సీఎం కిరణ్ రైతు వ్యతిరేకి గా మారారని బీజేపీ జాతీయ కార్యదర్శి న ల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు.
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: సీఎం కిరణ్ రైతు వ్యతిరేకి గా మారారని బీజేపీ జాతీయ కార్యదర్శి న ల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలోని బాలాజీ గార్డెన్స్‌లో సోమవారం బీజేపీ అసెంబ్లీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల సమస్యలను పట్టించుకోని కిరణ్.. వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతులపై రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్‌ఆర్) ప్రయోగించేందుకు సిద్ధమవుతుండడం సిగ్గుచేటన్నారు. వేల కోట్లు బకాయి పడిన పెద్దలను వదిలేసి రైతాంగాన్ని వేధించడం సమంజసం కాదన్నారు. రైతులను దెబ్బతీసే చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చకు రాకపోవడం ఇరు ప్రాంతాలకూ నష్టమేనన్నారు. సీడబ్ల్యూసీలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం జరిగేంతవరకు మౌనంగా ఉన్న కిరణ్ ఇప్పుడు సమైక్యం అంటూ రాగం ఎత్తుకోవడం సమంజసం కాదన్నారు.
రాచకాల్వకు మరమ్మతులు చేయాలి..
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు నీరందించే రాచకాల్వకు వెంటనే మరమ్మతులు చేయించాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. హిమాయత్‌సాగర్ నీరు గతంలో రాచకాల్వ ద్వారా పెద్ద చెరువులోకి వచ్చేదని, రాచకాల్వ కబ్జాకు గురికావడం వల్ల ఇప్పుడు నీరు రావడంలేదని అన్నారు.
భువనగిరి నుంచి పోటీ..?
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని ఇంద్రసేనారెడ్డి అసెంబ్లీ పదాధికారుల సమావేశంలో పిలుపునిచ్చారు.
‘బూత్ దర్శన్’ పేరిట గ్రామాల్లో నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీలోగా ‘బూత్ దర్శన్’ కార్యక్రమాలను పూర్తిచేయాలని కోరారు. వివిధ పాఠశాలల్లో నిర్వహించే పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తరఫున బహుమతులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహంతో కూడిన ఎనిమిది రథాలను ఇబ్రహీంపట్నంలో సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. అదే విధంగా ప్రధాన కేంద్రాల్లో టీలు విక్రయించే వారికి పార్టీ తరఫున బనియన్లను బహూకరించనున్నట్లు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అసెంబ్లీ క న్వీనర్ ముత్యాల భాస్కర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి వెంకట్రామయ్య, రాష్ట్ర నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, బొక్కా నర్సింహారెడ్డి, బోజిరెడ్డి, నాయిని సత్యనారాయణ, బండి మహేశ్, గోగిరెడ్డి లచ్చిరెడ్డితోపాటు జిల్లా, మండల నాయకులు దొండ రమణారెడ్డి, కంచకట్ల భాస్కర్, టేకుల రాంరెడ్డి, కాళిదాసు, జక్కా రవీందర్‌రెడ్డి, డేరంగుల రాజు, కొప్పు బాషా, జగదీశ్, అంజయ్య యాదవ్, రాజు గౌడ్, శ్రీధర్‌రెడ్డి, డి.భాషయ్య, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.