చంద్రబాబుకు మతి భ్రమించింది

Koramutla Srinivasulu Slams Chandrababu naidu - Sakshi

రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దిగజారుస్తున్నారు

నా ఓటు ఎవరికి పడిందో తెలియదని  సీఎం అనడం హాస్యాస్పదం

కొరముట్ల శ్రీనివాసులు, పి.రవీంద్రనాథ్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌/కోటిరెడ్డి సర్కిల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు మతి భ్రమించిందని, మెదడుకు, నాలుకకు సంబంధం లేకుండా ఆయన మాట్లాడుతున్నారని రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మంగళవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే కసితో ఓట్లు వేశారన్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి ముఖ్యమంత్రి ప్రవర్తన విచిత్రంగా ఉందన్నారు. గ్రామీణ ప్రజలు కూడా తమ ఓటు ఎవరికి పడిందో స్పష్టంగా తెలుసుకున్నారని, చంద్రబాబు మాత్రం నా ఓటు ఎవరికి పడిందో తెలియదనడం దారుణమన్నారు. ఇదంతా చూస్తుంటే ఆయన మెదడు పనిచేస్తుందా...లేక ఓడిపోతున్నాననే భయంతో ఇలా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల గౌరవాన్ని దిగజారుస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి పక్కరాష్ట్రాల నేతలు నవ్వుకుంటున్నారన్నారు. 2014లో ఇవే ఈవీఎంల వల్లే సీఎం అయిన చంద్రబాబు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని దోచుకున్నారని ధ్వజమెత్తారు. పాలించడానికి చేతగాక ఈవీఎంలపై, ఈసీపై నెపం వేయడం సరికాదని హితవు పలికారు.

టీడీపీ పాలనలో మహిళలను అవమానించినా, తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చినా రక్షించలేకపోయారన్నారు. బాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు మంచి నాయకున్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని నిర్ణయించుకొని వైఎస్‌ జగన్‌కు ఓటేసి మార్పునకు శ్రీకారం చుట్టారన్నారు. నిన్నటి వరకు ఈవీఎంలు పనిచేయలేదు, ఈసీ సరిగా పనిచేయలేదని విమర్శలు చేసి నేడు 140 సీట్లలో గెలుస్తున్నామని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారా, ఎలా అన్ని సీట్లు గెలుస్తామంటున్నారని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల వేళ కూడా టీడీపీ నాయకులు ఎన్నో కుట్రలు పన్నారని, దాడులు, దౌర్జన్యాలతో పోలింగ్‌ జరక్కుండా అడ్డుకోవాలని చూశారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులపై కూడా దాడులకు పాల్పడ్డారని, తమకు ఓటేయకపోతే చంపేస్తామని బెదిరించారన్నారు. అయినా ప్రజలు వీటినీ లెక్క చేయకుండా ఓటేశారన్నారు. ప్రజలు ఐదేళ్లు అధికారం ఇస్తే ఒక్క మంచి కార్యక్రమం చేపట్టని మీకు మాట్లాడే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లు దోచుకొని ఎన్నికల ముందు పసుపు, కుంకుమ చెక్కలిచ్చి, పింఛన్లు పెంచితే ఓటు వేయడానికి ప్రజలు అమాయకులు కాదన్నారు. గాలి, వాన, చలి, ఎండను లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని, ప్రతి సగటు మనిషి ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రకటించారన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే రోజు కోసం ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తున్నారన్నారు.

ప్రజాసామ్యం ఉంది కాబట్టే చంద్రబాబు ఆటలు సాగుతున్నాయి
మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టే చంద్రబాబు ఆటలు సాగుతున్నాయని, గల్ఫ్‌ దేశాల్లో అయితే పచ్చి అబద్ధాలు అడే ఇలాంటి నాయకున్ని ఉరి తీసేవారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఐదేళ్లుగా ప్రజలను మభ్యపెడుతూనే చంద్రబాబు కాలం వెళ్లబుచ్చారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌తోపాటు అప్పు తీసుకొచ్చిన రూ.2.60లక్షల కోట్లు చంద్రబాబు జేబులోకే పోయాయన్నా రు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను మోసపుచ్చడానికే ఆయన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంత పాలన అందిస్తేనే 2009లో కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని, ఇంత చెత్త పాలన అందించిన చంద్రబాబుకు ఎన్నిసీట్లు వస్తాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రఘునాథరెడ్డి, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top