breaking news
phailin victims
-
మిగిలింది కన్నీరే..
శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను, తర్వాత వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలన్నీ పూర్తి స్థాయిలో దెబ్బతినటంతో జిల్లాలోని రైతులు ఇప్పట్లో కోలుకునే అవకాశం కనిపించటం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందకపోవటం, అందుతుందన్న భరోసా లేకపోవటమే ఇందుకు కారణం. మరోవైపు బోట్లు, వలలు కోల్పోయిన మత్స్యకారులు, ఇళ్లు కూలిన పేదల పరిస్థితీ ఇలాగే ఉంది. సహాయ చర్యలు నత్తనడకన సాగుతుండటంతో బాధితులందరికీ కన్నీరే మిగిలింది. ఇప్పటికీ అందని అప్పటి పెట్టుబడి రాయితీ గతంలో నీలం తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు మంజూరు చేసిన పెట్టుబడి రాయితీని వారం రోజుల్లో అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ పది రోజులవుతున్నా ఒక్కరికీ అందలేదు. మరోవైపు, ప్రస్తుత పంట నష్టాలపై అధికారులు సీఎం కిరణ్‌కు సమర్పించిన నష్టాల అంచనాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. చాలా ప్రాంతాల్లోని వరి తదితర పంటలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అధికారులు నష్టాలను ఎలా అంచనా వేశారనేది సందేహాలు కలిగిస్తోంది. వాస్తవ నష్టం రూ.1600 కోట్లు! పై-లీన్ తుపాను వల్ల జిల్లాలో రూ.432 కోట్లు, భారీ వర్షాల కారణంగా రూ.529.17 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నివేదికలను సీఎం కిరణ్‌కు అందజేశారు. వాస్తవానికి క్షేత్ర స్థాయికి వెళ్లి సరైన విధంగా అంచనాలు రూపొందిస్తే నష్టాల మొత్తం 1600 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని అధికారులే ప్రైవేట్ సంభాషణల్లో చెబుతున్నారు. కౌలు రైతుకు సహాయం అందేనా పంటలు పూర్తిగా దెబ్బతినటంతో కౌలు రైతులు పూర్తిగా కుదేలయ్యారు. వీరికి సైతం నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ సీఎం హామీ అమలుపై కౌలు రైతులకు ఎన్నో సందేహాలున్నాయి. ఇప్పటికే అప్పుల పాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోకపోతే జీవితాంతం కోలుకోలేమని వారు వాపోతున్నారు. బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా బాధితులు విశ్వసించటం లేదు. సీఎం మాటలను బట్టి రుణాల మాఫీ జరిగే అవకాశం లేదని స్పష్టమవటంతో ఆందోళన చెందుతున్నారు. హామీలే తప్ప నిధులేవీ? వరద బాధితులకు అదన ంగా బియ్యం, వంటపాత్రల కొనుగోలుకు నగదు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఇది జరిగే పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే దీనికి కారణం. జిల్లాలో కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. వేలాది చెరువులు, కాలువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. తాగునీటి పథకాలు పనికిరాకుండా పోయాయి. దీంతో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు రూ.700 కోట్లకు పైగా అవసరమమని అధికారులు చెబుతున్నారు. బాధితులకు తక్షణ సహాయం కూడా సకాలంలో అందించలేని రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనకు ఇంత మొత్తాన్ని విడుదల చేసే పరిస్థితి లేనేలేదు. సమస్యపై పోరాడాల్సిన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు మిగిలేది కన్నీరు కాక మరేమిటి? -
