కిరణ్‌గారు.. కురిపిస్తారా కరుణ! | kirankumar reddy sir please do help for phailin victims | Sakshi
Sakshi News home page

కిరణ్‌గారు.. కురిపిస్తారా కరుణ!

Oct 30 2013 5:27 AM | Updated on Jul 29 2019 5:28 PM

ఖరీఫ్ సీజన్ దాదాపు చివరి వరకు వర్షాభావం.. ఈ నెలలో మొదట ఫై-లీన్ ప్రచండ దాడి.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం కళ్లజూసిన జిల్లా ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చేస్తోంది.

 సాక్షి  ప్రతినిధి, శ్రీకాకుళం:  ఖరీఫ్ సీజన్ దాదాపు చివరి వరకు వర్షాభావం.. ఈ నెలలో మొదట ఫై-లీన్ ప్రచండ దాడి.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం కళ్లజూసిన జిల్లా ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చేస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళుతున్నారు.. తప్పితే బాధితులకు నిర్ధిష్టమై సాయమేదీ ఇంతవరకు అందలేదు. ఫై-లీన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల రైతులు, ప్రజలు ఇప్పటికీ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చి వెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలతో జిల్లా మొత్తం కుదేలైంది. వరి తదితర ఆహార, వాణిజ్య పంటలు, ఇతర ఆస్తులకు అంచనాకు అందని నష్టం వాటిల్లింది.

రోడ్లు తెగిపోయి, జలదిగ్బంధంలో చిక్కుకుని శ్రీకాకుళం పట్టణంతోపాటు వందలాది గ్రామాల్లో జనజీవనం  స్తంభించిపోయింది. పనులు కూడా చేసుకోలేని దుస్థితి. పంటలు పోయి రైతులు, ఉపాధి లేక కూలీలు, ఇతర వర్గాల ప్రజలు బిత్తర చూపులు చూస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పాలకులు, ప్రజాప్రతినిధులు పరామర్శలు, ఉత్తుత్తి హామీలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ తరుణంలో వరద నష్టాల పరిశీలనకు బుధవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఈసారైనా కరుణించకపోతారా!.. అన్న ఆశతో బాధితులు ఎదురు చూస్తున్నారు. వాస్తవిక దృక్పథంతో అన్ని రంగాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి వారు ఆశిస్తున్నవి ఇవి...
   వర్షాల నష్టాలపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. పంటలతోపాటు ఆస్తులు, ప్రభుత్వ విభాగాలకు వాటిల్లిన నష్టం రూ. 400 కోట్లుగా తేల్చారు. ఇందులో రూ. 260 కోట్లు వరి పంట నష్టంగా పేర్కొన్నారు. ఇంకా ఎన్యూమరేషనే జరగని పరిస్థితుల్లో వేసిన ఈ అంచనాకు.. చివరి తేలే వాస్తవ నష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు. చేతికి వచ్చే దశలో నీటిపాలు కావడంతో వరి పంట పూర్తిగా పోయినట్లే. అందువల్ల ఆ ఒక్క నష్టమే సుమారు రూ.800 కోట్లు ఉంటుంది. ఇతర రంగాల నష్టం దీనికి అదనం. పూర్తి పంట పోయినట్లు పరిగణించి పరిహారం ఇవ్వాలన్నది రైతుల విన్నపం.
   భారీ వర్షాలకు ఆరుగురు చనిపోగా 1.80 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. 34 మండలాల్లో 138 గ్రామాలు భారీ వర్షాల బారిన పడ్డాయి. లక్షల మంది ప్రజలు మూడు రోజుల పాటు అన్నం లేకుండా నీటిలోనే గడిపారు. ప్రభుత్వ తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసినా ఇళ్లలోని వస్తువులు నీటి మునిగి పనికి రాకుండా పోయాయి. అలాగే 4వేలకుపైగా ఇళ్లు పూర్తిగానో.. పాక్షికంగానో దెబ్బతిన్నాయి. గూడు కోల్పోయని వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి.
   బ్యాంకుల నుంచి ఈ సీజనులో రైతులు సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వాటిని రద్దు చేయాలని రైతులు         కోరుతున్నారు.
   ప్రైవేట్ రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులుగా పెట్టినవారు, కౌలు రైతులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తించి తగిన చేయూతనందించాలి.
   వరద బాధిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన కుటుంబాల్లోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు రద్దు చేయాలి.
   దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి పథకాలు, చెరువులు, కాలువలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలి.
   పై-లీన్ తుపాను దెబ్బకు నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులకు ఎకరా యూనిట్‌గా, ఫలసాయాన్ని, చెట్ల జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలి.
   వలలు, పడవలు కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వాటిని సమకూర్చుకునేందుకు తగిన చేయూతనందించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement