రెండు రోజుల్లో ఆంక్షల సడలింపు

Lockdown Open in Two Days YSR Kadapa Villages - Sakshi

ఈ నెల 20 నుంచి అమలుకు ప్రణాళిక

పాజిటివ్‌ కేసు రాని..గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తింపు

కంటైన్మెంట్‌ జోన్లకు నో.. శాంపిల్‌ పరీక్షలు పెంపు

డిప్యూటీ  సీఎం అంజద్‌బాషా, కలెక్టర్‌ హరికిరణ్‌

కడప సిటీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో 20 నుంచి అనుసరించే సడలింపుల విషయంలో నియమ నిబంధనలను తప్పక పాటించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా,  కలెక్టర్‌ హరికిరణ్‌ సంయుక్తంగా పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్‌ వీసీ హాలు నుంచి శుక్రవారం కోవిడ్‌–19 జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డిప్యూటీ సీఎం అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, జేసీ గౌతమి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రోజుకు 90 వరకు మాత్రమే సేకరించే త్రోట్‌ శాంపిల్‌ సేకరణ జరిగేదన్నారు. ఇకపై ఐదింతలు పెంచే పద్ధతులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ట్రూనాట్‌ కిట్స్‌ ద్వారా 200 నుంచి 280 వరకు శాంపిల్స్‌ పరీక్షించేందుకు వీలుందన్నారు.

ఈనెల 20 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో ప్రకటించే లాక్‌డౌన్‌ సడలింపులను నిబంధనల మేరకు పాటించాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ వచ్చే సోమవారం నుంచి జిల్లాలోని 9 కంటైన్మెంట్‌ జోన్లు మినహా పాజిటివ్‌ కేసులు రాని, గ్రామీణ ప్రాంతాల్లో సడలింపులు వర్తిస్తాయన్నారు.  కనీస అవసరాలకు, సాధారణ జీవనానికి, గ్రామీణ ఉత్పత్తులకు ఇక్కడ అంతరాయం ఉండబోదన్నారు. నిత్యావసరాలు, అత్యవసర సేవలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 8 లక్షల మందికి ఫీవర్‌ సర్వే నిర్వహించగా, రెండు వేల మందికి పైగా శాంపిల్‌ టెస్టింగ్‌ అవసరమైనట్లు గుర్తించామన్నారు. 21వ తేదీలోపు వీరికి పరీక్షలు  నిర్వహిస్తామన్నారు. ఎస్పీకేకేఎన్‌ అన్బురాజన్‌ మాట్లాడుతూ 20 తర్వాత మార్గదర్శకాలకు అనుగుణంగా సడలింపులను వినియోగించుకోవాలన్నారు.   తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట ›శ్రీకాంత్‌రెడ్డి, విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.  

కంటైన్మెంట్‌ గుర్తింపు ఇలా..
కడప అర్బన్‌ : పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా పరిగణిస్తారు. వైరస్‌ ప్రభావిత ప్రాంతంలో 300 మీటర్ల నుంచి 400 మీటర్లు కేటాయిస్తారు. రెడ్‌జోన్‌ చివరి నుంచి మూడు కిలోమీటర్ల దూరంను కోర్‌జోన్‌గా పరిగణిస్తారు. కోర్‌జోన్‌ చివరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు బఫర్‌జోన్‌గా వ్యవహరిస్తారు. ఈ మూడు జోన్‌లను కలిపి కంటైన్మెంట్‌ జోన్‌(అదుపు చేయడం)గా వ్యవహరిస్తారు. కడప నగరం చుట్టూ 8.4 కిలోమీటర్ల మేర కంటైన్మెంట్‌ జోన్‌గా వ్యవహరిస్తారు. 

కడప–2, ప్రొద్దుటూరు–2,
వేంపల్లె–1, పులివెందుల–1,
ఎర్రగుంట్ల–1, బద్వేలు–1, మైదుకూరు–1

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top