కిరణ్‌గారు.. కురిపిస్తారా కరుణ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఖరీఫ్ సీజన్ దాదాపు చివరి వరకు వర్షాభావం.. ఈ నెలలో మొదట ఫై-లీన్ ప్రచండ దాడి.. ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అపార నష్టం కళ్లజూసిన జిల్లా ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురు చేస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళుతున్నారు.. తప్పితే బాధితులకు నిర్ధిష్టమై సాయమేదీ ఇంతవరకు అందలేదు. ఫై-లీన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల రైతులు, ప్రజలు ఇప్పటికీ సాయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వచ్చి వెళ్లినా ఫలితం లేకపోయింది. తాజాగా వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలతో జిల్లా మొత్తం కుదేలైంది. వరి తదితర ఆహార, వాణిజ్య పంటలు, ఇతర ఆస్తులకు అంచనాకు అందని నష్టం వాటిల్లింది. రోడ్లు తెగిపోయి, జలదిగ్బంధంలో చిక్కుకుని శ్రీకాకుళం పట్టణంతోపాటు వందలాది గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయింది. పనులు కూడా చేసుకోలేని దుస్థితి. పంటలు పోయి రైతులు, ఉపాధి లేక కూలీలు, ఇతర వర్గాల ప్రజలు బిత్తర చూపులు చూస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన పాలకులు, ప్రజాప్రతినిధులు పరామర్శలు, ఉత్తుత్తి హామీలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ తరుణంలో వరద నష్టాల పరిశీలనకు బుధవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఈసారైనా కరుణించకపోతారా!.. అన్న ఆశతో బాధితులు ఎదురు చూస్తున్నారు. వాస్తవిక దృక్పథంతో అన్ని రంగాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సాయం అందించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి వారు ఆశిస్తున్నవి ఇవి... వర్షాల నష్టాలపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. పంటలతోపాటు ఆస్తులు, ప్రభుత్వ విభాగాలకు వాటిల్లిన నష్టం రూ. 400 కోట్లుగా తేల్చారు. ఇందులో రూ. 260 కోట్లు వరి పంట నష్టంగా పేర్కొన్నారు. ఇంకా ఎన్యూమరేషనే జరగని పరిస్థితుల్లో వేసిన ఈ అంచనాకు.. చివరి తేలే వాస్తవ నష్టానికి చాలా వ్యత్యాసం ఉంటుందంటున్నారు. చేతికి వచ్చే దశలో నీటిపాలు కావడంతో వరి పంట పూర్తిగా పోయినట్లే. అందువల్ల ఆ ఒక్క నష్టమే సుమారు రూ.800 కోట్లు ఉంటుంది. ఇతర రంగాల నష్టం దీనికి అదనం. పూర్తి పంట పోయినట్లు పరిగణించి పరిహారం ఇవ్వాలన్నది రైతుల విన్నపం. భారీ వర్షాలకు ఆరుగురు చనిపోగా 1.80 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. 34 మండలాల్లో 138 గ్రామాలు భారీ వర్షాల బారిన పడ్డాయి. లక్షల మంది ప్రజలు మూడు రోజుల పాటు అన్నం లేకుండా నీటిలోనే గడిపారు. ప్రభుత్వ తాత్కాలికంగా శిబిరాలు ఏర్పాటు చేసినా ఇళ్లలోని వస్తువులు నీటి మునిగి పనికి రాకుండా పోయాయి. అలాగే 4వేలకుపైగా ఇళ్లు పూర్తిగానో.. పాక్షికంగానో దెబ్బతిన్నాయి. గూడు కోల్పోయని వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి. బ్యాంకుల నుంచి ఈ సీజనులో రైతులు సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. వాటిని రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రైవేట్ రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులుగా పెట్టినవారు, కౌలు రైతులు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇటువంటి వారిని గుర్తించి తగిన చేయూతనందించాలి. వరద బాధిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన కుటుంబాల్లోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజులు రద్దు చేయాలి. దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి పథకాలు, చెరువులు, కాలువలను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలి. పై-లీన్ తుపాను దెబ్బకు నష్టపోయిన కొబ్బరి, జీడి రైతులకు ఎకరా యూనిట్‌గా, ఫలసాయాన్ని, చెట్ల జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలి. వలలు, పడవలు కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వాటిని సమకూర్చుకునేందుకు తగిన చేయూతనందించాలి.