
గుంటూరువెస్ట్: రాష్ట్రాన్ని విడదీయడమే మంచిదైందని, దీన్ని కొందరు విమర్శించినా విభజన వల్ల మనకు పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు లభించాయని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. విభజన వల్ల వచ్చిన అవకాశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందన్నారు. జనాభాలో 50 శాతం మంది మహిళలున్న ఈ సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలను ఎంపికచేసి 50 మందికి రూ.5,000, 50 మందికి రూ.3,500 చొప్పున నగదును అందజేశారు.