి ఖేదం. ప్రేమను నిజంగా ప్రేమించిన వ్యక్తి.. దాన్ని ప్రేమగా వ్యక్తీకరించాలి. కన్నవారిని నొప్పించకుండా.. ప్రేమను ఒప్పించుకోవాలి. అప్పుడే ఆ ప్రేమ పదికాలాలు పచ్చగా ఉంటుంది. నిజమైన ప్రేమకు అర్థంలా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement