ప్రజా విజయ 'కిరణం'

Gorle Kiran Kumar Won In Etcherla - Sakshi

వైఎస్సార్‌సీపీ భారీ విజయం

ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్‌

అత్యధిక మెజార్టీతో గెలుపు

సాక్షి, ఎచ్చెర్ల (శ్రీకాకుళం): ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్ట నష్టాలు చూసిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న ఆధరాభిమానాలు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్‌ కుమార్‌కు ఎమ్మెల్యేగా ప్రజలు భారీ మెజార్టీతో పట్టంకట్టారు.గురువారం విడుదలైన 2019 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, పార్లమెంట్‌ స్థానాల్లో భారీ గెలుపుతో ఫ్యాన్‌ స్పీడ్‌ విజయకేతం ఎగురవేసింది. టీడీపీ అరాచక, అవినీతి పాలనను అనుభవిస్తూ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందక, మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడ్డారు. ఈ తరుణంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజలు కష్టాలు తెలుసుకున్నారు. ప్రజాసంక్షేమం కోసం పరితపించే జననేత వచ్చారని, ఐదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు ఉండవని, జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలనతో పాటు నవరత్నాల పథకాలు తమ జీవితాల్లో వెలుగులు నింపుతాయని  సార్వత్రిక ఎన్నికల కోసం ఎదురుచూశారు.

టీడీపీ అరాచక పాలనతో విసుగెత్తిన ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున గొర్లె కిరణ్‌కుమార్, టీడీపీ నుంచి కిమిడి కళా వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి ప్రజలతో మమైకమై ప్రజా కష్టాలు తెలుసుకున్నారు.  ఈ మేరకు ఏప్రిల్‌ 11వ తేదీన పోలింగ్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి బారులు తీరి ఓటేశారు. వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. వైఎస్సార్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. గురువారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అనుహ్య మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొర్లె కిరణ్‌కుమార్‌ను గెలిపించారు. మండలంలోని 115 పంచాయతీల్లో అన్ని గ్రామాలు వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చి ప్రజలు వైఎస్సార్‌సీపీపై ఉన్న ఆదరాభిమానాన్ని చాటుకున్నారు.

వైఎస్సార్‌సీపీదే ఆధిక్యత
ఎచ్చెర్ల నియోజకవర్గంలో జి.సిగడాం, లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో అన్ని రౌండ్‌ల్లోనూ వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. ఏ దశలోనూ కనీసం టీడీపీ పోటీ ఇవ్వలేకపోయింది.కళా వెంకట్రావుపై గొర్లె కిరణ్‌కుమార్‌ అనూహ్యంగా విజయం సాధించారు. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. గొర్లె కిరణ్‌కుమార్‌ 18,813 ఓట్ల ఆధిక్యతతో టీడీపీకి చెందిన కళా వెంకట్రావుపై గెలిచారు.

పనిచేయని ఈవీఎంలు 
ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే ఓట్ల కౌంటింగ్‌లో రెండు ఈవీఎంలు  మొరాయించాయి. 45వ పోలింగ్‌ కేంద్రం నిద్దాం ప్రాంతానికి చెందిన ఈవీఎం, 172 కొవ్వాడకు చెందిన ఈవీఎంలు పనిచేయలేదు. ఓట్లు డిస్‌ప్లే కాకపోవడంతో ఆయా ఈవీఎంలను కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు సరెండర్‌ చేశారు. వీటి స్థానంలో వీవీ ప్యాట్‌లను లెక్కించి పరిగణనలోకి తీసుకున్నారు. స్పష్టమైన మెజార్టీ ఉండడంతో రాజకీయ పార్టీ ఏజెంట్లు సైతం ఎటువంటి అభ్యంతరం తెలియజేయలేదు.

మొరాయించిన 168వ నంబర్‌ పోలింగ్‌ ఈవీఎం
విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ ఓటింగ్‌ కౌంటింగ్‌కు సంబంధించి ఎచ్చెర్ల నియోజకవర్గంలో మెంటాడకు చెందిన 168వ పోలింగ్‌ కేంద్రం పనిచేయలేదు. ఈవీఎం స్థానంలో వీవీప్యాట్‌ను అధికారులు లెక్కించారు. ఈ కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి– 335. టీడీపీకి–229 ఓట్లు, జనసేన–4 నమోదయ్యాయి. మిగిలిన ఓట్లు ఇతరకు నమోదయ్యాయి.

ఎంపీకి స్పష్టమైన ఆధిక్యత
వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. 14,476 ఓట్లు ఆధిక్యత వచ్చింది. సుమారు 23 రౌండ్‌లో 22 ఆధిక్యం కొనసాగింది. బెల్లాన చంద్రశేఖర్‌ 96112 ఓట్లు, ప్రత్యర్థి టీడీపీకి చెందిన ఎంపీ అశోక్‌కు 81636 ఓట్లు, జనసేన అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావుకు 4530, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆదిరాజుకు 2134 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 1,94,538 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు.

కౌంటింగ్‌ను పరిశీలించిన కిరణ్‌కుమార్‌
శివానీ ఇంజినీరింగ్‌ కాలేజీలో జరిగిన కౌంటింగ ప్రక్రియను గొర్లె కిరణ్‌కుమార్‌ పరిశీలించారు. తనకు మెజార్టీ వచ్చిన రౌండ్లు, గ్రామాలు పరిశీలించారు. జనరల్‌ ఏజెంట్లు పిన్నింటి సాయికుమార్, ఎం.మురళీధర్‌ బాబా పోలింగ్‌ సరళిని ఆయనకు వివరించారు. మెజార్టీ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్, సర్వీసు ఓట్ల వివరాలు
ఎచ్చెర్ల క్యాంపస్‌: విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించిన పోస్టల్‌ బ్యాలెట్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సగానికి పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో 1394 ఓట్లు వినియోగించుకోగా 726 ఓట్లు చెల్లలేదు. 668 ఓట్లు నమోదయ్యాయి. మూడు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. 326 ఓట్లు వైఎస్సార్‌సీపీకి మెజార్టీ లభించింది.

పోస్టల్‌ బ్యాలెట్‌లో నమోదైన ఓట్ల వివరాలు
వైఎస్సార్‌సీపీ– 479,  టీడీపీ– 153, జనసేన–42, కాంగ్రెస్‌–3, నోటా–5 తిరస్కరణ–3 మొత్తం– 685

422 సర్వీసులు ఓట్ల వినియోగం
ఎచ్చెర్ల క్యాంపస్‌: ఎచ్చెర్ల జోన్‌లో 422 సర్వీసు ఓటర్ల నమోదయ్యాయి. ఇందులో 333 ఓట్లు చెల్లిన ఓట్లు 123,. టీడీపీకి–118, బీజీపే–34, జనసేన–51, కాంగ్రెస్‌–6, ఒక ఓటు తిరస్కరణకు గురైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top