మరిన్ని సడలింపులు

Lockdown Free For Jewellery And Cloth Showrooms YSR Kadapa - Sakshi

నగలు, దుస్తులు, పాదరక్షల దుకాణాలకు అనుమతి

వీధి హోటళ్లకు గ్రీన్‌సిగ్నల్‌

పెద్ద షోరూంలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రోత్సహించాలి

ట్రయిల్‌ రూమ్‌లకు నిరాకరణ

పానీపూరీ బండ్లు పెట్టరాదు

నిబంధనలు పాటించాలన్న కలెక్టర్‌

కడప సిటీ : కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యాపార రంగం కుదేలైంది. దీంతో వ్యాపారులు, కూలీలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులుది పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత కొన్ని రోజులుగా లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులుగా ఇవ్వగా, తాజాగా మరికొన్నింటికి ఇచ్చింది. 60 రోజులుగా మూతపడిన నగలు, దుస్తులు, పాదరక్షల దుకాణాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నిబంధనలకు లోబడి వాటిని నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో ఆ దుకాణాల షెట్టర్లు తెరుచుకోనున్నాయి. వీధి హోటళ్లు (స్ట్రీట్‌ ఫుడ్స్‌)కు కూడా అనుమతి ఇచ్చింది. అయితే పార్శల్‌ సర్వీసుకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. పానీపూరీ బండ్లకు నిరాకరించింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాలకు మాత్రం ఈ సడలింపులు ఇవ్వలేదు. వీటికి సంబంధించిన ప్రకటనను జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ మంగళవారం విడుదల చేశారు.

విధి విధానాలు
పైన పేర్కొన్న సంబంధిత వ్యాపార వర్గాలు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రమాణికాలను తప్పనిసరిగా పాటించాలి.
వ్యాపారాలకు సంబంధించిన పెద్ద దుకాణాలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ను ప్రోత్సహించాలి.
వినియోగదారుల వివరాలు నమోదు చేయాలి.
థర్మల్‌ స్క్రీనింగ్, చేతులను శానిటైజ్‌ చేసిన తర్వాత అనుమతించాలి. 99 డిగ్రీల జ్వరంతో గానీ, ఇతర కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లయితే వారిని అనుమతించరాదు.
కోవిడ్‌ లక్షణాలు ఉన్న సిబ్బందిని గానీ, ఇతరులను గానీ దుకాణదారుడు అనుమతించడానికి వీలు లేదు.
ప్రతి కౌంటర్‌లో శానిటైజర్‌ ఏర్పాటు చేయాలి. వినియోగదారుడు లోనికి వచ్చినపుడు, బయటికి వెళ్లేటపుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.
నగల దుకాణదారుడు వినియోగదారులకు డిస్పోజబుల్‌ గ్లౌజ్‌ ద్వారా మాత్రమే నగలు తాకే అవకాశం కల్పించాలి.
వస్త్ర, నగల దుకాణాల్లో వస్తువులు ధరించే పద్ధతి అనుమతించరాదు. ట్రయిల్‌ గదులను మూసివేయాలి.
ప్రవేశ ద్వారం వద్ద పాదరక్షలను క్రిమి రహిత ద్రావణంతో పిచికారీ చేయాలి.
అనుకూలతను బట్టి వ్యాలెట్‌ పార్కింగ్‌ అనుమతిస్తూ కార్లకు దారి చూపాలి. వాహనం బీగాలను శానిటైజ్‌ చేయాలి.
అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలి. లిఫ్ట్‌లో సిబ్బంది మాత్రమే ప్రెస్‌ బటన్‌ నొక్కడం చేయాలి.
షాపులలో ఆరు అడుగుల దూరాన్ని వినియోగదారులు పాటించేలా మార్కింగ్‌ వేయాలి. వీలైనంత వరకు నగదు లావాదేవీలను నివారించి ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేయాలి. కార్డు పేమెంట్‌ శానిటైజ్‌ చేయాలి.
తినుబండారాలు, న్యూస్‌ పేపర్లు, మ్యాగ్‌జైన్లు, ఇతర పానీయాలు తాత్కాలికంగా నివారించాలి.

వీధి వర్తకులు పాటించాల్సిన పద్ధతులు
వీధి వర్తకులు (స్త్రీట్‌ ఫుడ్స్‌) నిబంధనలు పాటిస్తూ వ్యాపార లావాదేవీలు కొనసాగించాలి.
కేవలం పార్శల్‌ రూపంలోనే వినియోగదారులకు ఇవ్వాలి.
మున్సిపల్‌ కార్యాలయంలో రిజిస్టర్‌ చేసుకుని మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా అనుమతి, గుర్తింపు కార్డులు పొందిన వారు మాత్రమే వీధుల్లో అమ్మకాలు చేపట్టాలి.
రిజిస్ట్రేషన్, ఐడీ కార్డు లేని వారు వారికి సంబంధించిన వార్డు సచివాలయానికి వెళ్లి వాటిని పొందవచ్చు. మున్సిపల్‌ కమిషనర్లు వీరికి గుర్తింపు కార్డులు జారీ చేస్తారు.
ప్రతి వీధి వర్తకుడు ఐడీ కార్డు ధరించి ఉండాలి. చేతికి గ్లౌజులు, మాస్క్‌లు ధరించాలి.
పానీపూరీ, ఎక్కువ వైరస్‌ సంక్రమణ వస్తువులను అమ్మకానికి అనుమతించరాదు.
ఐదుగురు గుమికూడకుండా చూసుకోవాలి. భౌతికదూరం పాటించాలి. ఆరు మీటర్ల మేర భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌ వేయాలి.
జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు వీధి వర్తకులకు అవగాహన కల్పించి వినియోగదారులు, వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పై నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top