నిమ్మకాయ.. కొనరాయె!

Lemon Price Rapidly Decreased - Sakshi

సెప్టెంబర్‌లో కిలో రూ. 100 -120

డిసెంబర్‌లో కిలో రూ. 5 -6 మాత్రమే

దారుణంగా పతనమైన ధరలు

ఉత్తరాదిలో చలిగాలులు, సెంటిమెంట్‌తో తగ్గిన ఎగుమతులు

కోత కూలి కూడా దక్కట్లేదని రైతన్నల ఆవేదన

జనవరి దాకా ఇదే పరిస్థితి అంటున్న మార్కెట్‌ వర్గాలు

సాక్షి, అమరావతి : నీరసాన్ని పోగొట్టే నిమ్మకాయలను సాగు చేసే రైతన్నలు ధరల పతనంతో విలవిలలాడుతున్నారు. తోటలు కాయలతో కళకళలాడుతున్నా కొనే నాథుడు లేక గిరాకీ తగ్గిందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడం, వాడకం తగ్గడం, చలి పెరగడంతో నిమ్మతోటలు నేలచూపు చూస్తున్నాయి. రెండు మూడు నెలల క్రితం కిలో రూ.100 – రూ.120 పలికిన నిమ్మకాయల ధర ప్రస్తుతం రూ.5 – 6 మాత్రమే ఉండటం ధరల పతనానికి నిదర్శనం. నిమ్మకాయల విక్రయానికి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లైన గూడూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రిలో ఇదే పరిస్థితి నెలకొంది.

36,180 హెక్టార్లలో సాగు
అరటి, మామిడి తర్వాత ఉద్యాన పంటల్లో నిమ్మ అత్యధికంగా సాగవుతోంది. రాష్ట్రంలో సుమారు 36,180 హెక్టార్లలో నిమ్మ తోటలున్నాయి. 17,742 హెక్టార్లతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అగ్రస్థానంలో ఉండగా 6,090 హెక్టార్లతో పశ్చిమ గోదావరి, 3173 హెక్టార్లతో ప్రకాశం, 2756 హెక్టార్లతో గుంటూరు, 2,234 హెక్టార్లతో వైఎస్సార్‌ జిల్లాలు తదుపరి స్థానాల్లో నిలిచాయి. నిమ్మ ఎకరానికి 100 – 150 టిక్కీల (టిక్కీ అంటే 50 కిలోలు) వరకు దిగుబడి వస్తుంది. రాష్ట్రం నుంచి వారణాసి, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. సీజన్‌లో మార్చి నుంచి అక్టోబర్‌ మొదటి వారం వరకు ఒక్కో మార్కెట్‌కు 60 – 100కిపైగా లారీల కాయలు వస్తుండగా ప్రస్తుతం పట్టుమని పది లారీలు కూడా రావడం లేదు.

ధర ఎందుకు తగ్గిందంటే?
ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి తర్వాత సెంటిమెంట్‌పై నమ్మకంతో నిమ్మకాయలపై కత్తి గాటు పడనివ్వరు. ఈ సీజన్‌లో వీటిని కోయడాన్ని అపశకునంగా భావిస్తారు. దీనికితోడు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక పులుపు వాడకాన్ని తగ్గిస్తారు. శీతకాలంలో నిమ్మకాయలు వినియోగిస్తే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తారు.

దక్షిణాది నగరాలకే ఎగుమతి
గతంలో నిత్యం వందకుపైగా నిమ్మకాయల లోడ్‌ లారీలు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎగుమతి అవుతుండగా ఇప్పుడా సంఖ్య పదికి లోపే ఉందని గూడూరుకు చెందిన వ్యాపారి కె.శ్రీనివాసులురెడ్డి చెప్పారు. సెప్టెంబర్‌లో ఇక్కడ కిలో గరిష్టంగా రూ.150 పలికితే ఇప్పుడు రూ.5 నుంచి రూ.6 మాత్రమే ఉంది. మేలిరకం కాయలైతే కిలో గరిష్టంగా రూ.8 పలుకుతున్నాయి. ప్రస్తుతం గూడూరు మార్కెట్‌ నుంచి బెంగళూరు, చెన్నై, మధురై, సేలం వంటి దక్షిణాది రాష్ట్రాలలోని ముఖ్య నగరాలకు మాత్రమే రోజూ పది లారీల లోపు తరలిస్తున్నారు. ఏలూరు మార్కెట్‌కు ఆగస్టు, సెప్టెంబర్‌లో రోజుకు 70 – 100 లారీల సరుకు రాగా ఇప్పుడది 10 – 11కే పరిమితమైంది. బుధవారం ఇక్కడ కిలో కాయలు గరిష్టంగా రూ.9 పలికాయి. తెనాలి నుంచి మంగళవారం 11 లారీల సరకును ఇతర రాష్ట్రాలకు తరలించగా రాజమండ్రికి వచ్చే కాయలు స్థానిక  మార్కెట్‌కే పరిమితమయ్యాయి. 

కూలి కూడా గిట్టుబాటు కావట్లేదు
‘ఒక టిక్కీ నిమ్మకాయలు కోయడానికి కూలి రూ.200 అవుతుంది. బస్తా రవాణా చార్జీ రూ.40, యార్డులో పది శాతం కమిషన్, దింపుడు కూలి రూ.15, పురికొస, గోతం కింద బస్తా కాయలకు మరో రూ.15 ఖర్చవుతుంది. ఒక టిక్కీకి గరిష్టంగా రూ.350 వస్తే అందులో రూ.305 ఖర్చవుతుంది. కాయలను కోయకుండా వదిలేస్తే పండిపోయి నేల రాలిపోతాయి. ఎలాగోలా అమ్ముదామంటే చేతి చమురు వదులుతోంది’ – కొత్త రమేష్‌బాబు (నిమ్మ రైతు, సంగంజాగర్లమూడి)

జనవరి దాకా ఇదే పరిస్థితి..
‘ప్రస్తుతం అన్‌ సీజన్‌ కావడంతో నిమ్మకి గిరాకీ లేదు. మార్కెట్లకు గతంలో 60 నుంచి వంద లారీల సరకు వస్తే ఇప్పుడు పదికి లోపే వస్తున్నాయి. ఇప్పుడు కాపు కూడా తక్కువే అయినా ధర లేకుండా పోయింది. జనవరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులను ఇక్కడకు రప్పించి కొనుగోలు కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం’ – ఏ.రాము (నిమ్మ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి, ఏలూరు) 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top