కాంగ్రెస్‌లో పదవుల ఫలహారం | Lack of party activists | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో పదవుల ఫలహారం

Jan 17 2014 4:30 AM | Updated on Mar 18 2019 7:55 PM

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరవయ్యారు. అదేంటి అందరూ పార్టీ మారారా అని ఆశ్చర్య పోకండి. కార్యకర్తలే నాయకులుగా అవతరించారు.

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కరవయ్యారు. అదేంటి అందరూ పార్టీ మారారా అని ఆశ్చర్య పోకండి. కార్యకర్తలే నాయకులుగా అవతరించారు. పార్టీ పెద్దల పుణ్యాన కాంగ్రెస్ పార్టీలో నాయకులు తప్ప కార్యకర్తలు చూద్దామన్నా కనిపించడం లేదు. రెండు నెలలుగా రోజుకో పోస్టు...పోస్టుకో 40 మంది చొప్పున నిత్యం పదవుల పందేరం కొనసాగుతోంది. జెంబోజెట్ కార్యవర్గాన్ని కూడా దాటిపోయి, ఎన్నికల నాటికి పోస్టులతో రికార్డు సృష్టించే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది.
 
 ఏ పార్టీకైనా, సంఘానికైనా ప్రధాన కార్యదర్శి పదవి జిల్లా అధ్యక్షుడి తరువాత ప్రాధాన్యత కలిగిన పోస్టు. ప్రధాన కార్యదర్శులు ఒకరు లేదా ఇద్దరు, ప్రాంతాల వారీగా ముగ్గురు, నలుగురు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రధాన కార్యర్శులే జిల్లా వ్యాప్తంగా 58 మంది ఉన్నారు. జిల్లాలో మండలాలకన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శుల సంఖ్యే ఎక్కువ. కార్యదర్శులు, ఉపాధ్యక్షులు భారీ సంఖ్యలోనే ఉన్నారు. నవంబర్ 3న ప్రకటించిన డీసీసీ కార్యవర్గం జెంబోజెట్‌ను తలపించింది. 28 మంది ప్రధానకార్యదర్శులు, 16 మంది ఉపాధ్యక్షులు, 16 మంది జాయింట్, ఆర్గనైజింగ్, కార్యదర్శులు మొత్తం 65 మందితో కార్యవర్గాన్ని నియమించారు.
 
 కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గాన్ని చూసి ఇతర పార్టీలు నవ్వుకోగా, సొంత పార్టీ నేతలు అవాక్కయ్యారు. అయినారెండు నెలలుగా మళ్లీ నియామకాలు చేస్తూనే ఉన్నారు. పాత కార్యవర్గానికి సంబంధించి వ్యక్తిగతంగా ఉత్తర్వులు ఇస్తూనే, కొత్తవాళ్లను పోస్టుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకటించిన కార్యవర్గం కాకుండా ఇప్పటివరకే దాదాపు 70 మందికి వివిధ పదవులు అప్పగించారంటే పందేరం ఏ విధంగా ఉందో ఊహించడం కష్టం కాదు.
 
 ఏదైనా పార్టీ కార్యక్రమానికి ఒక్క పోస్టుకు సంబంధించిన నాయకులు వచ్చినా భారీస్థాయిలో విజయవంతమవుతుందని సొంతపార్టీ నేతలే చమత్కరిస్తున్నారు. కార్యకర్తగా కూడా పూర్తిగా ముద్రపడని వ్యక్తులకు జిల్లా ప్రాధాన్యత పోస్టులు ఇవ్వడంతో, మిగిలినవారు ఆ పోస్టులు ఇస్తామన్నా తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. డీసీసీ కాకుండా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పదవులు కూడా జిల్లాలో తక్కువేం లేవు. ఇప్పటికే పీసీసీ అధికార ప్రతినిధులు నలుగురు, ప్రధానకార్యదర్శులు ఇద్దరు, కార్యదర్శులు ఆరుగురు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు ఇద్దరు ఉన్నారు. డీసీసీ, పీసీసీ అనుబంధ విభాగాలకు జిల్లావ్యాప్తంగా వందల మంది కార్యవర్గంలో ఉన్నారు. మహిళా విభాగం, ఎస్సీ సెల్, బీసీసెల్, మైనార్టీసెల్, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, లేబర్ సెల్, లీగల్ సెల్ లకు సంబంధించిన కార్యవర్గాలు ఓ మోస్తారులో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత నియామకాలు, అనుబంధ విభాగాల్లో పదవుల్లో ఉన్న వారి సంఖ్య వేలల్లోకి చేరి కార్యకర్త అనే మాటకు తావులేకుండా చేసింది.
 
 నియామక పత్రం రెడీ
 జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ ఆధిపత్యం చాటుకోవడానికి నాయకులు ఎప్పుడూ మొహమాటపడరు. నాయకుల ఆధిపత్యానికి పార్టీ పదవులే వేదిక అవుతున్నాయి. తమ అనుయాయులకు పోస్టులు ఇప్పించుకోవడానికి యథాశక్తి నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రయత్నంచేస్తుంటారు. దీనితో అడిగిం దే తడవు డీసీసీ అధ్యక్షుడు నియామక పత్రం జారీ చేస్తున్నారు. గ్రూపులు ఎక్కువ కావడంతో ఒకరికి ఒక పోస్టు ఇస్తే, తమ వర్గానికి కూడా అదే పోస్టు ఇవ్వాలంటూ సీనియ ర్లు పట్టుపడుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, మహిళలు, గ్రూపుల్లో సమతుల్యతపాటించే క్రమంలో కాంగ్రెస్ కార్యవర్గం పదుల సంఖ్య దాటి వందల్లోకి వెళ్లింది. ఎన్నికల నాటికి ఇది రెట్టింపయ్యే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement